Tuesday, March 12, 2019

వీర సైనికా వందనం

వీర సైనికా వందనం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

వీరసైనికా నీకు వందనం
దేశ రక్షకా పాదాభివందనం ll2ll

అమ్మానాన్నలనొదిలి -
భార్యాబిడ్డలనొదిలి... ll2ll
దేశరక్షణ కొరకు
దేహాన్నే అర్పించే... ll వీర ll

ఎండనకా... వాననకా...
చలియనకా... భయమనకా... ll2ll
శతృమూకలతోటి
చిత్తుగ పోరాడేటి ll వీర ll

తీవ్రవాద దాడులతో...
ముష్కరుల ముప్పేటుతో.. ll2ll
అవయవాలు కోల్పోయి...
అవస్థలు పడుతున్నా... ll వీర ll

ఏసీలో కూర్చుంటూ...
దేశాన్నే అమ్ముకుంటూ... ll2ll
రాజకీయ రాబందుల
రాక్షస క్రీడలు చూస్తూ... ll వీర ll

నెలజీతము కొరకు నీవు
నేలతల్లి ఋణము దీర్చ... ll2ll
ప్రాణాలనె ఫణము బెట్ట
పయనిస్తివ శతృవైపు... ll వీర ll

యువతకు స్పూర్తివి నీవే
భవితకు బాద్షా నీవే... ll2ll
మరువబోము నీ తెగువ
మరణించక తిరిగిరా... ll వీర ll

వీరసైనికులకు వందనాలతో...
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు.
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Friday, March 1, 2019

పెళ్ళికూతురు సాగనంపు పాట

పెళ్ళికూతురికి సాగనంపు పాట
రచన్ గోగులపాటి కృష్ణమోహన్

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...

పచ్చని పందిట్లో పరిణయమాడగా
ముక్కోటి దేవతలు దీవెనలె ఇవ్వగా

అక్షింతలే మీకు అయుష్షుగానూ...
అతిధి దేవుళ్ళంత ఆశీర్వదించగా

దీర్ఘ సుమంగళై వర్ధిల్లవమ్మా...
అందుకో అందరి ఆశీస్సులమ్మా

అమ్మ మాటలు నీవు ఆచరించమ్మా
నాన్న చెప్పిన నీతి మరువబోకమ్మా

అత్తాడపడుచుల అవహేళనలను
పెద్దమనసుతోటి ఆదరించమ్మా

ఇరుగుపొరుగు మాట జోరీగలాగా
వినకుండ ఉంటేనే వేవేల మేలు

కనుదాటనీకమ్మ కన్నీరునెపుడూ
చిరునవ్వె వెలుగాలి నీమొహమునందు

మెట్టింటి గౌరవం కాపాడవమ్మా
పుట్టింటి పరువును పోగొట్టకమ్మా

మగని వద్ద నీవు మురిపెంగ ఉంటూ
మగని గుండె లోన గుడిగట్టుకోమ్మా

అనుమానమన్నది దరిజేరనీకూ...
నీ నమ్మకమే నీకు శ్రీరమరక్షా....

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...


గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Friday, May 25, 2018

కృష్ణ శతకము (కందపద్యాలు)

తేది : 24 జనవరి 2016
1)
తనుమనమున నీనామము
అనుదినమునునేను దలతు నయ్యా సాయీ!
కనికరమును జూపుమెపుడు
ఘననవ్యజ్యోతి కాంతి కందము కృష్ణా!

2.
సాయేకద రక్ష మనకు
సాయేకద సర్వజనుల సకలంబగునా
సాయే తలచిన బ్రోచును
సాయేమరి భక్తజనుల సర్వము కృష్ణా

3)
రమణుని శిష్యుండీతడు
కమనీయపదాలనల్లి కవితలు వ్రాసెన్
రమణన్ వీరారెడ్డియె
కమనీయముగా రచించె కవితలు వీరా

4.
వీరా గణితాన విదుడు
వీరా నేర్పున రచించి వీరా శతకం
బౌరా యనిపించెకదా!
వీరా ఘనగణితశాస్త్ర విజ్ఞుడు   కృష్ణా!

5
వ్రాయాలని యుంది కవిత
తీయాలని యుంది నాకు తీయని  గ్రంధాల్
చేయాలనుంది రచనలు
గాయాలను మాన్పి మరువ గతమును   కృష్ణా!

