Thursday, December 29, 2016

అవేరా తో గోగులపాటి కృష్ణమోహన్ ముఖాముఖి

*4. 'సహస్రకవి పరిచయాలు కార్యక్రమానికి'*
స్వాగతం

నేటి అథితి

 *'సహస్ర కవిరత్న, సహస్రవాణి శతపద్య కంఠీరవ sk101 అనుసూరి వెంకటేశ్వరరావు  గారిని* ఈ సారి పరిచయం చేయబడును. 

పరిచయం చేయువారు  *'సహస్ర  ప్రయోక్త 3' సహస్ర కవిరత్న, సహస్రవాణి శతపద్య కంఠీరవ sk326 గోగులపాటి క్రిష్ణమోహన్ గారు* 

ఈ పరిచయ కార్యక్రమం పూర్తిగా వాట్సప్ ను వేదికగా చేసి నిర్వహింబడును. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
అందరకి నమస్కారం 🌺🙏🏽🌺
నేను మీకు పరిచయం చేస్తున్న కవి ఇందుగలడందులేడన్న సందేహం లేకుండా.... ఎందెందైనా కవితలు/పద్యాలు రాయగల సమర్ధుడు....

ఆట వెలది తోటి ఆటలాడేవేర
తేటగీతితోటి తేనె లొలికె
కందమందు తాను ఘనుడాయె మెండుగా?
జ్యోతి నవ్య కృష్ణ జుడుఁ మఖిల

ఆటవెలదితోటి ఆటలే ఆడావు
రెండు శతకములను నిండు జేసి
ఏవిరావుగారు అందుకో వందనం
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

ఇంకా చెప్పాలంటే ఇతను ఏ అంశాన్నీ వదిలిపెట్టడు... వస్తువు దొరకడమే ఆలస్యం.... కవిత అలా దావానలంలా వచ్చేస్తుంది.... అతనే మనమందరం ప్రేమగా ఏవీరావనీ.... అవేరన్నా అని పిలుచుకునే అనుసూరి వెంకటేశ్వరరావు గారు.

*గోగులపాటి క్రిష్ణమోహన్*

నమస్కారం అవేరా అనిపిలుచుకునే అనుసూరి వేంకటేశ్వర రావు గారూ

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నమస్కారం! గోగులపాటి కృష్ణమోహన్ గారూ!
నా పరిచయ కార్యక్రమానికి సహస్రప్రయోక్త గా
వ్యవహరిస్తున్నందుకు అభినందనలు...ధన్యవాదములు!

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ముందుగా మా సహస్రకవులకు మీ పరిచయం తరలియజేస్తారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా పరిచయం సంక్షిప్తంగా....

సహస్రకవి  నం:101 
వృత్తి: సూపరింటెండెంట్ ఇంజనీరు (SE)
నీటిపారుదలశాఖ 
ప్రభుత్వ సర్వీసు:30 సం పైన
విధులు:కాల్వల నిర్మాణము, నిర్వహణ,
రిజర్వాయర్ల నిర్మాణము,నిర్వహణ,ఆఫీసు పరిపాలన
పుట్టిన ఊరు: ఖమ్మం 
పుట్టిన తేదీ 03/11/1961
తండ్రి:వెంకట రావు. Retdడిప్యూటీసూపరింటెండెంట్ పోలీస్(DSP)
తల్లి: సూర్యాకాంతం (గృహిణి)
భార్య: సూర్యవరలక్ష్మి 
పిల్లలు :ముగ్గురు
స్థిరనివాసము: హైదరాబాదు  
విద్యార్హత :బి.టెక్(సివిల్)జె.యన్.టి.యూ
సాహిత్య సేవ: 
ఇంటర్మీడియేట్ లో AIR యువవాణిలో "చైతన్య బాట"  కవిత 
కాలేజిలో వ్యాసరచనలో అన్నిపోటీలలో మొదటి బహుమతులు (సాహిత్యం పట్ల అభిరుచి పెరగటానికి స్ఫూర్తి)....మా గురువుగారు ఆచార్య తిరుమల గారి ద్వారా.
1990 -91లో ఆంధ్రభూమి వారపత్రికలో కవర్ పేజీ కామెంట్లకు చాలా వారాలు బహుమతి అందుకున్నా
(ఉద్యోగ భాద్యతల వల్ల రచనా వ్యాసంగానికి సాహిత్య సేవకు చాలాకాలం దూరమయ్యాను)
2010లో తెలుగు పీపుల్.కామ్ లో పబ్లిష్అయిన కొన్ని కవితలు
2015లో తెలుగు వేదిక.నెట్ లో పబ్లిష్ అయిన కవితలు
మరియు "గ్లోబల్ వార్మింగ్"వ్యాసము
అక్టోబరు 2015 అక్టోబరు15న  సహస్ర కవిగా చేరిక
సహస్ర కవిగా మొత్తం 900పైగా 450 వచన మరియు 450పైగా  పద్య కవితలు (నాలుగు చందస్సులతో)
ఆటవెలదులతో శతకము "జీవన సత్యాలు"
మరియు  కంద పద్యాల శతకము
కథలు...5(స్వచ్ఛపల్లె కథ తెలుగువేదికలో ప్రచురించబడినది)
నానీలు:30
పాటలు:15
అవేరా వ్యంగోక్తులు(జోక్స్)--12

