Wednesday, December 30, 2015

పల్లె గుల్లాయెగా

                         శీర్షిక : పల్లె గుల్లాయెగా


పట్నం షోకులో పల్లె కాస్త కాలయ్యింది
పచ్చని చెట్లు... పంట పొలాలు ....
బాయిల నీళ్ళు.... చెరువుల చేపలు...
అన్నీ నేడు కథలుగా మారాయి
మోట బావులు పోయి మోటార్లు వచ్చె
ఎడ్ల బండ్లు బోయి ట్రాక్టర్లు వచ్చే
నాట్లు వేసినాము... కలుపు తీసినాము,
కోత కోసినాము... కుప్ప బెట్టినాము...
దొడ్ల ఉన్న అన్ని గొడ్ల తోటి
బంతి తొక్కుకుంటు గంతులేసినాము....
తవ్వ, శెరు, బుడ్డి, కుండ బస్త లతోటి.
పుట్ల కొద్ది వడ్లు లెక్క కొలిసినాము...
కొత్త బియ్యము తోటి కొత్తలే చేశాము....
ఆనందమంతా మా ఊర్లనే గడిపాము...
వడ్లోల్ల తాత తో నాగలే చెక్కించి
కమ్మరి కొలిమిలో కర్రులే కాల్చాము
కుమ్మరి చేసేటి కుండలతో ఆడాము
చిన్న సైకిలు ఎక్కి ఊరంతా తిరిగాము
కొత్త బట్టలు కుట్ట మేరోల ఇంటికి
పూటపూటకు వెళ్లి తిరిగి వచ్చాము
అంగి గుండీలు లేకున్న పిన్నీసు పెట్టికొని
పండుగంత అట్లే వెళ్ళదీసాము...
పీర్ల పండుగనాడు ఆల్వ ఆడినాము
హోళి పండుగనాడు రంగులాడినాము
బుర్రకథల వాళ్ళు, బుడుమక్కలోళ్ళు
తోలుబొమ్మలాట... బాగోతులాట...
రచ్చబండకాడ పెద్దోళ్ళ ముచ్చట్లు
రాత్రి బడులకాడ పిల్లోల ముచ్చట్లు
ఎంతబాగుబాగు మా ఊరు నాడు
చేతివృత్తుల వారు నేడు కరువయ్యినారు
ఆటలాడువారు ఆగమయ్యారు
పనిలేక కొందరూ... షోకులకు కొందరు
ఆలిపోరుతో కొందరు, చదువులకు కొందరూ
పల్లెవిడిచినారు... బోసి చేసినారు...
పల్లె ప్రేమలన్నీ మంటకలిసేనుగా
పట్నం మోజులో పల్లె గుల్లాయెగా

No comments:

Post a Comment