6)
వీరా బ్లాగుల కవితలు
సారమ్ముగ మనకుదక్కె సంపూర్ణముగా
వీరా రాసెను కవితగ
కోరిగణితమునుమధించి  కోరిక కృష్ణా

7)
తలచెద నే మణికంఠుని
తలచెదను శబరిగిరీశు తలచినయంతన్
తలచినవరముల నిచ్చును
కలియుగమున భువిని వెలసె కదరా కృష్ణా

8)
అంబటిభానుని కవితలు
అంబరమును తాకెను కద యబ్బుర పడనా
నందింపగ శతకవితలు
అందముగా నందజేసె నతడే కృష్ణా

9)
మాలాధారణచేసిన
మాలేకద మాకురక్ష మమురక్షింపన్
మాలతొ కదరా మనలకు
మాలామృత మహిమ తెలియు మహిలో కృష్ణా

10)
ధరియించి మాల రవియున్
దరలకమును మేలుకొంటి నలువదిదినముల్
కరపితి షోడశపూజల
నెఱిఁగితి షణ్ముఖుని మహిమలెన్నో కృష్ణా

11)
శివశివయని పలికినచో
శివుడేప్రత్యక్షమగుచు  చెంతననిలచున్
శివుడేయభయంబిచ్చును
శివనామస్మరణ సేయ శివమగు కృష్ణా.
(శివమ్ అంటే  శుభం అని)

12)
అదిగోవచ్చెనుఎన్నిక
లిదిగిదిగో జనులు చేరిరిరుకు గదుల్లో
నదె తొలిపతనము లోటరు
లదోగతికి మూలమోటులమ్ముటకృష్ణా

13)
ఒక్కటెకద  యోటు మనకు
చుక్కలొకడె గెలిచి నీకుచూపునొకండే
ఒక్క రెకద పొందపదవి
తక్కినయా లెక్కలెందు తరలేను కృష్ణా

14)
నీతిని తప్పెద వీవని
వ్రాతలునీనొసటిపైన  బ్రహ్మయు వ్రాసెన్
చేతములోనీతినిలిపి
నీతిపధములో జనులనునిలుపుము కృష్ణా

15)
అమ్మేకద మనదైవం
బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా
అమ్మేకద మనకఖిలము
అమ్మేప్రత్యక్ష దైవమగునిల  కృష్ణా


16)
శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...
చిరు కంద కానుక...

వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయమునొందున్
ఆరోగ్యము లందించుచు
రారా కాపాడ శుభములన్ మము కృష్ణా!

17)
తనయులు పుట్టిన చాలదు
వినయముతోపెరగవలెనువిజయము కొరకై
కనినతలితండ్రిమనముల
జనముల పొగడొందు రీతి జగతిని కృష్ణా

18)
చదువుకొనిన చాలుకదా
కొదవుండదు తెలివితేట కోరగ నీకున్
చదువుమురాశ్రద్దగనువు
చదువే నినుచక్కబెట్టు చదువుము కృష్ణా

19)
ఏమని తెలుపుదు  హితులకు
నీ మది తలపుల మెదలిన యిమ్మగు వలపుల్
ఆమని పాడు పదాలకు
నామది రంజింపలేదు నమ్ముము కృష్ణా

20)
చదివిన వేకువజామున
మదిలో నిక్షిప్తమగును మనమున నాటున్
అధికముగా ఫలితములిడు
(అధికముగా గెలుపులనిడు)
చదువుమయా తెల్లవారుజామున కృష్ణా

21)
అందపు గోదారి తటము
నందువెలసెషిరిడి ధామమదియే సాయీ
మందిరదివ్యక్షేత్రము
బృందావనమౌను సాయి హృదయము కృష్ణా

22)
జీవాధారము తానై
పావనదైవము వెలుంగు  .భగవాన్ సాయీ
బ్రోవగ భక్తులనెప్పుడు
నీవే యఖిలము సకలము నిక్కము కృష్ణా

23)
శరణాగత వత్సలునిగ
కరుణను మామీద చూపి కరుణించుమయా
పరమేశ్వర సురసాయీ
పరమదయాళ పరమాత్మ పావన కృష్ణా

24)
అసహాయసహాయుడవై
నసదృశ కరుణా పరాత్పరా శ్రీసాయీ!
అసమానదయాహృదయా!
మసకలు తొలగించి చూపు మహిమలు కృష్ణా!