మొత్తం:950 పైగా వివిధసాహితీ ప్రక్రియలు

తెలుగువేదిక.నెట్ ఇ మాగజైన్ సంపాదక సభ్యుడు

కలం పేరు: అవేరా
స్వంత బ్లాగ్(బ్లాగ్ చేసిచ్చినవారు కవిమిత్రులు గోగులపాటి కృష్ణమోహన్ గారు)
http://avraokavitalu.blogspot.in/?m=1
క్రీడారంగం:1.ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ ఇంటర్ యూనివర్సిటీచదరంగం పోటీలలో జె.ఎన్.టి.యు(JNTU)కు ప్రాతినిధ్యము
అభిరుచులు:పుస్తకపఠనం,తెలుగు పద్య,వచన కవితలు ,వ్యాసాలు కథలు,పాటలు
ఆంగ్లకవితలు చదువుట ,వ్రాయుట
తెలిసిన భాషలు:తెలుగు ఆంగ్లం హిందీ

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీరు మొదటిసారిగా కవిత ఎప్పుడు రాసారు.... ఏ సందర్భం... మీ హృదయాన్ని కదిలింపజేసిందో తెలియ జేయగలరా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా మొదటి కవిత "ప్రగతిబాట" 
ఒక రోజు మా గురువు గారు ఆచార్యతిరుమల గారు
(ఇంటర్ లో) తెలుగు క్లాస్ పూర్తయ్యాక రేడియో కార్యక్రమం కోసం ఎవరైనా కవితలు పాటలు వ్రాసి లేదా పాడ గలిగిన వారు పేర్లు ఇవ్వండి రాసి రేపు ఇవ్వండి
అన్నారు..
అప్పుడే నాకు కవిత రాయాలనిపించింది
"ప్రగతిబాట"(యువతకు సందేశంతో) కవిత రాసి వివిధభారతి యువవాణి 
కార్యక్రమంలో చదివి వినిపించాను 1978లో.

కృష్ణమోహన్ గారూ
నేను 2015 లో నా చిరకాల మిత్రుడు B.Tech సహచరుడు మేక రవీంద్ర గారు కవుల గ్రూపు మొదలుపెడుతున్నాను  అన్నప్పుడు సాహిత్యం పై అభిలాష  తెలుగు భాషపై అభిమానం నన్ను సహస్ర కవుల గ్రూపులో చేర్పించాయి.
కానీ గ్రూపులోని సహచర కవుల కవితలు చూసి
స్పందనలను చూసి నాలోని కవి నిద్ర లేచాడనిపిస్తుంది
ఈరోజు నేను ఇన్ని కవితలు కథలు పాటలు పద్యాలు
వ్యాసాలు వ్రాసానంటే...ఆ ఘనత రవీంద్రగారికి
నన్ను అనుక్షణం భుజం తట్టి ప్రోత్సహించిన తోటి కవి మిత్రులు ఇందిర గారూ, వీరారెడ్డి గారూ,బండకాడి అంజయ్యగౌడ్ గారూ,విజయదుర్గ గారూ, అరాశగారు,
రామబుద్ధుడుగారూ,రాజావాసిరెడ్డిమల్లీశ్వరిగారూ,అంబటిభానుప్రకాష్ గారు,సీవి కుమార్ గారూ,కడబాల నాగేశ్వరరావుగారు,పిన్నకనాగేశ్వరరావుగారు,మన్నెలలితగారు,శ్రీదేవిరాపూర్ గారు,గుండు మధుసూధన్ గారూ మద్దా  సత్యనారాయణగారూ తరుణ్ గారు అరుణచామర్తిగారు, ఇంకా ఎందరో  సహస్రకవులది (స్థలాభావం వల్ల అందరిపేర్లూ రాయలేకపోతున్నా)
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు .
అద్భుతస్పందనలతో నాలోస్ఫూర్తినింపి సాహిత్యాన్ని 
చదువుకుందామని సహస్రకవిగా చేరిన నన్ను సాహితీవేత్తగా, సహస్రకవిరత్నగా నిలిపిన ప్రతి కవిమిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా....
ప్రత్యేకించి మేకరవీంద్ర గారికి
నా కవితలకు అప్పుడప్పుడూ
మార్గదర్శిగా నిలిచిప్రోత్సహించిన మల్లేల విజయలక్ష్మిగారికీ....
నాకు పద్యరచనలో చందస్సు నేర్పి పద్యరచనలో
గురుతరభాద్యతను నిర్వహించి నా కవితలు సమాజానికి చేరేలా బ్లాగ్ ని ఏర్పరచిన మీకు నా
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా....

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇప్పటివరకు మీరు ఎన్ని వచన/భావ కవితలు రాసారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
సహస్ర కవిగా మొత్తం 900పైగా 450 వచన మరియు 450పైగా  పద్య కవితలు (నాలుగు చందస్సులతో)
ఆటవెలదులతో శతకము "జీవన సత్యాలు"
మరియు  కంద పద్యాల శతకము
కథలు...5(స్వచ్ఛపల్లె కథ తెలుగువేదికలో ప్రచురించబడినది)
నానీలు:30
పాటలు:15
అవేరా వ్యంగోక్తులు(జోక్స్)--12
మొత్తంగా 950 పైగా సాహితీ ప్రక్రియలు రాసాను

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీరు కొన్ని పాటలు కూడా రాసినట్టున్నారు కదా.... ఎందుకు మీకు పాటలు రాయాలనిపించింది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
మొదట నాకు కవితలకంటే పాటలు రాయలన్న అభిలాష ఎక్కువగా వుండేది ఎందుకంటే ఈ రోజుల్లో
కవితలు చదివే పాఠకులకన్నా పాటలు వినే శ్రోతలు ఎక్కువ....జనంలోకి పాట త్వరగా చేరుతుంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
సినీమాల్లో రాయాలని కోరిక ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా స్వీయ రచనలో ఆడియో లేదా వీడియో ఆల్బం చెయ్యాలనుకునే వాడిని.
అవకాశం వస్తే సినిమాలకు పాటలు రాయాలని వుంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీకు పద్యరచన చేయాలనే కోరిక ఎందుకు వచ్చింది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఆరోజుల్లో అంబటి భానుగారు ,మీరు ,గుండు మధుసూధన్ గారు పద్యాలు రాయటం చూసి నాకూ రాయాలనిపించింది మీ దగ్గరే చందస్సు నోట్స్ తీసుకుని సులభంగా రాయగలిగే ఆటవెలదితో మొదలుపెట్టి కందంలోకి దూకాను.....అందుకే మీకు ప్రత్యేకధన్యవాదాలు తెలిపాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇప్పటివరకూ ఎన్ని పద్యాలు రాశారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఇప్పటివరకూ 450 పైగా పద్యాలు రాసాను నాలుగు చందస్సులలో

