Monday, April 13, 2020

విధి వంచిత (పద్య రూపము)

విధి వంచిత (పద్య రూపము)
రచన: గోగులపాటి కృష్ణమోహన్


విధి వంచిత
(పద్య రూపము)

తనపెనిమిటితోనె తాసుఖమొందగ
తలచుకొను మగువ తనివి తీర

తానొకటి తలిచె దైవమొకటి దల్చు
తల్లిదండ్రి కనక తల్లడిల్లు

తిండిలేక నొకరు, తిండరుగకొకరు
తోడులేక నొకరు తొండి కొకరు

అవసరమున కొక్క రానందమని యొక్క
రాసరాకని యొక్క  రాస్తికొకరు

పడుపు వృత్తి లోన పడదురు పడతులు
బాధలెన్నొ తాము పడుచు నెపుడు
సుఖముదేవుడెరుగు ముఖము మాయముకాగ
సఖుడు దెలియడాయె సంతసంబు

అద్దె నవ్వు తోడ నలరించు నొకచోట
మనసు లోన బాధ కనగ రాక
సుఖము లోన దుఃఖ సూత్రము దాచుచు
నఖము కాటునందు ముఖము దాచు

వనిత కాదు తాను వ్యభిచార కాంతగా
చెప్పులోకమందు చెడుగనెపుడు
ముప్పు జీవితాన నెప్పడో తెలిసినా
నిప్పు కొంగు దాచి గుట్టు విడదు.

సుఖము మాట కాదు సుందరమే లేక
అందమంత వైరి చందమగును
కందినట్టి బ్రతుకు గండమారోగ్యము
చెడిన జీవితాన చెదలువారె

దమ్ము కొట్టి ఒకడు.... దంచితాగియొకడు
కంపు కొట్టు నొకడు కాట్లుబెట్టు
బుద్దిలేక నొకడు బూట్లతో తన్నుచు
బండ బూతులాడి బాధ పెట్టు

చేరి జీవిత మంతయు చేటుగూర్చి
వనిత బతుకువేటు నెపుడు బడుచునుండు
సుఖము గాదది జెప్పగ నఖపు కాటు
శాప వశముచే బ్రతుకును సాగదీసె.

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 🌹
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653