Wednesday, December 30, 2015

పల్లె గుల్లాయెగా

                         శీర్షిక : పల్లె గుల్లాయెగా


పట్నం షోకులో పల్లె కాస్త కాలయ్యింది
పచ్చని చెట్లు... పంట పొలాలు ....
బాయిల నీళ్ళు.... చెరువుల చేపలు...
అన్నీ నేడు కథలుగా మారాయి
మోట బావులు పోయి మోటార్లు వచ్చె
ఎడ్ల బండ్లు బోయి ట్రాక్టర్లు వచ్చే
నాట్లు వేసినాము... కలుపు తీసినాము,
కోత కోసినాము... కుప్ప బెట్టినాము...
దొడ్ల ఉన్న అన్ని గొడ్ల తోటి
బంతి తొక్కుకుంటు గంతులేసినాము....
తవ్వ, శెరు, బుడ్డి, కుండ బస్త లతోటి.
పుట్ల కొద్ది వడ్లు లెక్క కొలిసినాము...
కొత్త బియ్యము తోటి కొత్తలే చేశాము....
ఆనందమంతా మా ఊర్లనే గడిపాము...
వడ్లోల్ల తాత తో నాగలే చెక్కించి
కమ్మరి కొలిమిలో కర్రులే కాల్చాము
కుమ్మరి చేసేటి కుండలతో ఆడాము
చిన్న సైకిలు ఎక్కి ఊరంతా తిరిగాము
కొత్త బట్టలు కుట్ట మేరోల ఇంటికి
పూటపూటకు వెళ్లి తిరిగి వచ్చాము
అంగి గుండీలు లేకున్న పిన్నీసు పెట్టికొని
పండుగంత అట్లే వెళ్ళదీసాము...
పీర్ల పండుగనాడు ఆల్వ ఆడినాము
హోళి పండుగనాడు రంగులాడినాము
బుర్రకథల వాళ్ళు, బుడుమక్కలోళ్ళు
తోలుబొమ్మలాట... బాగోతులాట...
రచ్చబండకాడ పెద్దోళ్ళ ముచ్చట్లు
రాత్రి బడులకాడ పిల్లోల ముచ్చట్లు
ఎంతబాగుబాగు మా ఊరు నాడు
చేతివృత్తుల వారు నేడు కరువయ్యినారు
ఆటలాడువారు ఆగమయ్యారు
పనిలేక కొందరూ... షోకులకు కొందరు
ఆలిపోరుతో కొందరు, చదువులకు కొందరూ
పల్లెవిడిచినారు... బోసి చేసినారు...
పల్లె ప్రేమలన్నీ మంటకలిసేనుగా
పట్నం మోజులో పల్లె గుల్లాయెగా

Tuesday, December 29, 2015

నగరంలో నిత్య నరకం

                        అంశం : ట్రాఫిక్ సమస్య

శీర్షిక : నగరంలో నిత్య నరకం


నరకమంటే ఏంటో నగరమొస్తే తెలుస్తది
బడికి వెళ్ళాలంటే బస్సులోన జనం
డ్యూటికెల్లాలంటే ఆటోలోన జనం
బైకుమీద వెళ్తే రోడ్డు మీద జనం
రైలు కోసమెళ్తే స్టేషనంత జనం
సినిమా హాలు కెళ్తే లైనులోన జనం
ఏ మార్కెట్లో చూసినా జనమే జనం
చీరకొందామంటే షాపులోన జనం
కూర కొందామంటే మార్కెట్లో జనం
రోగమొచ్చెనంటే దవాఖానలో జనం
రైతు బజారులో, చైన బజారులో...
బిగ్ బజార్ లో, బేగం బజార్ లో..
బేజారు బేజారు జనంతో బేజారు
కల్లు కంపౌండ్ లో జనం
సార దుకాణములో జనం
వైన్స్ షాపులోన జనం
బారుషాపుముందు బార్లు తీరిన జనం
బళ్ళలోన జనం, గుళ్ళ లోన జనం
ఎయిర్ పోర్టులో జనం
ఎయిర్ బస్సులో జనం
బీచ్ కెళ్తే జనం, బ్లీచ్ కెళ్తే జనం
ఎక్కడికెల్లినా జనం జనం
అనుభవిస్తున్నాము దినం దినం
నగరమందు మేము నిత్య నరకం...