25)
భక్తావనవందిత ఘన!
భక్తానుగ్రహ మహానుభావా!సాయీ!
భక్తవరద! శక్తిప్రద!
భక్తాభీష్టములు దీర్చుబాంధవకృష్ణా

26)
మునిహృదయవిరాజితుడవు
ఘనుడవనంత సుగుణుడవు కరుణాసాంద్రా!
కనుమయ్యా మణికంఠా!
కనికరమున వెతలు బాపి కా వుముకృష్ణా!

27)
భుజగాభరణాగ్రసుతా!
గజాననాగ్రజ! సదా సకలసురవంద్యా!
సుజనులసులోచనుండవు
నిజమగుజగదీశ్వరుడవు నీవే కృష్ణా!

28)
నిత్యాయ!నిగమపూజిత!
సత్యాయ ! సమస్తవేదసారా!శురా!
దైత్యాంతక ! దరిసించిన
నత్యద్భుతమగును లీలలన్నియు కృష్ణా!

29.
వీరాయ! వీరవర్యా!
దీరాయా!సద్గుణాయ!ధీరోదాత్తా!
తారాసురసంహారా!
ఘోరదనుజ భంజనాయ!కొనునుతి కృష్ణా!

30
పతితోద్ధారవినాయక
సతతము నిన్నే కొలిచెద సత్యముదేవా!
సతులగు సిద్ధికి బుద్ధికి
పతివై విఘ్నములు బాపు! వరదా!కృష్ణా!

31.
వసుధను ధరించువానికి
ముసిముసి నగవులను పంచు ముద్దులగుమ్మా!
వసుదేవుసుతుని ప్రియసతి రుసరుసలను మాని మమ్ము ప్రోచుము కృష్ణా!

32.
సూర్యగ్రహమును కొలువుము
సూర్యునిపూజించునీవు సుఖములు పొందన్
సూర్యధ్యానమున సకల
కార్యములన్నిటను సిద్ధికలుగును కృష్ణా!

33.
మనమున పీడలు కలిగిన
మనముకొలవవలెను  బుద్ధిమాన్యత  చంద్రున్
మనసే యతి ముఖ్యమగును
మనమందుస్మరింతు చంద మామను  కృష్ణా

34
రోగములు కల్గ మనలకు
నా గతులను మాన్చువాడునంగారకుడే
వేగమరిష్టము బాపెడి
యా గరిమగ్ర హమునకిదె యంజలి  కృష్ణా

35
బుద్ధికి పీడలు తొలగెడు
నొద్దీకగా బుధుని పూజలొనరింపంగా
శుద్ధిని బుద్ధికి గూర్చెడు
శ్రద్ధగ పూజింతుబుధుని శ్యామల కృష్ణా

 36)
పుత్రోత్సాహమె కావలె
పుత్రుల పీడోపశాంతి పోవలె నన్నన్
పుత్రులకిష్టుడు గురుడే
పుత్రులపీడ తొలగించు పూజలొ కృష్ణా

37.
పీడలవి యెన్నియున్నను
వీడక పూజలనుతనిసి విడిపించునుగా
పీడతొలగ పూజించెద
నేడుగడగ శుక్రుని కరుణింపగ కృష్ణా

38
శనిపూజలు చేసినచో
శని కలిగించుమనకు నుపశమనంబు సదా
క్షణమున తొలగును పీడలు
సానిపూజలు తిలలతోడ సలిపెద కృష్ణా

39.
శమియించును కనుపీడలు
యమనిష్ఠ్టగ రాహుగొలిచి యర్ధించగానే
మముకాచెడి దైవమునకు
నమామ్యహం రాహురూపునకు శ్రీకృష్ణా

40.
చేతములానందింపగ
కేతువును భజింతుమెపుడు క్షితి రక్షింపన్
ప్రీతితొ కేతునిపూజలు
సేతుము జ్ఞానమ్ము నీయ శీఘ్రము కృష్ణా

41.
తెలిపిరి ఛందోమర్మాల్
నిలిపిరి నను పద్యరచన నెయ్యము మీరన్
విలువగు పదములు గూర్చుచు
మలచిరి మధు విజయగార్లు మాన్యత కృష్ణా

42.
గో మాతను పూజించిన
గోమయ గోమూత్రములను గోక్షీరంబున్
గోమాతయొసగి కాచగ
నామెయెమా ప్రత్యక్షదైవమగునిల  కృష్ణా

43.
గోవుకు కొమ్మున విష్ణువు
గోవే భూదేవి ,తల్లి గోవు పితరుడౌ
గోవుఖురాగ్రము శేషుడు
గోవును పూజింప శ్రీలు కురియును కృష్ణా

