Monday, April 3, 2017

టచ్ స్క్రీన్



చిట్టి కథలు - 1)టచ్- స్క్రీన్
గోగులపాటి కృష్ణమోహన్


అదో మద్యతరగతి కుటుంబం. నెలసంపాదనతోనే ఇల్లు గడవాలి, ఆశలు ఆశయాలు బొలెడున్నాయి.... కానీ ఆదాయమే తక్కువుంది. అయినా హాయిగా గడుస్తుంది వారి కుటుంబం.

వారబ్బాయి పదోతరగతి పాసయ్యాడు, అదీ స్కూలేకాదు మడలం ఫస్టోచ్చాడు.  తండ్రికి పట్టలేనంత ఆనందం, ఇంటికి రాగానే కొడుకును గుండెకు హత్తుకొని తలపై ముద్దుపెట్టుకున్నాడు.

ఏంకావాలి బేటా అని అడిగాడు. అప్పుడే స్వీట్లు తెస్తూ తల్లి నీ కొడుక్కు మొబైల్ కావాలంట ఇప్పించండి అంది స్వీటు ఇస్తూ..... దాందేముంది ఇప్పిస్తా అంటూ సంతోషం వ్యక్తం చేశాడు తండ్రి. ఆవిధంగా ఆనందంగా గడిపారు అందరు.

మంచి కాలేజీలో చేర్పించేందుకు పాతికవేళ్ళు ఫీజు, ఇంట్లో ఉంటే చెడిపోతాడేమో అన్న భయంతో హాస్టల్లో వేసారు. దానికో అరువైవేలు మొత్తం ఎనుబై ఐదు వేలు దాటింది, కాలేజీ బుల్లోడుకదా అని కొత్తబట్టలు కొన్నారు అంతా తొంబై వరకు చేరింది. రెండేళ్ళుగా కాపాడుకుంటూ వచ్చిన లక్ష రూపాయల చిట్టి ఎత్తుకున్నందుకు అక్కడికక్కడే సరిపోయింది. సెల్ కొందామంటే డబ్బులు లేవు. అందరూ ఒకరిమొహం ఒకరు చూసుకొని ఊరుకున్నారు.

బాబు దూరంగా ఇన్నాడన్న బెంహ ఒకవైపు, కొడుకుతో మాట్లాడలేక పోతున్నామన్న బెంగ మరోవైపు. తల్లిదండ్రులను ఎంతగానో మానసికవేదనకు గురి చేస్తుంది.

తండ్రికి కంపెనీలో బోనస్ రాగానే పదివేలు వెచ్చించి మంచి టచ్ ఫోన్ కొనుక్కొనిపోయి హాస్టల్ లో కొడుక్కి సర్ప్రైజ్ ఇచ్చారు. కొడుకు కూడా చూసి సంతోషపట్టాడు. కానీ వెంటనే డబ్బులెక్కడివి డాడీ అని తండ్రిని అడిగాడు కొడుకు, నాకోసం అప్పుచేశారా అని అమ్మను అడిగాడు. అదేం లేదులే బాబూ.... మీ నాన్నకు ఎప్పటినుండో వస్తాదనుకున్న బోనస్ వచ్చింది, అది పెట్టి తెచ్చాములే అని చెప్పింది అమ్మ. ఇంకా సెల్ గురించి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది, ఫ్రెండ్స్ కు ఇవ్వొద్దని, బయటకు, క్లాస్ రూంలోకి తీసుకెళ్ళొద్దని, గేమ్స్ ఆడొద్దని ఇలా ఎన్నెన్నో చెప్పి వెళ్లలిపోయారు తల్లి దండ్రులు.

వారుచెప్పినట్టుగానే దాచిపెట్టుకొని ఎవరూలేని సమయంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడి తిరిగి దాచిపెట్టుకుంటున్నాడు.

కొన్నాళ్ల తరువాత సెల్లు కాస్త తన మిత్రుల కంట పడింది. అందరూ దానివెంట పడ్డారు. నాకు చూపించు అంటే నాకు చూపించు అని. ఈ సందడిలో సెల్లుకాస్త కింద పడింది, టచ్ పగిలిపోయింది. పిల్లాడి గుండె ఆగిపోయినంత పనైంది.