మారిన విలువలు

శీర్షిక : మారిన విలువలు

తల్లికిచ్చేవిలువ అత్తకిస్తుండ్రు
ఆలికిచ్చే విలువ వెలయాలకి ఇస్తుండ్రు
దొరకు ఇచ్చే విలువ దొంగకిస్తుండ్రు
రాజు కిచ్చే విలువ రౌడీకి ఇస్తుండ్రు
ఓటుకిచ్చే విలువ నోటు కిస్తుండ్రు
మంచికిచ్చే విలువ చెడుకు ఇస్తుండ్రు
చదువుకిచ్చే విలువ కులముకిస్తుండ్రు
గుణముకిచ్చే విలువ ధనముకు ఇస్తుండ్రు
ప్రేమకిచ్చే విలువ ద్వేషానికిస్తుండ్రు
మనవారికిచ్చే విలువ పరులకు ఇస్తుండ్రు
విలువల కొరకు నీవు దిగులుపడబోకు
విలువలన్నవి నేడు బాయిలో నీళ్ళు....

Monday, December 28, 2015

యాగం - యోగం


                       శీర్షిక : యాగం - యోగం


సర్ప యాగం తలపెట్టె జనమేజయుడు నాడు నాగజాతి నుండి రక్షణ కొరకు

రాజసూయ యాగం తలపెట్ట దర్మరాజు రాజ్యాసూయ తొలగించ దలిచి

పుత్రకామేష్టి యాగం తలపెట్టి దశరథుడు రామ, లక్ష్మణ, భరత శత్రఙ్ఞులను పొందె..

విశ్వజిత్‌ యాగం తలపెట్టె బలి నాడు... సర్వదాస్తులను దానము చేసెను...

వరుణయాగం చేసి రాజశేఖర్ రెడ్డి వర్షాలు కురిపించ తలచి నాడు

పుష్పయాగాన్ని తలపెట్టె తిరుమలలో...
దుర్భిక్ష నివారణ కోరి కార్తీకాన....

ఆహోరాత్ర యాగము తలపెట్టె ఆంద్రలో...
వినాశాలు, ఉగ్రవాదాలు తగ్గాలని కోరుతూ...

అయిత చంఢీయాగము తలపెట్టె కేసీఆర్...
బంగారు తెలంగాణ సు భవిష్యత్ కోరి...

ఆలుమగల అంగీకారం


                    శీర్షిక : ఆలుమగల అంగీకారం

ఆలుమగల మద్య సఖ్యతుండవలెనన్న
అవగాహనతో పాటు అంగీకారాలవసరం

అత్తమామల పట్ల ప్రేమపంచాలి
అన్నదమ్ముల తోడ కలసి ఉండాలి
ఆడబిడ్డలతోటి మెలిగి ఉండాలి
దాయాదుల పట్ల ప్రేమ ఉండాలి

అనుమానాలను వదులుకోవాలి
నమ్మకాలను పెంచుకోవాలి
ఒకరపై ఒకరికి నమ్మకముండాలి
ప్రేమ ఆప్యాయతలు పంచుకోవాలి

ఇరుగు పొరుగు ముందు అరుచుకోవద్దు
పిల్ల పాపల ముందు గొడవ పడవద్దు
పెద్దవారి ముందు పంచాయతీలొద్దు
ఒద్దుగా బుద్దుగా మెదులుకోవాలి

భర్త రాబడి తగ్గ ఖర్చుచేయాలి
భార్యకు తగ్గట్టు నడుచుకోవాలి
భార్య మాటకు ఇంట్లో విలువనియ్యాలి
భర్త మాటను బయట గౌరవించాలి

అడ్డంకులు ఆపదలు ఎప్పుడూ వచ్చినా
ఒకరినొకరు కలసి ఎదురుకోవాలి
కష్టాలనెప్పుడు దిగమింగుకోవాలి
సుఖ సంతోషాలను పిల్లలకు పంచాలి

కన్నబిడ్డల మేలు కోరుకోవాలి
విద్యాబుద్దులను నేతిపించాలి
మంచి తోడును చూసి పెళ్ళి చేయాలి
ఆదర్శ దంపతులై వెలుగు నింపాలి.