44.
గురురాఘవేంద్ర!,దేవా
నిరవద్యశుభ ప్రదాయ నిర్గుణరూపా!
నరదోషహరా !నిరతము
శిరసొంచి నమస్కరింతు చేకొన కృష్ణా

45.
శూరుడుమహాబలుండగు
ధీరా! సుగుణాలవాల!ధిషణాభరణా!
వారింపుము మా దొసగులు
మారుతి!కరుణించి మమ్ము మార్చుము.  కృష్ణా

46.
తెలుగంటే నాకు భయము
తెలుగంటే వ్యాకరణము తెలుగే కష్టమ్
తెలుగంటే ప్రేమేమరి
తెలుగును నే నేర్చుకొందు తెలియగ కృష్ణా

47
ఆత్మయనిన నొకగమనము
ఆత్మకు నాధారమైనదాకసము కదా
ఆత్మయనినసత్యము జీ
వాత్మయు చేరును గద పరమాత్మను కృష్ణా

48
అమ్మేకద యాధారము
నమ్మేకద దైవమనిన నమ్మే దైవం
బమ్మేకదభూమాతయు
నమ్మే కదభరతమాత యంజలి కృష్ణా

49
తండ్రేకదపోషకుడిల
తండ్రేకద రక్షకుండు తండ్రేహితు డౌ
తండ్రేకద సన్మిత్రుడు
తండ్రేకద మార్గదర్శి తనుపగ కృష్ణా

50.
భార్యే మనలో సగమగు
భార్యే సహచరికుటుంబి భార్యే నీడౌ
భార్యేసంతానవతియు
భార్యే వంశమును బ్రోచు వరమగు కృష్ణా

51)
ప్రేమంటే వాత్సల్యము
ప్రేమే నమ్మిక యనురతి ప్రియగుణమదియే
ప్రేమే మక్కువ వలపగు
ప్రేమంటేనే మురిపెము ప్రేముడి కృష్ణా

52)
ప్రేమేకద యనురాగము
ప్రేమే పాశము నిరతము ప్రణయము నెమ్మిన్
ప్రేమే కూరిమి గారము
ప్రేమే యభిమానమగును ప్రేమే కృష్ణా

53)
ప్రేమే మరి యాప్యాయత
ప్రేమే మమకారము మన ప్రేమే యింపౌ
ప్రేమే కద గారాబము
ప్రేమే మారాము గోము ప్రేమతొ కృష్ణా

54)
ప్రేమేలే యభిమానము
ప్రేమే మరి మరులు మమత ప్రేమించంగన్
ప్రేమే లే వ్యామోహము
ప్రేమే లే పిచ్చికాంక్ష  ప్రేమే కృష్ణా

55)
అనుబంధము ప్రియతత్వము
ననుగునెనరు నాదటన్న నమరప్రేమౌ
ననురక్తి ప్రేమ నెయ్యము
ననురాగపు సౌరభముల నలదును కృష్ణా

56)
ధరణి యనిన భూమేకద
ధరణీ ఖగవతి జగత్తు ధరణము గౌరీ
గిరికర్ణిక ఇల అవనీ
ధరణీ పృధవీ ధరిత్రి ధాత్రీ కృష్ణా

57)
వృక్షము రక్షించుమనల
వృక్షము రక్షించబడిన, వృక్షమె సిరియౌ
వృక్షమున లేదు లేనిది
వృక్షములిలలేనియెడల విలయమె కృష్ణా

58)
తినడానికి తనకుండదు
తనపసులకు మేతలిడుట తనకుశ్రమయగున్
తనకిష్టములేకనెపశు
లను తక్కువకమ్మువారు రైతులు కృష్ణా

59)
రైతే మనరక్షకుడగు
రైతే మనపోషకుండు రైతే ఋషియౌ
రైతే మనకాధారము
రైతును కాపాడజేతు ప్రార్ధన కృష్ణా

60)
సంపద కలిగిన బ్యాంకులు
నింపుగతోడ్పడును ఋణము లెగవేయుటకున్
సంపాదన  లేకుండిన
చంపైనవసూలుచేయు చక్కగ కృష్ణా

61)
మహిళే కదమన మాతయు
మహిళే కద అక్క చెల్లి అన్నీ తానే
మహిళే కద యత్తయనిన
మహిళే మరి యమ్మ బామ్మ మహిలో కృష్ణా

62)
మహిరక్షణ రక్షించిన
మహళే మనుగడను గూర్చు మనరక్షణయౌ
మహిళలు లేకుండమనకు
మహిలో మన్నికయెలేదు మరవకు కృష్ణా

