Sunday, August 28, 2016

శవాలంకరా.... నమోనమః

శవాలంకరా.... నమోనమః"



మార్చురీలలో పోస్టుమార్టం చేసే సిబ్బంది కష్ట నష్టాలను దగ్గరనుండి చూసిన అనుభవంతో రాసి.... వారికి అంకితం ఇస్తున్నాను)

"శవాలంకరా.... నమోనమః"

యాక్సిడెంటులో ఒకరు...
ఉరేసుకోని ఇంకొకరు....

రైలుకిందపడి ఒకరు...
నీటమునిగి ఇంకొకరు....

బుల్లెట్టు గాయానికి ఒకరు...
కత్తి గాట్లకు ఇంకొకరు...

విషము తాగి ఒకరు...
విషమెక్కి ఇంకొకరు....

పైనుండి దూకిపడి ఒక్కరు...
డ్రైనేజీ గోతిలో పడి ఇంకొకరు ...

అగ్నికి ఆహుతయ్యి ఒక్కరు...
విద్యుద్ఘాతం తో ఇంకొకరు ...

క్రూరమృగాలకు బలై ఇంకొకరు....
క్రిమికీటకాలకు ఇంకొకరు ...

గుండెపోటుతో ఒక్కరు....
దీర్ఘకాలిక వ్యాధి తో ఇంకొకరు....

ఇలా...
ఎప్పుడూ ఎక్కడో ఎవరో ఒకరు...
ప్రమాదావశాత్తూ పోతూనే ఉన్నారు....

ఒక్కోచావు ఒక్కో రకంగా ఉంటుంది....

రక్తసిక్తంలో లో ఒకరుంటే....
కాలోచోట... చెయ్యోచోట ఒకరుంటారు...

కళ్ళు తెరచి ఒకరు....
నాలిక చాపి మరొకరు...

కుళ్ళిన చర్మంతో ఒకరు...
కుళ్ళు వాసనతో ఇంకొకరు...

ఇలా చూడటానికి ఇబ్బందిగా...
ముట్టుకోవడానికి మనసురాక...
ముక్కుమూసుకోని దూరంనుండే ...
చూసి వెళ్తుంటారు బందువులు, మిత్రులు...

కనీసం కుటుంబ సభ్యులు కూడా
దగ్గరికి రావాలంటే దడుసుకుంటారు...

మరి...
ఎలాంటి పరిస్థితులలోనైనా...
ఎలాంటి శవానికైనా...
రాత్రనక, పగలనక...
సేవేచేసేవాడే.... ఈ శవాలంకరుడు...

మార్చరీలో.... 
అతి తక్కువ జీతగాడు అతడు...

ఎలాంటి శవాన్ని అయినా...
శుబ్రపరిచిపెట్టే సోగ్గాడతడు...

వేరుపడిన అవయవాలను...
వెతికిపెట్టే వేటగాడు యతడు...

కడుపుకోసి ... కుట్లువేసి....
పుర్రె పగులగొట్టి... అతుకుపెట్టి...
అందంగా మనకందించే....
అందగాడతడు...

తనకెవరూ ఏమీకాకపోయినా....
తనవారే దూరంకొట్టిన శవాలను సైతం..
దగ్గరికి చేర్చుకునే...
దయార్ద్ర హృదయుడతడు....

కాలాలతో, కాసులతో...
కులాలతో... మతాలతో...
సంబంధాలు లేకుండా... సేవచేసే... 
సేవాతత్పరుడతడు...

ఎవరేమిచ్చినా ఆనందంగా తీసుకొని...
ధైర్యాన్ని నూరిపోసే... దైర్యశాలి తాను...

ఏ జన్మ ఋణానుబంధమో కానీ...
ఈ జన్మలో ఈ రకంగా సేవచేసుకుంటూ..
ఆదుకుంటున్న.... ఆపద్భాందవుడతడు...