అప్పుయే ఆపద్భందువు



                        శీర్షిక : " అప్పుయే ఆపద్భందువు"

చాలీ చాలని జీతాలతో కూడిన జీవితాలు
ఆదాయం తో సంబందం లేని ఆశలు, ఆశయాలు....
పిల్లలకు కార్పోరేట్ చదువులు,
ఇంజనీరింగ్ విద్యలు,
స్వంత ఇంటి కల సాకారం,
పిల్లల పెళ్ళీలు, శ్రీమంతాలు, ప్రసవాలు, మనువలు, మనవరాళ్ళు,
వీటికి తోడు ఆడపడుచులకు, అల్లుళ్ళ కు మర్యాదలు,
ఇంకా పండుగలు, పబ్బాలు,
చీరలు, సారెలు, బంగారు ఆభరణాలు...
షాపింగు లు, షేపింగులు....
విహారయాతల్రు, తీర్ధయాత్రలు, సినిమాలు, షికార్లు...
కార్లు, మోటారు బైకులు, పక్కింటితో పోటీలు...
ఇవన్నీ కాదన్నట్టు
అమ్మానాన్నలకు అనారోగ్యాలు,
ఇంటిల్లిపాదీకి తడసి మోపెడు ఆసుపత్రి బిల్లులు....
వెరసి... అప్పులకోసం తిప్పలు...
అందుకే
"అప్పుయే ఆపద్భందువు"
అని చెప్పక తప్పదు....

కల్తీ.. కల్తీ... కల్తీ....


                        శీర్షిక:- కల్తి. కల్తీ.. కల్తీ...

అయ్యో అయ్యో కల్తీ అన్నిటిలో కల్తి
లేవగానె చూడ టూతు పేస్టులో కల్తి
కాఫి తాగుదమంటే పాల లోన కల్తి
నీళ్ళుదాగుదమన్న అందులోన కల్తే
అన్నమొండుదమంటే బియ్యములో కల్తి
కూరవండుదమంటే కాయగూరలు కల్తి
పసుపు, కారం కల్తి, ఉప్పు పప్పుల కల్తి
గసగసాలు కల్తి, మసాలాలు కల్తి
స్వీటు లోన కల్తి, హాటులోన కల్తి
సబ్బులోన కల్తి, సర్ఫులోన కల్తి
షాంపులోన కల్తి, నూనెలోన కల్తి
పండ్లు తిందమన్న అందులోన కల్తె
కల్లు లోన కల్తి, సారలోన కల్తి,
పైసలెక్కువైన మద్యమందు కల్తి
ఇసుకలోన కల్తి, సిమెంటులోన కల్తి
సున్నమందు కల్తి, రంగులోన కల్తి
వస్తువులన్నీ నేడు కల్తి కల్తి
ఇరుగుపొరుగు వారి మాటలోన కల్తి
బంధుమిత్రుల పలకరింపులో కల్తి
ప్రేమికుల మధ్య ప్రేమలోన కల్తి
అన్నదమ్ముల ఆప్యాయతలో కల్తి
అయ్యో అయ్యో కల్తి అన్నిటిలో కల్తి
అమ్మ ప్రేమలో తప్ప అన్నిటిలో కల్తే
కవుల కవనముల తప్ప అంతటా కల్తే

వేదన

నవమాసాలు పెంచి పోషించింది నా అమ్మ...
ఇన్నాళ్లు రెక్కలు ముక్కలై పెంచాడు నా నాన్న
కల్తీకాలంలో... అడ్డమైన రోగాలకు అడ్డం పడుతున్నం.....
అలాగని నీ దవాఖానాకొస్తే....
కొన నాలికకు మందిచ్చి ఉన్న నాలికను ఊడ్చేసినట్టు....
రోగానికి మందియ్యక.... అవయవాలు పీకేస్తవా....
వందకాడ రెండొందలు తీసుకో బాంచన్...
కాని లచ్చలు లచ్చలు కూడబెట్టాలని అడ్డంగా అంగాలు దొంగిలించకు దొరా...
మా అమ్మ అయ్య నాకు ముల్లుగుచ్చుకుంటేనే తట్టుకోరు...
అలాంటిది నువ్వు నా వొంట్లో అవయవాలనే ఖాలీ చేస్తుంటే ఎలా ఊరుకుంటారనుకుంటున్నావు...
ఒక్కసారి ఆలోచించు... వాళ్ళకు నీ దొంగబుద్ది తెలిసిననాడు  నిన్నేమి చేస్తారో...
ఓ డాక్టరు దోరా... కాల్మొక్త సారూ....
రోగానికి మందియ్యి గాని....
మందిచ్చి రోగాలు తేకు స్వామి....