63)
పోలీసులెకద రక్షణ
పోలీసులెదిక్కుమొక్కుదీనులకెపుడున్
పోలీసులెలేకున్న జ
నాలకు లేదాయె రక్ష నమ్ముము కృష్ణా

64)
ఉష్ణాంశుడు ఆదిత్యుడు
ఉష్ణకరుడు యహిమకరుడు నుజ్వాలారవియే
ఊష్ణుడు దినకరుడు నినుడు
విష్ణుడు జిష్ణుడు నతండె వేలుపు కృష్ణా

65)
గ్రేటరున వచ్చె యెన్నిక
లోటరులకు విందుగూర్చు నట్లు చెవులకున్
ఓటను నాయుధములతో
దీటుగ స్పందించినపుడె తీరును కృష్ణా

66)
గ్రేటరు ఎన్నిక లోనా
చాటుగ డబ్బులు వరదగ చల్లిన గానీ
లేటుగ లేచిన ఓటరు
నీటుగ గెలిపించు నచ్చు నేతను కృష్ణా

67)
పోరేమో స్పీడు పెంచెను
కారును సైకిల్ కమలము కరము కదమునన్
హోరుగ పతంగులెగిరెడి
తీరును గమనించుచుండ్రి తిరమున కృష్ణా

68)
నగరమున నేడు మ్రోగెను
నగర భవిత తెలియజేయు నాందికి గంటల్
నగరము పై పట్టుకొరకు
నెగసిననధికారవాంఛ నెన్నిక కృష్ణా

69)
ఎవ్వరు నిలిచిరి బరిలో
ఎవ్వరు గెలిచెదరునేడు నెన్నికలందున్
ఎవ్వరు ఎవరో తెలియదు
ఎవ్వరు గెలచిన నగరములెదుగును కృష్ణా

70)
ఓటును వేయుము ధీటుగ
ఓటే మనహక్కుదిక్కు ఓటే సర్వం
బోటును డబ్బులకమ్మకు
ఓటే నీ భవిత పొందు మున్నతి కృష్ణా

గాంధీ జయంతి సందర్భంగా అక్షర నీరాజనం (పంచరత్నాలు)

71)
చేతిన కఱ్ఱను బట్టియు
తాతయు శాంతియెయసిగ స్వతంత్రతకొఱకై
జాతిపితగ గాంధీ మన
రాతను మార్చగనుబూనె త్రాతగ కృష్ణా

 72)
పరదేశీ పాలనయను
చెరనుండి విముక్తిచేసి చింతలుదీర్పన్
వరముగసత్యాగ్రహమను
కరమరుదుగనందజేసె ఖడ్గము కృష్ణా

73)
గాంధీనిచంపెను పిరికి
పందయసురుడౌను గాడ్సెభరతావనిలో
మందెంతమంది యుండిన
గాంధీనటకాపుకాయగలిగిరె కృష్ణా

74)
ఏతీరుగ నిన్నుఁ గొలుతు
మేతీరుగ దీర్పగలము ఋణమును బాపూ
చేతులుమోడ్తుము నీకై
నీతికి నిలతుము నిరతము నీవలె కృష్ణా

75)
గాంధీ మనజాతికిపిత
గాంధీజీ మార్గదర్శి ఘనముగ మనమున్
గాంధీజీ కలలుగనిన
గాంధీయిజ భారతమును కాంక్షింద్దామా

76
అవి నా బాల్యపుగుర్తులు
నివిమరపునకెపుడు రాక హృదిలో నిలచున్
జవమగు కాలముతోమా
ర్దవమమతల గురుతులను కదల్చును కృష్ణా

77.
ఆటలతోటే స్నేహము
ఆటలతోటే కలహము యవి నెట్లన్నన్
ఆటలలో గెలుపోటమి
కూటములతొ మేలుకీడు కూర్చును కృష్ణా

78
పీరుల పండుగలందున
ఊరేగింపులు జరిపెద రుత్సాహముతో
తీరుగ జనులెల్లకలియు
భారతజాతీయతకునుప్రణతులు కృష్ణా

79.
పండుగ సెలవులయందున
దండిగ బంధువులు మిత్ర తతి వేడుకలన్
నిండుగమధురాన్నములన్
వండుకొని భుజింతురు తీరిబంతుల కృష్ణా

80.
కూనూరున పుట్టిపెరిగి
భోనగిరిని చదువుకొంటి పొందుగ నిట బా
లానగరు చేరి బ్రతుకగ
నేనూరిని మరువలేదు నిక్కము  కృష్ణా