ఎలా అమ్మన నాన్నలకు చెబితే ఏమంటారో అని భయం. ఆదివారం ఇంటికొచ్చాడు. బయపడుకుంటూ నాన్న బయటకు వెళ్లిన సమయంలో అమ్మతో చెప్పాడు జరిగిందంతా. ఆవేశంలో అమ్మ కాస్త చీవాట్లు పెట్టనే పెట్టింది, మీ నాన్న కష్టపడ్డ సొమ్మంతా నీకు సెల్లుకోసం తగలబెడితే దాన్ని నాశనం చేశావుగదరా అంటూ కాసేపు దండకం చదివింది, ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో ఎమో నాకైతే తెలియదు అని బయపెట్టింది. కొడుకు బయపడటం కన్నా బాధపడ్డాడు.  అమ్మను బ్రతిమిలాడుకున్నాడు. నాన్నకు చెప్పకమ్మా అని. నేను మళ్లీ దసరా సెలవులకు వచ్చినప్పుడు చెబుదాం అని సర్ది షెప్పి ఉదయాన్నే హాస్టల్ వెళ్ళి పోయాడు.

అలా కాలం కదిలిపోతూనే ఉంది. రానే వచ్చాయి దసరా సెలవులు. కానీ కొడుకుమాత్రం ఇంటికి రాలేదు. ఒకరోజు తండ్రి డ్యూటీ ముగించుకోని ఇంటికి వస్తుండగా తన మిత్రుడు కలిసాడు, తనమిత్రుని కొడుకును కూడా అదే హాస్టల్ లో చేర్పించారు. ఏరా మీ అబ్బాయి వచ్చాడా అని అడిగాడు, ఇంకా రాలేదురా అని తన మిత్రునికి సమాదానం చెప్పాడు. దానికి తను అదేంటి మావాడు అప్పుడే వచ్చాడే.... వచ్చి వారంరోజులు కావొస్తుంది మీవాడు ఇంకారాకపోవడం ఏంటి? అని ప్రశ్నించాడు. పైగా పిల్లలమీద శ్రద్ద పెట్టల్సిన పనిలేదా? ఎప్పుడొస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎటెళ్తున్నాడు? అని కనిపెట్టాల్సిన పనిలేదా అంటూ కస్సుబుస్సు మంటూ వెళ్లిపోయాడు.

అదేం పట్టించుకోనట్టుగా ఇంటికి వచ్చాడు కానీ ఎక్కడో తెలియని విచారం. అసలు వీడు ఇంటికి ఎందుకు రాలేదు అని గాబరా. ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి కుర్చీలో కూర్చున్నాడు. ఆవిడ కాఫీ కప్పుతో వచ్చి కాఫీ ఇచ్చింది. అదోలా ఉన్న భర్తను చూసి ఏంటండీ అదోలా ఉన్నారు అని అడిగింది. ఏమీలేదురా అని అన్నాడు కాని ఏదో బెంగ తన మొఖంలో కనిపెట్టింది భార్య. ఏంటో చెప్పండి అని అడిగింది. తనకు తెలుసు. పాతికేళ్ళ కాపురంలో తన భర్త ఎప్పుడు ఎలా ఉంటాడో తనకు బాగాతెలుసు.

అప్పుడు చెప్పాడు.... చిన్నోడి కాలేజీకి సెలవులిచ్చి వారం కావొస్రుందట, వాడు ఇంటికి రాకుండా ఎటువెళ్లిఉంటాడంటావు.... నీకేమైనా చెప్పాడా అని అడిగాడు. వెంటనే తల్లి తల్లడిల్లిపోయింది. అదేంటండీ వారం రోజులు వీడు రాకుండా ఎటువెళ్లిఉంటాడు అని ఎదురు ప్రశ్న వేసింది ఆదుర్తగా....

అదేంలేదులే.... ఏదో హోంవర్క్ ఇచ్చిఉంటారు అందుకే రాకపోయిఉండొచ్చు. వాడెటు వెళ్తాడే అంటూ భార్యకు ధైర్యం చెప్పి బయటకు వెళ్ళాడు తను.

తల్లికి కొడుకు ఫోన్ గుర్తకు వచ్చింది, అది పగిలిపోయిందని బయపడి ఇంటికి రాలేదేమోనని ఆలోచిస్తూ వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది. రింగు అవుతుండగానే కొటుకు ఇంట్లోకి అడుగుపెట్టాడు..... తట్టుకోలేని ఆవేశం, ఆక్రోశం, ప్రేమ అన్ని కొడుకుపై చూపించి తిట్టసాగింది. వారం రోజుల క్రిందట సెలవులిస్తే ఇప్పుడా రావటం అని కడిగేసింది. అందుకు కొడుకు నవ్వుతూ,  అమ్మను గట్టిగా వెనకనుండి పట్టేసుకోని జేబులోనుండి సెల్లుతీసి చూపించాడు.