అత్యాశ

గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు.

శీర్షిక : అత్యాశ

అన్నిఉన్నా ఇంకా ఏవేవో కావాలని...
పక్కింటి ఆంటీ మెడ మెరిస్తే పాపం...
ఎదురింటి ఎంకాయమ్మ కొత్త వస్తువు కొంటే పాపం...
తోటికోడలు ప్లాటు కొంటే పాపం....
ఆడబిడ్డ ఇల్లుకొంటే పాపం....
చెల్లె చీరె కొనద్దు... అక్క డ్రస్సు కొనద్దు....
తనకన్నీ ఉన్నా... తనకన్నా ఎవరికి ఎక్కువ ఉండొద్దు అన్నదే తన ఆవేదన....ఆక్రందన..... అసూయ

ఓ నేస్తం ఇది మంచి చెడుల సమూహం

SK 326 -2
గోగులపాటి కృష్ణమోహన్, హైదరాబాద్.
శీర్షిక : మంచి చెడు.

ఓ నేస్తం ఇది మంచి చెడుల సమూహం
మంచి కనిపిస్తే పొంగిపోకు
చెడు బెదిరిస్తే క్రుంగిపోకు
ఓ నేస్తం ఇది మంచి చెడుల సమూహం

అశోకుడు ఇక్కడే పుట్టాడు
ఔరంగజేబు ఇక్కడే చచ్చాడు
గాంధీ నడిచిన చోటే గాడ్సే నడిచాడు

ఓ నేస్తం ఇది మంచి చెడుల సమూహం
మంచి కనిపిస్తే పొంగిపోకు
చెడు బెదిరిస్తే క్రుంగిపోకు
ఓ నేస్తం ఇది మంచి చెడుల సమూహం

గోగులపాటి కృష్ణమోహన్, హైదరాబాద్.

నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా


1)
సహస్ర కలములు కదలియాడెడు వేళ
కవిసమ్మేళనం కనులార వీక్షించ
వాట్సప్ వేదికై వర్దిల్లనున్నది
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

2)
సహస్రకవులకు స్వాగతంబిదే
నవ శకానికి నాంది పలుకంగ
వాట్సప్ వేదికై విజయమ్ము కాంక్షించ
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

3)
అక్రిడేషన్ కార్డు, ఆరోగ్యకార్డులు
స్వంత ఇంటి కల సాకారమవ్వక
సగటు జర్నలిస్టు సతమతమౌతుండు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

4)
యువకులెల్ల కూడ యెంజాయ్ పేరుతో
ఎవ్రీటైమ్ ఏదో తప్పుచేస్తూ
జీవితాన్ని అంత వేస్టు చేస్తుండ్రురా
నవ్యాఖిలమ్ములో జ్యొతికృష్ణా

5)
పరుల సొమ్ము చూసి పాకులాడుటకన్న
బిక్షమెత్తుకున్న గౌరవంగా ఉండు
కష్టపడితే ఉండు  ఆనందమే మెండు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

6)
దుష్ట సోపతి పట్టి దుర్మార్గమున పోకు
మంచి స్నేహముతో మేలు చేయు
తల్లిదండృలకు నీవు తలవంపు దేకురా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

7)
అప్పు అడిగే ముందు మర్యాదలిస్తారు
అప్పు తీర్చే మంటే కోపమౌతారు
అప్పులిచ్చే ముందే ఆలోచించురా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

8)
నేటి యువత చూడ బాద్యతలు మరిచారు
బంధాలు పూర్తిగ మైమరచినారు
తల్లి దండ్రులు కూడ బరువయ్యినారురా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

9)
ఇల్లువాకిలి వదిలి, ఇల్లాలిని వదిలి
వెలయాలి వెంట నీ వెల్లబోకు
కాటికెళ్ళే లోపు ఆలుబిడ్డలే గతినీకు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

10)
దనము గుణములోన ఏది మిన్నయన్న
గుణమే బహు మిన్న దనము కన్న,
మంచి గుణమున్న వానికి దనముతో పనియేల
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

11)
పాముకుండు విషము పడగ కోరలయందు
మనిషికేమో ఉండు నిలువెల్ల విషము
మొఖము చూసి మనము మోసపోవద్దు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

12)
పనిలేని పడుచులు ఒక్కచోట చేరి
పనికిమాలిన మాటలాడుబదులు
పనికివచ్చేపని ఒక్కటి చేపడితె మేలుగా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