81
తిట్టిన తిట్టును తిట్టక
తిట్టినవాడే ఘనుండు తిట్టుల సమ్రాట్
తిట్టుమనుచు ననగానే
తిట్టేను వీరానవేర తీవ్రత కృష్ణా


82
కవనములల్లెడి కవి మెల
కువతో యీలోక రీతి గుర్తింపవలెన్
కవిత లె ప్రభాతసూక్తుల
కువకువలై మనలమేలుకొల్పును కృష్ణా


83
అలుగుటయే తెలియనిదయి
యలుకను నరుణమ్మబూనె నాక్షణమందున్
పలుకని యలుకలు  కలచెను
వెలదికళ వ ళపడమిత్రబృందముకృష్ణా


84)
(అవేరా గారు ఇచ్చిన పదాలు " శివ, భవ" నవ లతో పద్యరచన)

శివ శివ యని తలచిననే
భవహరుడేతెంచునుకదభక్తుల బ్రోవన్
శివుడే కద భయహరుడగు
శివుడే నవనాయకుండు శివుడే కృష్ణా

85)
(అవేరా గారిచ్చిన వినండి, కనండి, మనండి, కొనండి పదాలతో పద్యరచనా ప్రయత్నము)

మంచిని వినండి తప్పక
కంచిని మరువక కనండి కనులారంగా
పంచుచు మనండి సిరులను
నంచిత పుణ్యము గొనండి యనెదను కృష్ణా

తేది: 01-02-2016
86)
గోడలు కూల్చుము కులముల
గోడలు కూల్చుము మతముల గొడవలవేలా
గోడలె మన ఎదుగుదలకు
మూడులకివి యాయుధములు పూనగ కృష్ణా

87.
ఆలును మగలనునిరువురు
పాలును నీళ్లుగ చరించి బాగుండ వలె న్
ఆలియెకద మూలమగును
తాళితొ వంశమునుబెంచు తరములు కృష్ణా

88.
లక్షలగును మధుసూదను
నక్షరములు, పూరణములు నాటలు నవి సద్
భక్షణలౌ సరసులకును
దక్షతతో పద్యమల్లు ధన్యుడు  కృష్ణా

89.
తళతళమెరసెను మెరుపులు
పెళపెళయురిమెనుయురుములు పెను రవములతో*
జలజల కురిసెను చినుకులు
కొలనున విరిసె కమలములు కొమరుగ కృష్ణా

90.
అరాశ గారిచ్చిన కాపాడు కోరాడు తాగాడు పోతాడు పదాలతో పద్యరచన ప్రయత్నం

కాపాడుముమమ్మందర
గోపాలా! యెల్లదశలగోరాడు మది న్
నీపదసుధతాగాడగ
ప్రాపుగపోతాడు ముక్తి పధముకు కృష్ణా

91.
కోమలి ఆడుము కృష్ణా
గోముగ అలరాడుమాతొ గోపిక లోలా
ప్రేమగచిరుగాడుపులతొ
ప్రేమగ తాగాడు నాడు పూతన పాలు
93)
(కవి మితృలు అంజయ్య గౌడ్ గారు శతకవితలు పూర్తి చేసిన సందర్భంగా పద్య కానుక)

అంజన్న వ్రాసె శతకము
మంజీరా నాదమువలె మధురము గాగన్
రంజుగ తీర్చెను కవితలు
నంజన్నా! స్వీకరింపుమంజలి కృష్ణా


02-02-2016
94)
ప్రేమంటెకాదు ప్రేయసి
ప్రేమే మాతాపితరులు ప్రేమయఖిలమౌ
ప్రేమే ప్రేయసి కాదుర
ప్రేమించే ముందు పంచు ప్రేమను కృష్ణా


95)
రంగందముండియేమీ
యింగితముతొయుండవలెను యెల్లర తోడన్
అంగముల రంగుకన్నను
సంగతియగు నంతరంగసౌరులు కృష్ణా

96
వలదీర్ష్యాద్వేషమ్ములు
వలదు తగదిల వ్యతిరేకభావములెపుడున్
అలతిగ జేయును మనలను
తొలచుమదిని సంతసమ్ముతొలగునుకృష్ణా
   

97.
సుఖమే గద సంతోషము
సుఖమే లేకుంటెమనిషి శుభములునిండున్
సుఖములిడును సర్వస్వము
సుఖపు కిటుకు తృప్తి ఔను సుందర కృష్ణా