*గోగులపాటి క్రిష్ణమోహన్*
పద్య కవిత్వానికీ వచన/భావ కవిత్వానికి మధ్య తేడా ఏముంది? ఎందులో కవి తన భావాన్ని సులభంగా వ్యక్తపరచగలడు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
పద్యమైనా వచనమైనా కవిత్వానికి భావమే ప్రాణము.
తన భావాన్ని కవి పద్యంలో అయినా వచనంలో అయినా పాఠకుల హృదయాన్ని తాకేలా చెప్పవచ్చును
కానీ పద్యాలకంటే కూడా వచనంలో ఎక్కువమంది పాఠకులను చేరే అవకాశం వుంది ఎందుకంటే
పద్యపాఠకులకంటే వచనపాఠకుల సంఖ్య నిస్సందేహంగా అధికం.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
అటు ఇంజనీరుగా బిజీఉంటూ... కవనాలు రాయడానికి మీకు సమయం సరిపోతుందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా ఉద్యోగ బాధ్యతలకు రోజూ 12 గంటల నుండి 14 గంటల సమయం పడుతుంది...సమస్యలు చాలా వున్నాయి.అయితే సహస్రకవి మిత్రులను మిస్ చేసుకోలేక రోజూ వీలయినప్పుడు ప్రయుతలో సహస్రవాణిలో పద్యాల సవ్వడిలో కవితలనాస్వాదించి స్పందించి నా కవితలను పోస్ట్ చేస్తున్నాను. కవితలు పద్యాలు రాసే సమయం చిక్కుటలేదు అందుకే నేను యు ఎస్ఏ లో రాసినంతగా కవితలు రాయలేక పోతున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ కవితలు / పద్యాలను సంపుటి రూపంలో వెలువరించే అవకాశం ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అవకాశం వుంది... అది నా కల

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ అభిరుచులు వివరిస్తారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అభిరుచులు:స్నేహం,పుస్తకపఠనం,తెలుగు పద్య,వచన కవితలు ,వ్యాసాలు కథలు,పాటలు
ఆంగ్లకవితలు చదువుట ,వ్రాయుట
తెలిసిన భాషలు:తెలుగు ఆంగ్లం హిందీ
ఆటలు:చెస్ లో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాను
క్రికెట్ క్రీడాకారుణ్ణికూడా
క్రికెట్ హాకీ టెన్నీస్ బాడ్మింటన్ ఇష్టపడతాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
తెలుగుకవిమిత్రుల
మోదాస్పదపదంగా
స్ఫూర్తిప్రదంగా మార్చుకున్న 
కవి అవేరా గారి  
కవితాభావాల
మేర  
ఆరా  
లోకమేరా సోదరా!!

అణువంతైనచీమ నోరే యైనా
విశ్వమంతా విహరిస్తున్న
కొత్తపోకిరీ పోకేమ్యానైనా
ఆయనకలపుటలం"కారపు"
విమర్శలసంకెళ్ళలంకెల్లోంచి
తప్పించుకోవటం అసాధ్యమే

చచ్చిపోతున్నపిచ్చుకల
ఆర్తనాదాల్ని 
అందుకుంటుందాయన కలంపౌనఃపున్యం
గుండెలోతుల్లోకాదు
*ఆత్మాంతరాధ్వనితాక్రోశాల్ని*
ఆకళింపుచేసుకుంటుందాయన
దృఙ్మానసనేత్రం
సమకాలీననైనందుకు గర్విస్తున్నా!!

🌹సందిత  బెంగుళూరు🌹

దీనిపై మీ అభిప్రాయం...


*అనుసూరి వేంకటేశ్వరరావు*
సంధిత చెల్లెమ్మ నాకందించిన ప్రశంసను మీరు భద్రపరచటం మీ సహృదయతకు నిదర్శనం 
నేనుకూడా భద్రపరచుకున్నాను....నిజంగా చిన్న వయసులోనే అద్భుత విద్వత్ కలిగిన రేపటి అద్భుత 
కవయిత్రిలు మనలో వున్నారు...సంధిత మరియు ధరణి అని నా అంచనా....ఇదే వేగంతో ఇద్దరూ అప్రతిహతంగా ముందుకుపోవాలని ఆశీర్వదిస్తున్నాను
నా కవితలకు స్పందించి నన్ను ప్రోత్సహిస్తున్న ఇద్దరికీ
కృతజ్ఞతలు 
అయితే సంధిత గారు చెప్పినట్టు కవి  దృష్టికి అడ్డు
అంతూ వుండదు పిపీలికమైనా పిచ్చుకైనా వానపాము అయినా కొత్తపోకడలపోకేమాన్అయినా సెల్ఫీలయినా
సమాజంలోని మంచినైనా చెడునైనా ప్రకృతినైనా
అందమైన ఆకృతినైనా అందమైన మనోభావాలనయినా అధ్యాత్మికమైనా...కవితకు కాదేదీ అనర్హం......శ్రీశ్రీ గారు  కుక్కపిల్ల అగ్గిపుల్ల ఇంకా ఏవైతే కవితకనర్హం కాదని  చెప్పారో....అన్నింటి పైనా నేను కవితలు రాసాను... నఖం పైన రాసినా మకం పైనరాసినా ముఖంపైన రాసినా సుఖంపైనరాసినా 
 దేనిమీదరాసినా కవి అక్షరసందేశం ఇవ్వాలి
సమాజంలో చెడును కుళ్ళును టార్గెట్ చెయ్యాలి
మంచి సందేశాన్ని జతచెయ్యాలి....ఒకోసారి 
కవిత ధార కోసం సందేశం సాద్యంకాదు
అలాంటప్పుడు సందేశాన్ని మరోకవితలో చెప్పవచ్చు