అందుకే అందిస్తున్న.... వేలవేల వందనాలు

(మార్చురీలలో పోస్టుమార్టం చేసే సిబ్బంది కష్ట నష్టాలను దగ్గరనుండి చూసిన అనుభవంతో రాసి.... వారికి అంకితం ఇస్తున్నాను)

మీ
సహస్రకవిమిత్ర 
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు,
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653



Friday, August 26, 2016

అరుణ ధార

నా కవితలపై ప్రముఖ కవయిత్రి అరుణ చామర్తి గారి
అభిప్రాయమాలిక


నా కవితలపై "అరుణ ధార"

అటు జర్నలిస్ట్ గా ,ఇటు సమూహాల్లో ఉత్సాహం గా పాల్గొంటూ కుటుంబానికి దూరమైన భావన రాకుండా వారి ధర్మ పత్ని ని, ఇద్దరు పిల్లల్ని పద్య మకుటం గా అమర్చి రెండు శతకాలకు పైగా భావరహిత పద్యాలను రాయడంతో పాటు.... ఎన్నో భావయుక్తమైన వచన కవితలు రాసిన కవిమిత్రులు, సహస్రకవి శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారి కలం నుండి జాలువారిన కవనాలలోని అంతరంగాలను ఓ సారి తొంగిచూస్తే....

కల్తీ లేని మనిషి కలత చెంది రాసిన కల్తీ కవిత ఎంత అద్భుతమో వివిధ గ్రూపుల్లో తిరగడం సాక్ష్యం .అలాగే వారి జర్నలిస్ట్ కవిత ఎన్నెన్నో సమూహాల్లో ప్రయాణం చేసి తిరిగి వారికే వారి పేరు లేకుండా చేరడం చూసి కవిత గొప్పగా ఉంది అన్నమాట అని ప్రతికూలంగా ఆలోచించ గలిగిన స్థిత ప్రజ్ఞ త వారి సొంతం

అవయవదానం గురించీ చక్కగా విశదీకరించిన కృష్ణ మోహన్ గారు అవయవాల దొంగతనం చేసే వైద్యుల పై మరో కవితలో సమరశంఖం పూరిస్తారు ..

నగరం లోని ట్రాఫిక్ ని ,అడ్డా కూలీ ల పాట్ల ని అలవోకగా తన కవితల్లో జోప్పిన్చారు

వ్యభిచారిణి అన్న కవితలో కూడా అప్రయత్నంగా నొ ,అనుకోకుండానో ,పిల్లల కోసం తప్పని పరిస్తితుల్లో ఆ కూపం లోకి దిగినా వారు అనుబవిన్చే కష్టాల వివరణ మనకి వారి పట్ల జాలి కలిగేలా సాగిన కవితా ధోరణీ కృష్ణ మోహన్ గారిని బాధిత పక్ష పాతి గా మన ముందు ఉంచుతుంది

వీరి మారిన విలువలు కవిత నేడు సమాజ పరిస్తితి కి మారిన విలువల కి అద్దం పడితే ,పురాణాల పట్ల వీరి కున్న పట్టు యాగం -యోగం లో స్ఫుటం గా తెలుస్తోంది .
ఆలుమగలు ఎలా ఉండాలో కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయికి తల్లి చెప్పే బుద్ధుల్లా నేటి యువతకి ఎంతో అవసరమైన కవిత .

బాల్యం కవితలో మా వంటి వారికీ తెలియని కొన్ని ఆటలు తెలియజేస్తూ ,చిన్ననాటి ముచ్చట్లు గుర్తుతెస్తుంది .జై జవాన్ -జై కిసాన్ కవితలో రైతుని ఆత్మ త్యాగి గా ,సైనికుడిని ప్రాణ త్యాగి గా పోలుస్తూ ఇద్దరికీ సమాన గౌరవాన్ని కల్పించారు .