13)
పోస్టర్లను చూసి పోవద్దు సినిమాకు
అనుచునుంటి అనుభవించి
చూపేది ఒకటయా చూసేది ఒకటయా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

14)
బయట వందపనులు బహుబాగ చేసినా
జ్యోతితోనె ఖ్యాతి ఎపుడు నాకు
జ్యోతితో ఎప్పుడూ జోకులాడబోను
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

15)
సంసార సాగరం ఈదవలయునన్న
భార్య భర్త ల మద్య సఖ్త్యతే ముఖ్యము
సఖ్యతే లేకున్న సంతోషమే సున్న
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

16)
వృత్తి జర్నలిస్టు ఊరూరు తిరిగేస్తు
వెనువెంట వార్తలను సేకరిస్తు
రొక్కంబురాకున్న రాజోలె ఉండురా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

17)
వద్దన్న తిరిగేవు వార్తలను తెచ్చేవు
పగలు రాత్రితేడ లేకనీవు
రొక్కమే తక్కువై రోజు గడుపుటాయె
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

18)
కళాచంద్రుని పేరు కళకళలాడగా
హైకు నందు అతను హైకయ్యెను గదా
కలవ పూవులతోనె కవనములు జల్లెగా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

19)
ఊరు చిత్తలూరు, వీర వీరి పేరు
మాత్ర తోనే అల్లే శతక పద్యాలు
శంభూ అంటూ రాసె వీరన్న పదాలు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

20)
ఏవిరావుగారు అన్ని వచ్చిన సారు
వచనకవితలోన సాటెవరురారు
అన్నికోనాలలో కవితరాయగలరు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

21)
ఎన్ని నోములు నోమి ఎన్ని పూజలు చేసి
ఏముంది ఫలమని భాదపడకు రామా....
పూర్వజన్మ ఫలము తప్పదు ఇలలోన
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

22)
వందపద్యములు వ్రాయ ఓపిక కావలె
ఓపికున్న వంద ఆంశంబులుండవలె
అంశమున్న కూడా అల్లిక ముఖ్యము
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

23)
మంచి కోరినేను మాలవేసినాను
ఇరుముడి కట్టుకొని శబరివెళ్తున్నాను
అయ్యప్ప దీక్షలో ఆనందముందిలే
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

24)
ఆడవారితోడ షాపింగ్ వెళ్ళినా
అన్నిచీరలను తిరగ చూడవలెను
వంద చూసినగాని ఒక్కటే నచ్చును
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

25)
ఫోనులొచ్చినాక రాకపోకలు తప్పే
ఫంక్షన్లకు కుడా ఫోనుపిలుపే ఆయె
బొట్టుపెట్టి చెప్పే సంస్కృతే పోయెగా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

26)
ఆడపిల్లలన్న అతి గౌరవము మాకు
చులకనగ ఎపుడు చూడబోము
లక్ష్మి రూపంబునే భావించెదమెపుడు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

27)
శివపుత్రుండాతండు అభిషేక ప్రియుడు
విష్ణు సుతుడాతండు అలంకార ప్రియుడు
హరి హర పుత్రుండు అభయ స్వరూపుండు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

28)
నియము నిష్ఠలతోడ మాలను ధరయించి
మండల కాలము దీక్ష వహించి
అయ్యప్ప నామమే సర్వదా కొలిచేరు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

29)
పంబలో మునిగితే పాపాలు తొలుగును
శభరి గుట్టెక్కుతే జన్మ దన్యంబౌను
అయ్యప్ప స్మరణమే సర్వ పాప హరణము
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

30)
పంబావాసుండు పావనమూర్తతడే
అలుదావాసతండు అద్భుత మూర్తతడు
చిన్నిబాలుడతడు చిన్ముద్ర రూపుడు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

31)
తల్లి కోర్కె దీర్చ అడవికే యేగెను
పులి పైన ఎక్కొచ్చి పులిపాలు తెచ్చెను
దుష్ట సంహారమై దివికేగె  అయ్యప్ప
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

32)
వయోభేదము లేదు, వర్ణబేదములేదు
ఆర్దికసమానతలు అస్సలులేవు
మాలదారణలోనె ఈ మహిమ ఉందిగా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

33)
ఓనరూ క్లీనరూ ఒకచోట మాలేసి
సహపంక్తి భోజనం ఆరగించు చుండె
మాలలోని మహిమ ఇదియేర యిలలోన
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