*గోగులపాటి క్రిష్ణమోహన్*
కవనరంగంలో మీ భవిష్యత్తు ప్రణాలికలేమైనా ఉన్నాయా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నేను ప్రొఫెషనల్ కవిని కాదు
భాషపై అభిమానంతో రాసుకుంటూ పోతున్నానుఅయినప్పటికీ 
ప్రణాలికలు వున్నాయి..
నా  రచనలన్నింటికి పుస్తక రూపం ఇవ్వాలి
పద్యరచనలో మళ్ళీ వేగం పెంచాలి
కనీసం ఐదుశతకాలను తెలుగు సాహిత్యానికి అందించాలనుకుంటున్నాను కష్టమే ఐనా
చిత్రరంగానికి పాటలు కథలు అందించాలనుకుంటున్నా
ప్రణాళికల వత్తిడిలో మాత్రం కవితలు రాయను.
2017 లో మొదటివిడతగా 3లేదా 4 పుస్తకాలను
ప్రచురించాలనుకుంటున్నా...


*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇక మన సహస్రకవుల కుటుంబసభ్యునిగా మీ అనుభూతులు మాతో పంచుకుంటారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
మన  సహస్రకవుల కుటుంబసభ్యునిగా నేనుపొందిన అనుభూతిని ఇంతకుముందే తెలియజేశాను...కవిగా
నా విజయాలన్నింటికి నా సహ సహస్రకవిమిత్రుల ప్రోత్సాహమే స్ఫూర్తి...అందరికీ కృతజ్ఞతలు.


*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీకు ఈ రంగంలో స్పూర్తి ఎవరు? ఎవరు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
తెలుగు భాషకు నేనుసైతం అక్షరయజ్ఞం చేయలన్న ఆశయమే నా స్ఫూర్తి .చరిత్రలో మనమద్యలో ఎందరో మహాకవులున్నారు..ఒకరి స్ఫూర్తితో గీతగీసుకోలేను అంతటి పెద్దలపేర్లను స్ఫూర్తిగా
చెప్పటానికి ధైర్యం చాలదు నాకు....

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఎవరి సాహిత్యాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అధునిక కవుల సాహిత్యాన్ని ఇష్టపడతాను
చలంగారు శ్రీశ్రీ గారు దాశరథిగారూ కృష్ణశాస్త్రి గారూ
వేటూరిగారూ సినారె గారూ సిరివెన్నెల గారూ సుద్దాలగారూ గోరెటివెంకన్నగారూ.....ఎవరి శైలివారిది
నవలలు మాత్రం యండమూరిగారిశైలి నచ్చుతుంది
ఇంకాచాలామందివున్నారు...సినిమాబాగుంటే
ఏమీచూడకూడదు సినిమానేచూడాలి
కవిత్వం బాగుంటే కవిత్వాన్నే ఆస్వాదించాలి
ఎవరురాసారో అన్నది ఆస్వాదించాక తెలుసుకోవాలి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇక కవిగా మీరు సాధించిన అవార్డులు/పురస్కారాల గురించి వివరించండి.

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నేను మొదటగా మన సహస్రకవుల నిర్వాహకులు
తెలుగుకవితావైభవంఅద్యక్షులు మేకరవీంద్రగారి 
ద్వారా "సహస్రకవిమిత్ర"సహస్రకవిరత్న"బిరుదులు
పొందటం జరిగింది ఆతరువాత "గురజాడఫౌండేషన్
పురస్కారం"పొందటం జరిగింది.తెలుగురక్షణవేదిక
"బతుకమ్మ పురస్కారం"తో సన్మానించారు.
అన్నింటినీ మించిన సన్మానం,పురస్కారం "మీ అందరి అభిమానం పొందటం"

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మొత్తంగా మీ కవిప్రయాణం ఏ విధంగా సాగుతుంది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఇప్పటి వరకూ నా కవిప్రయాణం బాగానేసాగింది ప్రస్తుతం సమయాభావం వత్తిడిలో నలిగిపోతున్నా
ఇప్పుడేనాఅసలుప్రయాణంమొదలవుతుందనిపిస్తుంది
ఈ  సంవత్సరం కొత్తమలుపులుంటాయేమో ప్రయాణంలో.


*గోగులపాటి క్రిష్ణమోహన్*
సహస్రకవి కి ముందు తరువాత తేడా ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
వుంది...సహస్రకవికి ముందు కలంతో కాగితంపైన రాసుకున్నా
సహస్రకవినైనాక కీబోర్డుతో సెల్ లో రాస్తున్నా.