98
తలచిన కీడులు మనలను తలచిన కలుగును  మనలకు తాకుమరలుచున్
కలవకు కీచక మిత్రుల
వలదిలసన్నుతకృష్ణా

99
చదువే యున్నత గతులిడు
చదువేకద మనకు రక్ష చదు వుహితుండౌ
చదువే కద భవితవ్యము
చదువు బ్రతుకు సారమెల్ల సన్నుతకృష్ణా

100
కందములు కవితలందున
వందాయెను గురులకెల్ల వందనశతముల్
ఎందరొననునడిపించిరి
ఛందోరీతులను నేర్పిచక్కగ కృష్ణా

101)

సొగసరి వనితను జూచిన
మగటిమితో మెరయునుగద మగవారి ముఖాల్
జఘనమ్మున కదలాడుచు
జగడములను పెట్టెదేల జంటలకు జడా

102)
సాహిత్యసభలు జరుపగ
సాహిత్యముపొంగిపొరలె సత్కవులెల్లన్
మా హితము కోరి పలుకగ
ఆహా!భువనగిరి కీర్తి యభ్రమునంటెన్.

Tuesday, May 8, 2018

జలకవితా మహోత్సవం - వనపర్తి

తేది 06-05-2018, ఆదివారం నాడు వనపర్తి జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ మైదానంలో  తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణా జలకవితోత్సవం ఘనంగా నిర్వహించారు.
 అద్భుతంగా జరిగిన "తెలంగాణ జల కవితోత్సవం" లో  తెలంగాణా లోని పలుప్రాంతాలనుండి అనేకమంది కవులు పాల్గొని తరలంగాణాలో నీటి వనరులు - చాటి ప్రాధాన్యత గురించి తమ తమ కవితల, పద్యాల ద్వారా వివరించారు. 

ఇందులో బాగంగా మేడ్చల్ జిల్లా, సూరారంకాలని కి చెందిన కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ పాల్గొని " తెలంగాణ జలకళ - అదేకదా మనకల" అనే కవిత ద్వారా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరిచ్చి ఇండ్లలో జలకల,  మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి చెరువుల్లో జలకల, ప్రాజెక్టు నిర్మాణాలు చేసి కాలువల్లో జలకళ తీసుకువచ్చిన ఘనతను తన కవిత ద్వారా వినిపించి తొఇటి కవుల, నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గోగులపాటి కృష్ణమోహన్ ను  ఘనంగా సత్కరించారు.


Saturday, May 5, 2018

తెలంగాణ జలకల - అదేకదా మన కల

తెలంగాణ జల కవితోత్సవం
తేది: 06-05-2018
స్థలం: వనపర్తి, తెలంగాణ

శీర్షిక: 
తెలంగాణ జలకల - అదేకదా మన కల

రచన : గోగులపాటి కృష్ణమోహన్
కాకతీయులు నాడు, తోడిన చెరువులు- పూడికలు తీయక, పూడి పోయెను కదా ...
చెరువు కింద ఉన్న, పంట పొలములు కాస్త - పర్రెలు పట్టేసి, పకపకా నవ్వెగా...
చెరువు కింద రైతు, పంట చేతికి రాక - పల్లె విడిచిపెట్టి, పట్నమే సాగెగా...
మిషను కాకతీయ, మళ్ళి పూనుకోని - పూడికలు తీసేసి, పుణ్యమే కట్టుకొనె
చెరువు కింద ఉన్న, పంట పొలములు కాస్త - జలముతో తడిసెగా, రైతన్న మురెసెగా...

తాగునీరు లేక, తల్లడిల్లె పల్లె.. నీటికొరకు నడిచె, నాలుగేసి మైళ్ళు
సంకలోన పిల్ల, నెత్తిపైన బింద - నడిచి నడిచి నడుము, విరుగుడాయె...
ఉత్తమ గతులకై, దివినుండి గంగను - తీసుకొచ్చెను నాడు, భగీరధ యత్నము
ఇంటింటికీనీరు, ఇచ్చుటే లక్ష్యంగా - నేడు వచ్చెను కదా, మిషిను భగీరధ...
నడవలేని తల్లి, నట్టింటిలో ఉండి - నల్ల తిప్పుకుంటు, నీళ్ళు పట్టనుండె...