సెల్లుచూసి తల్లి ఆశ్చర్యపోయింది, అరె సెల్లు పగిలిపోయింది కదా, మరి ఇప్పుడెలా బాగైంది అని అడిగింది కొడుకుని, అప్పుడు అబ్బాయి అమ్మతో అన్నంపెట్టమ్మా బాగా ఆకలవుతోంది అనగానే అయ్యోరామా అంటూ అన్నం కలుపుకొనివచ్చి ముద్దలు తినిపిస్తూ వివరాలు అడిగితెలుసుకుంది. నాన్నకు చెప్పొద్దంటూ జరిహిన విషయం చెప్పాడు తల్లికి. తల్లికంట్లో నీళ్ళుకారడం చూసి నేనేమైనా తప్పు చేసానా అమ్మా అని అడిగాడు. లేదుబేటా అంటూ కొడుకును ముద్దాడి వెళ్ళింది తల్లి.

తండ్రి బయటనుండి వచ్చేసరికి కొడుకు తిని పడుకున్నాడు. ఎప్పుడొచ్చాడు వాడు, తిన్నాడా ఏమైనా అని అడిగాడు తండ్రి, ఆ... తినె పడుకున్నాడండీ అని చెప్పంది అమ్మ. వాళ్ళిద్దరూ కూడా తిని పక్క ఎక్కారు.

ఇంతకూ వాడు వారం రోజులు ఎందుకు రాలేదంటా.... ఏమైనా చెప్పాడా అని అడిగాడు. అందుకు తాను ఏం చెప్పాలో అర్దం కాలేదు. తన భర్తవద్ద ఇప్పటివరకూ ఎదీ దాయలేదు. ఇది కూడా దాయడం ఇష్టం లేక సెల్లు పగిలిపోయిన విషయం అంతా చెప్పింది. అందుకు తండ్రి పోతే పోయింది లేరా.... ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటివి మామూలే అన్నాడు తండ్రి.  అంతమాత్రానికి ఇంటికి రాకుండా పోతాడా ఏంటి. అని అన్నాడు. దాందేముంది ఈ సారి జీతం రాగానే బాగుచేయిస్తా అని చెప్పు అని పడుకోబోయాడు. వెంటనే భార్య అవసరం ఏమీ లేదులెండి వాడే బాగుచేయించుకోని వచ్చాడు అంది. అదెలా.... వాడిదగ్గర అంత డబ్బెక్కడిది అని అడిగాడు. అందుకు తనకొడుకు చెప్పిన విషయం ఈ విధంగా చెప్పింది తల్లి.

ఈ వారం రోజులు వాడు తనకు తెలిసిన స్నేహితుని మొబైల్ షాపులో రోజు సిమ్స్ అమ్మడానికి వెళ్ళాడంట, రోజుకు మూడువందలనుండి నాల్గొందల వరకు ఇచదచారంట. పద్దెనిమిది వందలవరకు వరకు సంపాదించి దానిని బాగు చేయించుకొన్నాడంట అన గద్గద సదవరంతో చెప్పింది.

తండ్రి నోటివెంట మాట రావడంలేదు. ఏమండీ ఏమండీ అని బర్తను తనవైపుకు తిప్పుకొంది. కళ్ళనీళ్ళు బయటకు వస్రున్నాయి బలవంతంగా..... అది చూసి భార్యకూడా బాధపడుతూ.... అదేంటండీ వాడు ఏం తప్పుచేశాడు చెప్పండి. మీరు ఎంతప్రేమగానో తెచ్చిన మొబైల్ పగిలిపోయింది అనిమీకు తెలిస్తే మీరెంత బాధపడితారో అని వాడు మీకు చెప్పలేదండి. మీరు బాధపడొదు అని ఊరడించింది.

ఛ అదేం లేదే.... నాకు బాధపడాలో.... సంతోషించాలో అర్ధం కావడం లేదురా.... నాపేదరికం వాణ్ణి కష్టపెట్టినందుకు బాధపడాలో..... అదే పేదరికం వాణ్ణి ఇంతగా ఆలోచింపజేసినందుకు సంతోషించాలో అర్ధం కావడం లేదమ్మా.... అంటూ లేచి కొడుకు పడుకున్న రోంలోకి వెళ్ళి పడుకున్న కొడుకు నుదురు పైముద్దాడి వచ్చి భార్యపక్కకు చేరాడు .....

ఇద్దరూ కునుకుతీశారు.... పొస్దున్నే అందరూ లేచి దసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.... కొడుకు ఫోనులో ఫోటోలు దిగి ఫేస్ బుక్కు, వాట్సప్ ల నిండా పెట్టి సంబరాలు జరుపుకున్నారు....


సశేషం


మీ
గోగులపాటి కృష్ణమోహన్
9700007653