సహస్రకవికిముందు కుందేలంత వుండేది  సహస్రకవినైనాక ఆత్మవిశ్వాసం కొండంతైంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
తెలుగుబాష బతుకాలంటే మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
పాఠశాలలో బాలలకు తెలుగుపై మక్కువ పెంచాలి
పాఠ్యపుస్తకాలతో పాటు బొమ్మల తో తెలుగు కథలు
చక్కని తెలుగుపాటలు నేర్పాలి అక్షరాలను పదాలను
చదవటం చదివించటం సరిపోదు వల్లెవేయించాలి
చక్కటి ఉచ్ఛారణనేర్పాలి సాధారణంగా సైన్స్ మాథ్స్
పట్లఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అదిసరికాదు భాషా విషయాలకు కూడా శ్రద్ధ కనపరచాలి
పైవిధంగా చేయలేకపోవటం చేత నేడు మన చుట్టూ
చదువుకున్న పిల్లలు తెలుగును ధారాళంగా చదువలేకున్నారు.
గ్రంధాలయాలు పునరుద్ధరింపబడాలి 
పుస్తకపఠనం హాబీగా మారాలి యువతలో
సెల్ఫోను వాడకం లాభంలేనిచాటింగులు తగ్గించుకోవాలి నేటి యువత ఆసమయాన్ని
తెలుగుపుస్తకాలు చదవటానికి ఉపయోగించుకోవచ్చు
తెలుగు కవులకు ప్రభుత్వాలు సమాజం మంచిగుర్తింపును హోదాను ప్రకటించాలి
మీడియాద్వారా తెలుగు భాషోద్దరణకు పూనుకోవాలి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
రేపటి తరం తెలుగుసాహిత్యాభిలాషులు కావాలంటే ఏంచేయాలి? యువకవులకు మీరిచ్చే సలహా సూచనలేంటి?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
యువతరంలో తెలుగు సాహిత్యాభిలాష పెరగాలంటే
ఇందాక నేను చెప్పినట్లు బాల్యదశలోనే భాషపట్ల మక్కువ కలిగేలా శిక్షణనివ్వాలి
యువకవులకు సూచనలు:
1.మీకుతోచిందిరాయండి
2.మీకునచ్చినట్లు రాయండి
3.అవగాహన లేకుంటే ఆత్మవిశ్వాసం లేదు
4.ఆత్మవిశ్వాసంలేని రాత గ్రహణకాలంలోని సూర్యుడిలా వెలుగునివ్వలేదు
5ఆత్మవిశ్వాసం కలగాలంటే రాసే విషయాన్ని పరిశీలించండి పరిశోధించండి లోతుల్లోకి వెళ్ళండి
6.అనుకరించకండి అనుసరించకండి
7.మీదైనశైలిలోరాయండి
8.మంచి పుస్తకాలను చదవండి విశ్లేషించండి
9.పద్యం వచనం రెండూ రాయండి పద్యధార 
వచనంలో వచన బాష(సరళం)పద్యంలోకి వస్తే
ప్రజలు పద్యాలను కూడా ఇష్టంగా చదువుతారు
10.మంచిపుస్తకాలను కవితలను ఒకటికి రెండుసార్లు 
చదవండి కొంతమందికవులు లోతైన అర్థాలతోరాస్తారు
అవికూడా అర్థంఅవుతాయి.

ఇవేయువకవులకు నా 10కమాండ్ మెంట్స్.

నేటి సమాజంలో వస్త్రాపహరణంలో ద్రౌపదిలాఎన్నో సమస్యలు అర్తనాధంచేస్తున్నాయ్ మానాభిమానాలు కాపాడమని వాటికి అందించే చీరెలా కవి కవిత వుండాలి
నేటిసమాజం గజేంద్రమోక్షంలో గజేంద్రునిలా చెడుఅనే మొసలి నోటచిక్కి విలవిలలాడుతుంది ఈసమాజాన్ని కాపాడే సుదర్శనం కావాలి కవి కవిత
కవి సమాజాన్ని సంస్కరించాలి సంరక్షంచాలి చెడునిశిక్షించాలి అని చెప్పటమే నా ఉద్దేశ్యం

*గోగులపాటి క్రిష్ణమోహన్*
సహస్రకవులతో మీ అభిప్రాయం పంచుకునేముందు అయిత/ప్రయిత కవితా యజ్ఙం పై మీ అభిప్రాయం?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అయుతలో కవితల టార్గెట్ల కోసం సమయం కేటాయించి కవితలు రాసారందరూ 
యజ్ఞంలో అందరూ పాల్గొని విజయవంతంచేశారు
నా కవితలకు కూడా అయుతకవితాయజ్ఞం స్ఫూర్తిని నింపింది....మంచి ప్రయత్నం రవీంద్రగారికి అభినందనలు
ప్రయుతకు తేదీ డెడ్లైన్ లేనట్లుంది అందుకే కొందరుకవులు కవితలుపద్యాలు పోస్ట్ చెయ్యట్లేదు
వచనాలలో లక్ష్మణ్ రావు గారు విజయదుర్గ(వినీల)
నేను దండ్రెరాజమౌళిగారు మాత్రమే పోస్ట్ చేస్తున్నాము
అలాగే పద్యాలు కూడా కొందరు కవులు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు.రవీంద్రగారు ప్రయుతకు బూస్టింగ్ డోస్ ఇవ్వవలసియున్నదనిపిస్తుంది...
ఏదేమైనా కవితా యజ్ఞాలు అద్భుతఫలితాలనూ ఫలాలనూ అందించాయి..ముఖ్యంగా ఎందరో కవులను సహస్ర కవుల గ్రూపులో చేర్చి తెలుగుభాషాభివృద్ధికి తోడ్పడ్డాయి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ధన్యవాదాలు అవేరా గారూ....
మీ అమూల్యమైన సమయాన్ని మా సహస్రకవులకోసం వెచ్చించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు.

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అది నా భాగ్యంగా భావిస్తున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ లాంటి బహుముఖ ప్రజ్ఙాశాలిని నా సహస్రకవిమిత్రులకు పరిచయం చేసే భాగ్యం కలిగించిన సమూహ సూత్రధారి శ్రీ మేకరవీంద్ర గారికి, మీకు మరియు మన పరిచయాన్ని శ్రద్దగా ఆసక్తితో చదివిన మన కవిమిత్రులందరికి నా హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తూ.... సెలవు తీసుకుంటున్నాను....

