Sunday, November 5, 2017

మిడిల్ క్లాసు బతుకు

గోగులపాటి కృష్ణమోహన్
మిడిల్ క్లాస్ బతుకులు

మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
మనకు మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
ఉన్నోనితొ ఉరకలేము
లేనోనిగ బతకలేము.. ||మిడిల్||

కార్పోరేట్ బడులకు
కాసులను పెట్టలేము
ప్రభుత్వ బడులకు
పిల్లలను పంపలేము
చాలీచాలని చదువులు
మాబతుకుకు భాగ్యమాయె ||మిడిల్||

పెద్ద దవాఖానాలకు
పోలేనీ బతుకుమాది
ప్రభుత్వ దవాఖానాలకు
పోదామంటే భయము
రోగమునొప్పొచ్చినపుడు
ఆరెంపిలె గతిమాకు || మిడిల్||

పట్టుచీర కొనలేము
ఉట్టిచీర కట్టలేము
అద్దాలషోరూములు
అవతలినుండే జూస్తూ
క్లాసుగా ఉన్న చీర
మామూలు ధరలకడిగే ||మిడిల్||

డూప్లెక్సు ఆశాయె
పెద్ద కొంప లేదాయె
అపార్ట్మెంట్ వద్దాయె
అద్దె కొంప కరువాయె
స్వంత కొంప కలకోసం
అప్పులపాలవ్వాలె ||మిడిల్||

పెళ్ళీ పేరంటాలకు
ఇరుగుపొరుగు దావతులకు
బంగారునగలు కొనలేము
వెండినగలు పెట్టలేము
పెళ్ళిపేరంటాలకు
నగిషీ నగలే ముద్దు ||మిడిల్||

ఎరోప్లేను ఎక్కలేము
ఏసీలో పోలేము
ప్రైవేటు బస్సుల్లో
ప్రయాణం చేయలేము
ఎర్రవస్సు, కర్రె రైలు
టూవీలరె మాకు దిక్కు ||మిడుల్||

మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
మనకు మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
ఉన్నోనితొ ఉరకలేము
లేనోనిగ బతకలేము.. ||మిడిల్||

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Thursday, November 2, 2017

యాది మరవకు బిడ్డ..

రచన :
సహస్రకవిమిత్ర, కవిరత్న, కవిప్రవీణ.
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టుు

శీర్షిక: యాదిమరవకు బిడ్డా
యాది మరవకు బిడ్డ.. యాది మరవకు మమ్ము
ఏదేదొ జేసుకొని ..ఏడిపించకు మమ్ను..

పుట్టలకు మొక్కాము.. గుట్టలను ఎక్కాము
నువ్వుపుట్టాలని .. గుడులెన్నొ దిరిగాము..
ఏ పుణ్య ఫలమో....ఏదైవ బలమో..
మాకడుపులో నువ్వు ... పుట్టావు బిడ్డా...
||యాది మరవకు బిడ్డ||

కాయ కష్టము చేసి... కాని కొలువులు జేసి
కంటికి రెప్పలా .. కాపాడుకున్నాము
అప్పుసప్పులు చేసి. .ఆస్తులమ్నుకోని
ఆడిగినదె తడువుగా..... అన్నియిప్పించాము
||యాది మరవకు బిడ్డ||

పడిగాపులూ పడుతు.. పస్తులే ఉన్నాము
ఏ లోటురాకుండా.. పెంచుకున్నము కొడక
పై సదువులు సదవ.. పట్నమే పంపాము
పెద్దకొలువులతోటి.. పైకి రావాలని
||యాది మరవకు బిడ్డ||

మందులని చిందులని... పబ్బులకు వెళ్ళకు
పేకాట ఆడుటకు.. క్లబ్బులకు వెళ్ళకు
సిగరెట్లు సినిమాలు.. మత్తుపానీయాలు
ఆడపిళ్ళల జోలి.. అస్సలే వెళ్ళకు
||యాది మరవకు బిడ్డ||

రేసు బండ్లు వద్దు.. ర్యాసు డ్రైవింగొద్దు
ఫుట్టుబోర్డు వద్దు.. సీటులోనే ముద్దు
ఇరుగు పొరుగు తోటి... పోట్లాటలే వద్దు
సంఘాల స్ట్రైకుల... జోలికే పోవద్దు
||యాది మరవకు బిడ్డ||

రాజకీయాలొద్దు.. రౌడివేశాలొద్దు
రంకులాడిలతోటి.. రాసుకుతిరుగొద్దు
మాయ మాటల తోటి.. మోసాలు జేసేటి
మాయజాలము లోన.. నీవసలె పడవద్దు
||యాది మరవకు బిడ్డ||

వాట్సప్పు ఫేస్బుక్కు.. ట్విట్టరు, హైకంటు
అంతర్జాలంలో... ఆగమయ్యిపోకు
అండ్రాయిడైఫోన్.. ట్యాబ్ ల్యాప్ టాపంటు
భారి షోకులకెళ్ళి.. భాద్యతలు మరిచేవు
||యాది మరవకు బిడ్డ||

ఎంత చదివిన గాని.. ఏది నేర్చిన గాని
ఇంకిత జ్ఙానము .. కొంతైన నేర్వరా
పెద్దలను గౌరించు.. పిన్నలను ప్రేమించె
మర్యాద మన్ననలు.. నేర్చుకోవాలని
||యాది మరవకు బిడ్డ||

అడ్డంగ తిరగకు... అప్పులే జేయకు
ఆలినీ, తాళినీ... తాకట్టు పెట్టకు
గుర్రపుస్వారీ లు... క్రికెటుబెట్టింగులని
అప్పులా పాలయ్యి ఆగమవ్వకు నువ్వు
||యాది మరవకు బిడ్డ||

చదువుకోలేదని... ర్యాంకురాలేదని
ఇరుగు పొరుగు ముందు.‌ చులకనౌతావని
కన్నోల కలలను... కాలితో తొక్కేసి
కాటికెళ్ళె పనులు... జేయమాకుబిడ్డ
||యాది మరవకు బిడ్డ||

ఉంటేనె తిందాము... లేదంటె పందాము
బతికున్నన్నాళ్ళు... కలిసిమెలిసుందాము
బాగుపడకున్ననూ.. బాధలేదూ బిడ్డ
దైర్యంగ మన బతుకు.. బతుకుదాము బిడ్డ
||యాది మరవకు బిడ్డ||


మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు
9700007653