ఉగాది పై రాసిన కవితలో ఉగాదులు మారుతున్నపుడు ఆకులు రాలుతున్నాయి ,ప్రతిసారీ ఆదాయ ,వ్యయాలు చూడ్డం తప్ప అనడం లో కొంత పరిస్తుతుల పట్ల నిరాశ పేదల బ్రతుకులు మార్పు లేదు అన్న చిన్న విమర్శ తొంగి చూస్తాయి .ఇలా వచనం మాత్రమే కాక ,సీస ,ఆ .వె ,కందము వంటి పద్యాలు కూడా అద్భుత భావం తో వెలువరించారు

ఇంకా వీరి కలంనుండి సమాజానికి ఉపయోగపడే కవనాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాను....

ఇట్లు
చామర్తి అరుణ ఫణిందర్
MA, B. Ed.,
హన్మకొండ. 

ప్రియా... ఓ ప్రియా....


ప్రియా.... ఓ ప్రియా

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

ఓ ప్రియా....
ఏలని మరువను నిన్ను....
నానుండి నీ ఎడబాటు.... 
బౌతికమే తప్ప.. శాశ్వతం కాదు...
ఎందుకంటే....
నా కనులముందు నిరంతరం కదిలియాడే నీ కన్నులే అందుకు సాక్ష్యం ....
నా చెవుల ముందు నాట్యమాడే నీ పెదాలే నిలువెత్తు దర్పణం...
నా వొడిలో నిరంతరం నీతలను వాల్చినట్టనిపించే అనుభూతే అనుభవం....
నా చేతిలో ఎప్పుడూ నీచేతి స్పర్శ తగులుతూనే ఉంది....
నా శ్వాస నీవు.... నా ఊపిరి నీవు....
నా గుండెలో పదిలంగా నిలిచివున్న నిలువెత్తు విగ్రహానివి నువ్వు.....
ఏల మరవగలను సఖీ నిన్ను....
ఎవరు అడ్డుతగిలి నిన్ను నా నుండి దూరం చేసినా ....
నా మనసునుండి మాత్రం దూరం చేయలేరు ప్రియా.....
నువ్వెక్కడున్నా.... క్షేమంగా ఉండాలని కోరుకునే..... నీ నిజమైన ప్రియుడు..... 

(విడిపోయే ప్రేమజంటలకు అంకితం)

Sunday, August 21, 2016

కన్నె కలలు

కన్నె కలలు

కన్నె కలలు

యుక్తవయస్సు రాగానే పడుచులంతా తనతోటివారితో పోల్చుకొని కొత్త కొత్త కలలు కంటుంటారు....

పాపం వారు కన్న కలలు... కల్లలే అవుతుంటాయి....

తన స్నేహితురాలి మొగడు టక్కు బిక్కు వేసుకుంటే... 
నా మొగడు సూటు బూటులో ఉండాలనుకొంటుంది .....
పాపం.... ఊరోడో...లేక సాదాసీదోడో దొరుకుతాడు...

తన ఫ్రెండ్ మొగడు బైక్ పై వస్తే.... 
తనమొగుడికి కారుండాలనుకొంటుంది....
పాపం బస్సెక్కించే వాడు దొరుకుతాడు ...

తన దోస్తు మొగడు ఏదడుగుతే అదిప్పిస్తాడు.... 
నా మొగడు నేనేదీ అడగకుండానే అన్నీ ఇప్పంచేవాడు దొరకాలనుకుంటే....
పాపం ఎదడిగినా ఇప్పుడవసరమా అనేవాడు దొరుకుతాడు...

తన మిత్రురాలికి స్వంతిల్లుంటే...
తనకు బంగళా అయనా ఉండాలనుకుంటుంది....
పాపం అద్దిల్లే తనకు ఇల్లవుతుంది....

తన సోపతిదారు భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే.... 
తన మొగడికి సాఫ్టవేరు ఉద్యోగం ఉండాలనుకుంటుంది.....
పాపం ప్రయివేటు ఉద్యోగంతోనే సరిపెట్టుకుంటుంది.....