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా ఆశలకు మీ ఆశయానికి 
ఆచదువుల తల్లి ఆశీస్సులుండాలని ప్రార్థిస్తూ....
ఈకార్యక్రమ రూపశిల్పి మేకరవీంద్ర గారికీ ధన్యవాదాలు....అలాగే
మీ విలువైన సమయం నాతో పంచుకున్నందుకు
ధన్యవాదాలు...నా పరిచయ కార్యక్రమాన్ని
తమ విలువైన సమయం కేటాయించి చదివిన మన కవిమిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు🙏🙏


*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఈ సందర్భంగా మీరు కవనరంగంలో మరెన్నో విజయాలను సాధించి అత్యున్నత శిఖరాలను అఅధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు 
🌺🙏🏽🌺

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ధన్యవాదాలు

ఇట్లు
*మేక రవీంద్ర*
సహస్ర కవిరత్న అనుసూరి వేంకటేశ్వరరావు పరిచయం కార్యక్రమంలో పాల్గొని చాలా వివరాలు తెలిపినందుకు

సహస్ర ప్రయోక్త,  సహస్ర కవిరత్న Sk326 గోగులపాటి క్రిష్ణమోహన్ గారికి చక్కటి ప్రశ్నలను వేసి ఈ పరిచయకార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు.

ఈ పరిచయాన్ని పూర్తిగా చదివిన వారందరికి
ధన్యవాదాలు

😊 🙏🏼🙏🏼
*మేక రవీంద్ర*

Friday, December 2, 2016

నీకేం తెలుసు?

గోగులపాటి కృష్ణమోహన్
స. క. సంఖ్య 326

నీకేం తెలుసు?

నీకేం తెలుసు? కష్టం.... నష్టం అంటే?
కష్టపడ్డవాడిని... నష్టపోయినవాడిని
అడుగు ....
కష్టనష్టాలు అంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు? కష్టం అంటే?
నిలువెత్తు గొయ్యలో.... మొరంగడ్డను గడ్డపారతో పెకిలిస్తూ... పారతో తట్టనిండానింపి... రెండుచేతులతో నిటారుగా పైకిలేపి గడ్డమీద పోసే దినసరి కూలీని అడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు? నష్టం అంటే ?
వ్యయసాయంకోసం అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టపడ్డా.... చేతికొచ్చిన పంట ఇంటికి రాని రైతన్నను అడుగు....
నష్టమంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు? బరువుమోసేవాడిబాదేంటో?
గోదాముల్లో వందకిలోల సంచిని బుజంపై పెట్టుకొని లారీల్లో లోడుచేసే హమాలీని అడుగు....
బరువుమోస్తే బాదేంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
బక్కచిక్కిన ప్రాణంతో బతుకుబండి ఈడ్చడానికి రిక్షానిండాబరువేసుకొని తోసుకుంటూ గడ్డెక్కించే రిక్షావాడిని అడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
దినసరి అప్పులుదెచ్చి రోజువారి దందాచేసుకుంటూ.... రాత్రివరకూ సరుకులు అమ్ముడుకాకుండా... అప్పులోడికి అసలు కూడా కట్టలేని అబాగ్యున్ని అడుగు....
నష్టమంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
రైల్వే స్టేషన్లో.... బస్సు స్టేషన్లలో నెత్తిమీద స్థాయికి మించి బరువులు పెట్టుకొని మెట్లెక్కే కూలీలను అడుగు.....
బరువంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
మనం అసహ్యించుకునే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో తలలోతు మునిగి మురుగుకాలువలను శుబ్రం చేసే పనివాడినడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
ఆస్తులమ్ముకొని వ్యాపారం చేసి....
ఆగమై అడుక్కుతింటున్న అమాయకుణ్ణి అడుగు...
నష్టమంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు? బతుకు భారమంటే...
ఒంటి జీతంతో జీవితం నడుపుతూ...
తల్లిదండ్రులకు వైద్యఖర్చులు...
పిల్లలకు ఫీజులు.... ఆడపిల్లలకు అల్లుళ్ళకు మర్యాదలు చేస్తూ అప్పుల ఊబీలో పడుతున్న మద్యతరగతి వాడినడుగు....
బతుకు బారమంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
గరీబోడి కష్టం.... అమీరోనికి....

నీకేం తెలుసు?
గుడిసెవాడి కష్టం.... బంగులోడికి

నీకేం తెలుసు?
బాలకార్మికుని బాధ....

నీకేం తెలుసు?
అర్ధాకలితో అలమటిస్తున్నవాడి బాధ...

నీకేం తెలుసు?
బిడ్డలకోసం కన్నతల్లి పడే వేదన

నీకేం తెలుసు?
నీ కోసం నీ అంతరాత్మ పడే ఆవేదన....

నీకేం తెలుసు....?
నీకేం తెలుసు...?

కష్ట నష్టాలనే ఇష్టాలుగా....
బరువులు భారాలనే భాద్యతలుగా....
అలవాటు చేసుకొని....
హాయిగా జీవిస్తున్న...
అభాగ్యుల జీవితాల గాధలు....
నీకేం తెలుసు?.... నీకేం తెలుసు?


మీ

(సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, శతపధ్యకంఠీరవ, తెలుగు రక్షణవేదిక జాతీయ బతుకమ్మ పురస్కార గ్రహీత...)

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653
సూరారం కాలని, హైదరాబాదు.

Sunday, November 6, 2016

అవసరం...