సాగునీరు లేగ, సాగుబాటు లేక - సాగెనయ్య రైతు, కూలిబాట కొరకు
రైతు బాధలెరిగి, రారాజు పూనుకొని - ప్రారంభమే చేసె, ప్రాజెక్టు పనులను
మిషిను భగీరధతొ, ఇంటింట జలకల - మిషను కాకతీయతో, చెరువులో జలకల
ప్రాజెక్టు పనులతో, కాలువలు కలకల - తెలంగాణ జలకల, ఇదేకదా మనందరి కల...

రచన: గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, మేడ్చల్ జిల్లా, గ్రేటర్ హైదరాబాదు, తెలంగాణ.
చరవాణి సంఖ్య : 9700007653

Sunday, December 31, 2017

ఏది పాశ్చాత్యం?

ఏది పాశ్చాత్యం?

గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అదేంటో అందరూ ఆంగ్లసంవత్సరాదిని అదోలా చూస్తున్నారు.
అదేమంటే పాశ్చాత్య సాంప్రదాయమంట...

పుట్టినరోజేదంటే ఆంగ్ల తేదీలు చెప్పేవారే అందరూ..
తిధి, వార, నక్షత్రాలు చెప్పేది ఎందరు?
ఇది పాశ్చాత్యం కాదా?

ఉద్యోగంలో చేరాలంటే ఫస్టు తారీఖు ఎప్పుడా అనిచూస్తారే తప్ప..
పాడ్యమి కోసం చూసేవారెంతమంది?
ఇది పాశ్చాత్యం కాదా?

ఉదయం లేవగానే బ్రష్ పేస్టు వేస్తున్నారే తప్ప
ఎంతమంది, పండ్లపొడి, పండ్లపుల్ల వాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

బయటకు వెళ్ళాలంటే సూటూ బూటూ వేసుకుంటున్నారే తప్ప
ఎంతమంది సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

వినడానికి రేడియో, చూడటానికి టీవీలు కావాలి
చేతిలో ఆండ్రాయిడ్ ఫోను కావాలి
ఇది పాశ్చాత్యం కాదా?

బైకులు, కారులు... ఇంకా దూరమెళ్ళాలంటే ఎరోప్లేను,  స్టీమర్లు కావాలి..
ఎంతమంది ఎడ్లబండ్లు వాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

తెలుగు రాష్టం దాటి బయటకు వెళ్ళాలంటే ఆంగ్లం రావాలి, మాట్లాడాలి
ఎంతమంది మాతృభాష మాట్లాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

విదేశీ భాష కావాలి, విదేశీ ఉద్యోగం కావాలి... విదేశంలో ఉన్న సంబంధం కావాలి.
ఇది పాశ్చాత్యం కాదా?

ఎంతమంది ఉదయం లేవగానే టైం కోసం గడియారం, తేదీ కోసం క్యాలెండరు చూడకుండా ఉంటున్నారు?
ఎంతమందికి పంచాంగం మీద అవగాహన ఉంది?
ఇది పాశ్చాత్యం కాదా?

ఇన్ని పాశ్చాత్య ధోరణినీలకు అలవాటుపడి, ఆదారపడి బతుకుతున్న మనం..
ఇన్నిటికీ మూలాధారమైన కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలకడానికి మాత్రం పాశ్చాత్యం అడ్డొస్తుందా ?

ఇంక్రిమెంట్ల కోసమో, పదోన్నతులకోసమో,
కొత్త వ్యాపారం కోసం,
ఉన్నత చదువులకోసం..
ఎన్నో ఆశలతో,
సరికొత్త ఆశయాలకోసం...
అందరూ క్యాలెండర్ ను అనుసరిస్తారే తప్ప పంచాంగాన్ని కాదు..

అలాంటి మరో ఆంగ్ల సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలకండి...
తప్పేం లేదు.
కాకపోతే
పబ్బులు, క్లబ్బులు వెళ్ళి
మద్యం కోసమో...
మగువ కోసమో..
వొళ్ళు హూనం, జేబులు శూన్యం చేసుకోకండి...

ఇంటిళ్ళిపాదితో హాయిగా నవ్వుతూ.. తుళ్ళుతూ మరో సంవత్సరానికి స్వాగతం పలుకుదాం...

పాశ్చాత్యం తప్పుకాదు
మన సంస్కృతి సాంప్రదాయాలు మరిస్తేనే తప్పు
అది మరవకండి

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
9700007653

Friday, December 22, 2017

నమస్తే తెలంగాణ - గోగులపాటి కృష్ణమోహన్

తేది 22-12-2017 న నమస్తే తెలంగాణ దినపత్రిక యాదాద్రి జిల్లా ఎడిషన్ లో నా స్టోరి