తన నేస్తం మొగడు పట్నంలో ఉంటే.... 
తన మొగుడు విదేశాలలో ఉండాలనుకుంటుంది...
పాపం పల్లెటూర్లోనే కాపురం పెడుతాడనుకోలేదు....

తనతోటి మితృలతో పోల్చుకుంటూ తనభర్తను వదుల్చుకుందామనుకుంటే....

తనభర్త తాగుబోతు కాదు...
తిరుగుబోతు కాదు....
తిండిబోతు కాదు....
సోమరిపోతు అంతకన్నా కాదు...
అడ్డమైనవాడు కాదు....
అమ్మాయిల వంక చూడడు....
దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాడు....
భార్యంటే ప్రాణం....
పిల్లలంటే ప్రేమ...
అత్తమామలంటే ఆప్యాయత....
అందరినీ ప్రేమిస్తాడు ....
పంచభక్ష్య పర్వాన్నాలు పెట్టకున్నా....
పస్తులు మాత్రం ఉంచడు...
ఆస్తులు కూడబెట్టకున్నా....
అప్పులు మాత్రం చేయడు....

ఇప్పుడు చెప్పండి....
తన కలలు సాకారం కాలేదని భర్తను వదలడమా?....
ఇంతకన్నా మంచోడు దొరకడని కాపురం చేయడమా?....

ఇలా అంతర్మధనంతో .....
మనసును చంపుకోలేక....
కోరికలు తీర్చుకోలేక...
కాపురాలు చేస్తున్న పడచులు 
ఎందరో.... ఎందరెందరో ...
అందరికీ అంకితం

ఇట్లు
సహస్రకవిమిత్ర 
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653


Saturday, August 20, 2016

మద్యతరగతి పేదరికం

గోగులపాటి కృష్ణమోహన్ .

మధ్యతరగతి  పేదరికం

పేదవానిగ పుట్టవద్దు..
మద్యతరగతి బతుకువద్దు...

మధ్యతరగతి వానిగా పుట్టినందుకు బాధపడాలో...  ...
పేదవానిగ పుట్టనందుకు సంతోషించాలో అర్ధకాని బతుకు...

సైకిల్ లేనివారిని చూసి సంతోషించాలో
బైకులేని వాన్ని చూసి బాధపడాలో ....
కారులేదని కలతచెందాలో...
అర్ధంకాని పయనం  ....

స్థలం ఉన్నందుకు సంతోషించాలో ...
బంగళా లేనందుకు బాధపడాలో అర్ధం కాని జీవితం....

పంచభక్ష్య పర్వాన్నం లేనందుకు బాధపడాలో
పస్తులు లేనందుకు సంతోషించాలో అర్ధంకాని అవేదన...

ఆస్తులు లేనందుకు బాధపడాలో..
అప్పులు లేనందుకు సంతోషించాలో అర్ధం కాని దుస్థితి ....

ప్రభుత్వ ఉద్యోగం లేదని బాధపడాలో ...
ప్రయివేటుదైనా ఉందని సంతోషించాలో ... అర్ధం కాని అవస్థ...

ఆప్తులు లేనందుకు బాధపడాలో ...
శత్రువులు లేనందుకు సంతోషించాలో.. అర్ధం కాని సమాజం....

ఆడంభరాలు లేనందుకు బాధపడాలో ...
ఆనందంగా ఉన్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి ....

పిల్లల్ని కార్పోరేట్ చదువులు చదివించనందుకు బాదపడాలో...
కనీసం కాన్వెంట్ అయినా చదివించినందుకు సంతోషించాలో అర్ధం కాని వ్యవస్థ....

మొత్తానికి మా బతుకులు...
ఆరోగ్య శ్రీ కి ఎక్కువ...హెల్త్ కార్డుకు తక్కువ
బైక్ కు ఎక్కువ... కారుకు తక్కువ
ప్లాటుకు ఎక్కువ... ఫ్లాటుకు తక్కువ..