గోగులపాటి కృష్ణమోహన్

శీర్షిక: అవసరం...

అవసరం...
మనిషిని దిగదారుస్తుంది.
అవసరం...
వసుదేవున్నే గాడదికాళ్ళు పట్టించింది.
అవసరం...
ఆస్తులు అమ్మిస్తుంది.
అవసరం...
మనిషిని ఎక్కడికో నడిపిస్తుంది.
అవసరం...
మనిషిని చేయరాని పనులు చేయిస్తుంది.
అవసరం...
అడ్డదారులు తొక్కిస్తుంది.
అవసరం...
నిజాయతీ పరున్ని అబద్దాలు ఆడిస్తుంది.
అవసరం...
అడ్డమైన చాకిరీ చేయిస్తుంది.
అవసరం...
ఎవరెన్ని మాటలన్నా పడమంటుంది.
అవసరం...
నేరాలు చేయిస్తుంది.
అవసరం...
అమాయకుణ్ణి హంతకుడిగా మారుస్తుంది.
అవసరం...
అభిమానాన్ని చంపేస్తుంది.
అవసరం...
అన్యాయాన్ని ఎదిరిస్తుంది.
అవసరం...
అందలం ఎక్కిస్తుంది.
అవసరం...
మనిషిని అప్పుల పాలుజేస్తుంది.
అవసరం...
మనిషికి ప్రాణాంతకమై కూర్చుంటుంది.
అవసరం...
తనవారిని దూరం చేస్తుంది.
అవసరం...
అవతలివాడి అవసరాలను తీరుస్తుంది.


మీ
సహస్రకవిమిత్ర
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు.
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Tuesday, November 1, 2016

నా నానోలు... నా ఇష్టం..... గోగులపాటి కృష్ణమోహన్

నానోలు

నా
నానోలు
నా
యిష్టం.... గోగులపాటి కృష్ణమోహన్

1)
విఘ్నాలు
తొలగించ
విఘ్నేషుని
పూజించు

2)
మాతృమూర్తి
మాతృభూమి
మాతృభాష
చాలాగొప్పవి

3)
చెబితే
విననివాడు
చెడిపోక
మానడు

4)
వైఫ్
లేకున్నా...
వైఫై
ఉంటేచాలు

5)
తినకముందు
ఫలం
తిన్నాక
మలం

6)
వ్యక్తుల
కన్నా
వస్తువులే
మిన్ననేడు

7)
పదవున్నప్పుడే
పదివెనుకేసుకో
పదవిపోయాక
పనుండదునీతో

8)
ఇళ్ళుకట్టిచూడు
పెళ్ళిజేసిచూడు
జూదమాడిచూడు
అప్పుచేయకుండ

9)
సముద్రమైనా
ఈదవచ్చట
సంసారం
కష్టమట

10)
నవ్వు
యోగమట
నవ్వకపోవడం
రోగమట

11)
బార్యను
ఒప్పించైనా
అమ్మను
ప్రేమించు

12)
ధనము
కన్నా
తెలివి
మిన్న

13)
ఎవరినీ
అతిగా
నమ్మి
మోసపోకు

14)
ప్రేమించు
జయించు
విజయం
సాధించు

15)
ఇళ్ళు
ఇల్లాలు
ఇతరులతో
పోల్చొద్దు

16)
సుఖం
సంతోషం
ఒకటి
కాదు

17)
సుఖం
శారీరకం
సంతోషం
మానసికం

18)
కష్టపడగా
వచ్చింది
కడదాకా
ఉంటుంది

19)
ఇష్టమైన
పని
కష్ట
మవ్వదు

20)
మద్యం
సేవించి
వాహనం
నడపకు

21)
శృంగారం
గదిలో
అనురాగం
ఎదలో

22)
ప్రేమకు
హద్దు
పెళ్లి
ముద్దు

23)
కోపాలు
వద్దు
ప్రేమలే
ముద్దు

24)
సరిహద్దున
శబ్ధం
సైనికునికి
అలారం

25)
ప్రేమలూ
ఆప్యాయతలూ
అనురాగాలే
కుటుంబం

26)
గతం
వర్తమానం
భవిష్యత్తు
జీవితం

27)
వేషం
నటన
వాస్తవం
జీవితం

28)
అప్పు
ఇవ్వకు
అరువు
అడుగకు

29)
నుదుట
సింధూరం
స్త్రీకి
సింగారం

30)
చేనుకు
చెదలు
రైతుకు
దిగులు

అయ్యప్ప భక్తులకు
31)
మాల
ధారణ
మహిమ
అధ్భుతం

32)
మండల
దీక్ష
స్వామి
నియమం

33)
ఏక
భుక్తం
ఒంటికి
మంచిది

34)
పాద
రక్షలు
లేకే
పయనం

35)
భూతల
శయనం
శీతల
స్నానం

36)
మద్యం
మగువ
మాంసం
దూరం

37)
అందరి
లోను
స్వామి
దర్శనం

38)
మహిళలు
అంతా
మాతృ
సమానం

39)
పంపా
స్నానం
పరమ
పవిత్రం

40)
ఇరుముడి
అర్పణ
దీక్ష
విరమణ

బతుకమ్మ పురస్కారం




జాతీయ తెలుగు కవుల సమ్మేళనం లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు బతుకమ్మ పురస్కారం


 "సహస్రకవిమిత్ర" గోగులపాటి కృష్ణమోహన్ తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  నిర్వహించిన "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" లో పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం తెలిపే కవిత చదివి బతుకమ్మ కవితోత్సవం మరియు పురస్కారాన్ని అందుకున్నారు.

