Wednesday, September 20, 2017

అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

శీర్షిక :
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
అక్కచెల్లి కలిసి... తల్లికూతురు కలిసి
అత్త కోడళ్ళతో... ఆడబిడ్డలతో
ఇరుగుపొరుగు కలిసి... వీధివాడకలిసి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
తంగేడు పూలను... తెల్లనీ గునుగును...
ముత్యాల పూలనూ.. నేలచామంతినీ...
పల్లెములో పేర్చి... బతుకమ్మను కూర్చి...
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
పట్టుచీరలు కట్టి.. బంగారు నగలేసి
కాళ్ళకూ పట్టీలు.. నిండగాజులు తొడిగి..
నడుముకు నిండుగా వడ్డాలము తొడిగి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
నాటి రాజుల కథలు... పురాణ గాధలు
దేవుళ్ళ పాటలు... జానపద గీతాలు
పాటకు తగ్గట్టు చప్పట్లు కొట్టుతూ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
అత్తింటి కష్టాలు.. అమ్మింటి ముచ్చట్లు
చిన్ననాటి చిలిపి చేతలు గుర్తులు
ముచ్చటించుకుంటు.. మురుపమెంతో పడుతు
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
పెత్తరమాసంతో ఎంగిళ్ళ పండుగ
సద్దులతో ముగియు బతుకమ్మ పండుగ
తొమ్మిది సద్దులు.. నైవేద్యమే పెట్టి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
చెరువు గట్టు కాడ... దేవునీ ముంగిట
వీధి కూడళ్ళలో... ఇంటి వాకిట్లలో
బతుకమ్మను ఆడి... చెరువులో వేయంగ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
చెరువులో మురికిని... నీటిశుబ్రతకునూ
బతుకమ్మ పూవులు మేలెంతో చేయునూ
పకృతి మేలుకు, సంస్కృతి జాగృతికి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007654

No comments:

Post a Comment