మధ్యతరగతి వానిగా పుట్టినందుకు బాధపడాలో...  ...
పేదవానిగ పుట్టనందుకు సంతోషించాలో అర్ధకాని బతుకు...

ఇట్లు
సహస్రకవిమిత్ర
గోగులపాటి కృష్ణమోహన్ .
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Sunday, August 14, 2016

గోగులపాటి కృష్ణమోహన్.... (జన్మదిన ప్రత్యేకం)

కేబుల్ రంగంలో అడుగిడి 
ఇరువై యేళ్ళు పూర్తి చేసుకున్న 
గోగులపాటి కృష్ణమోహన్.... 
(జన్మదిన ప్రత్యేకం)

1996 డిసెంబర్ లో సౌజన్య శాటిలైట్ నెట్వర్క్ లో రూపొందించిన వెల్కమ్ టు 97 కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమై... ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.  

కేబుల్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన గోగులపాటి కృష్ణమోహన్ కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై వసంతాలను పూర్తిచేసుకున్నాడు. 

జీడిమెట్ల సిటీకేబుల్ లో,  మార్కెటింగ్
మేనేజర్ గా, ప్రోగ్రామ్ ఇంచార్జ్ గా, న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, న్యూస్ ఇంచార్జ్ గా పలు విభాగాలలో రాణించి సుమారు యాబైకి పైగా కార్యక్రమాలను రూపొందించి అందరిమెప్పు పొందాడు.

శుభోదయ కమ్యూనికేషన్ లో ఆపరేషన్ ఇంచార్జ్ గా మెదక్ జిల్లాలో పనిచేశాడు, హిందుజా హిట్స్ లో మెదక్, రంగారెడ్డి జిల్లాల టెరిటరీ మేనేజర్ గా కూడా పనిచేశాడు. గతంలో మరియు ప్రస్తుతం డిజీకేబుల్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

తనకు హాబీలైన వ్యాసాలు, కవితలు, పద్యాలు రెండు శతకాలు  రాసి తెలుగువేదిక ఆధ్వర్యంలో 2016 లో "సహస్ర కవిమిత్ర" బిరుదును కూడా పొందాడు.

వీటితో పాటు సురారం కాలనీ లోని శ్రీ నల్లపోచమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజసేవ లో సైతం తనవంతు పాత్రను పోషించాడు. 

మరోవైపు తనకిష్టమైన వార్తా రంగంలో స్టింగర్ గా కూడా పనిచేస్తూ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్, అల్వాల్ శాఖకు అడ్వైజర్ గా తన సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా  బ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ది కోసం తనవంతు భాద్యతగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఈ సందర్భంగా కృష్ణమోహన్ కేబుల్ సమాచార్ తో తన అభిప్రాయం తెలియజేస్తూ
కేబుల్ రంగానికి పరిచయం చేసి తనకు సమాజంలో మరో జన్మను ప్రసాదించిన తెలంగాణ ఎఫ్. టి. ఎమ్. అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డికి తనెంతో ఋణపడి ఉంటానని తెలిపాడు.

కేబుల్ టీవీ రంగంలో సీనియర్లైన శ్రీకుమార్, ఇంతియాజ్ అహ్మద్, ఆర్కే సింగ్, మనీష్ మాథూర్, సత్య, కిషోర్, వికాస్ కన్వర్, ప్రతాప్ రెడ్డి లాంటి వారితో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని...  వారి నుండి కేబుల్ ఇండస్ట్రీకి సంబందించిన ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాని పేర్కొన్నాడు.

ఇంతకాలం తనకు అన్నివిధాల సహాయ సహకారాలందించిన కేబుల్ ఆపరేటర్లకు
తోటి సిబ్బందికి దన్యవాదాలు తెలియజేశాడు.

ఇలా విభిన్న రంగాలలో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న గోగులపాటి కృష్ణమోహన్ ఈ ఆగస్టు 13న తన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.