అక్టోబర్ 23, 2016 ఆదివారం నాడు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్ లో
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగిన ఈ జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో దేశం నలుమూలల నుండి నవ,యువ,మహా కవులు రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొని  బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా, మన  సంస్కృతి సంప్రదాయాల గురించి మరియు తెలుగు భాష, యాస, వ్యవహారికాలకు సంబంధించిన కవితలు, గేయాలు, జానపదాలు తదితర రచనలను కవులు తమ కవనాల ద్వారా తెలియజేశారు.

ఈ సంధర్భంగా పాల్గొన్న కవులందరిని నిర్వాహకులు శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ సమాజంలో అన్ని అంశాలపై స్పందించే వారు కవులని, నేటి తరం కూడా సాహిత్యం పై మక్కువ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ,    తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు మహేందర్,  పలువురు కవులు పాల్గొన్నారు.



Sunday, October 30, 2016

ఓ యువతా మేలుకో



గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.

శీర్షిక : యువత - భవిత

ఓయువతా మేలుకో
నీ భవిత తెలుసుకో.... (2)

మన తండ్రులు, మన తాతలు
ప్రాణాలకు తెగించారు.... (2)
పోరాటం  చేశారు..
స్వాతంత్ర్యం తెచ్చారు.... ఓ యువతాII

తెల్లదొరలు వెళ్ళినారు...
నల్ల దొరలు వచ్చినారు...(2)
రాజులంత సచ్చినారు...
రౌడీలు బతికినారు.... ఓ యువతాII

బూములు ఖబ్జాలు జేస్తు
భవంతులే నిర్మిస్తూ... (2)
పేదొడి పొట్టగొట్టి
పొలిమెర దాటిస్తుండ్రు... ఓ యువతాIl

కాంట్రాక్టుల పేరుతోటి
కోట్లు కొల్లగొడుతుండ్రు... (2)
నాణ్యతలే లేకుండా
కట్టడాలు కడుతుండ్రు.... ఓ యువతll

కల్తీ సొమ్ములు జేస్తూ
ఖార్ఖానాల్ నడుపుతుండ్రు (2)
కల్తీ నోట్లు అమ్ముతు
కోట్లకు పడిగెడుతుండ్రు.... ఓ యువతll

యువత నేడు నిద్దురతొ
మొద్దుబారి పోయింది... (2)
సోపతి ఎక్కువయ్యింది
సోమరిలా అయ్యింది.... ఓ యువతాll

మద్యమంటు... మగువంటూ
మానవత్వమే మరిచి... (2)
పబ్బులెంట, పార్కులెంట
పరుగెడుతూ వెలుతుంది... ఓ యువతll

రాజకీయ రాక్షసేమో
జనులపీక కోస్తుంటే... (2)
పదవీ వ్యామోహాలు..
పట్టపగలె దోచుకుంటే... ఓ యువతాll

నీ తండ్రుల, నీతాతల
పౌరుషాన్ని దెచ్చుకోరా.. (2)
అన్యాయం ఎదురించు
అక్రమాన్ని తరిమికొట్టు... ఓ యువతll

కల్తీలను నివారించు
నిజాయితీ నిలబెట్టు.. (2)
ఖబ్జాలను కాపాడు...
పేదోడికి అండగుండు... ఓ యువతll

అమరుల ఆశయాలు
నెరవేర్చే వీరుడవై...(2)
వీర జవానులకు నీవు
వారసుడవై నిలిచిపో... ఓ యువతాll

ఓ యువతా మేలుకో
నీ భవిత మార్చుకో...(2)
నీ భాద్యత తెలుసుకో...
భాద్యతెరిగి మలుసుకో.... ఓ యువతll

యువతకు అంకితమిస్తూ....

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653

Tuesday, October 25, 2016

నెట్టమ్మా... నెట్టమ్మా...


గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు

శీర్షిక : నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా....


నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా మమ్మువిడిచి పోవమ్నా...

నువ్వుంటే మా వారు కంప్యూటర్ వదలరు
నువ్వుంటే మా పిల్లలు ల్యాప్టాప్ వదలరు.
నువ్వుంటే జనమంతా సెల్లు లోనె సొల్లంతా...
నువ్వుంటే నేనుకూడా ఇల్లుమరిచి పోతుంటా...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా మమ్మువిడిచి పోవమ్నా...

ఫేసుబుక్కు తెరుచుకుంటు....
లైకులెన్నొ చూసుకుంటూ....
వాట్సప్పు ను చూసుకొంటు...
పోస్టులన్ని చదువుకుంటూ...
ఐ ఎం ఓ, స్కైప్‌లతో....
వీడియోలు మాట్లాడుతు...
పనిపాట వదులుకుంటు...
రోజంతా గడుపుడాయె...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

మిస్సైన సీరియల్లు....
కావాల్సిన వంటవార్పు....
పాతకొత్త సినిమాలు...
పనికిరాని ప్రోగ్రాంలు ...
చదువు సంద్య పాఠాలు....
సంగీత, నాట్యాలు..
యూ ట్యూబులొ చూసుకుంటు...
రోజంతా గడుపుడాయె...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

ఇంటికొచ్చినోళ్ళంతా బాగోగులు మరిచిండ్రు...
రాగానే వైఫైది పాసువర్డు అడుగుతుండ్రు...
ఇంట్లోనే అందరున్న ఆదమరిచి ఉంటుండ్రు
నెట్టు ఆన్ చేసుకొంటు సెల్లుతోనె గడుపుతుండ్రు...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

ఒక్కరోజు లేకుంటే....
అందరు కలిసుంటారు...
మనసువిప్పి ఒకరినొకరు
మాట్లాడుకుంటారు...
ఇంటిలోన బాదలను
అడిగితెలుసు కుంటారు
ఇంటిల్లిపాదంతా...
హాయిగా గడుపుతారు....

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653