34)
హరి హరులకు నీవు జన్మించినావు
అంతరించ మహిషిని అవతరించావు
చిన్ముద్ర రూపమై వెలసినావు
అఖిలకోటికి ఆధారమై నిలిచినావు

35)
అప్పు చేయకున్న అడుగు వేయలేము
అప్పు చేయకున్న అన్నంబు తినలేము
అప్పు ముప్పైన తప్పైనా తప్పదు మిత్రమా
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

36)
అనుమానము నెల్ల భరియించ వచ్చు
అవమానమునెట్ల భరియించవచ్చు
ఆలుమగల మధ్య నమ్మకమే వారధి
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

37)
ఆడపిల్లలన్న అతి గౌరవము మాకు
చులకనగ ఎపుడు చూడబోము
లక్ష్మి రూపంబునే భావించెదమెపుడు
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

38)
మనము ప్రోత్సహించ ఔత్సాహికులను
అన్నింట విజయాన్ని అందుకోగలరు
బ్రమరాంభ స్ఫూర్తితో విజయాలు పొందగ
విధ్యార్ధులందరూ విజృంబించవలె


Thursday, November 19, 2015

ఎవరీ గోగులపాటి

గోగులపాటి, గోగులపాటి, ఎవరీగోగులపాటి నిన్న మొన్నటి
గోగులపాటి కాదు సహస్ర తరువాత గోగులపాటి పేరు
సహస్ర నామాలలాగ అయ్యిందే
ఇపుడు ఇంటి పేరు "సహస్ర గోగులపాటి ",అయిందా
అలా అయితే ఒ.కె కానీ మరి
బెస్ట్‌ ఆఫ్ లక్

సహస్రకవుల వందనాలు

అద్భుత సమన్వయంతో
అత్యద్భుత సమయ వ్యయంతో
మీరు నిర్వహించిన ఈ కవిమ్మేళనం
సర్వదా సంతోషం సముచతితం
మీ బహుముఖ ప్రఙ్ఞాపాటవం
ఇలాగే నిండునూరేళ్లు వర్ధిల్లాలని
గోగుల పాటీ నీకివే మా సహస్ర
కవుల వందనాలు

భవదీయుడు
బుద్ధుడు

కృతజ్ఞతా నమస్సులు

శుభోదయం, సహస్ర కవి సమ్మేళనం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతా నమస్సులు. శ్రీ మాన్ మేక రవీంద్ర గారికి, గోగులపాటి కృష్ణ మోహన్ గారికి సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా వందనాలు. అందరినీ ఒకే వేదికపై తీసుకవచ్చి మాకొక గుర్తింపు కలిగించారు. మీ మేలును మరువము. మీకు కృతజ్ఞతగా వెలసిందొక ఆటవెలది.

తెలుగు భాష ఘనత తేజరిల్లునిజము
వేయి కవుల తోడి వేదికయ్యె
పూనుకొన్న వారు పుణ్యాత్ములేనయ్య
వందనంబు జేతు నొందవేలు.

మరొక సందర్భం కొరకు ఎదురుచూస్తూ.... మాచర్ల మల్లేశం, sk no 745. గోదావరిఖని, కరీంనగర్ జిల్లా.

కళామతల్లి ముద్దు బిడ్డలి

ఆంధ్ర భారతిని అంతర్జాలంలో అందలమెక్కించడానికి
వేలకవితలు వెయ్యి వెలుగులు వెలగడానికి
సహస్ర కవులను సన్నద్దము చేసి కలము చేత పట్టించిన
తెలుగు సాహితీ మతల్లి ముద్దు బిడ్డలు

మేక రవీంద్ర
గోగులపాటి కృష్ణ మోహన్

మరియు

సహస్ర కవితా సమ్మేళన        

 యఙ్నంలో పాల్గొని తమ సాహితీ పాటవాన్ని   తెలుగు సాహిత్య కళాభిమానులకు ఒకింత మనోల్లాసము కల్గించినందుకు

మీ చరణారవిందములకు
మందారమకరంద నమస్సుమాంజలి అర్పిస్తూ.........................


ఇది అతిశయోక్తి కాదు    

మిమ్ములను నిరుత్సాహపరిచే శక్తి నాకు లేదు

మీ సహస్ర కవి మిత్రుడు      

జి.ఓబులపతి
కదిరి
స.క. 707