Tuesday, December 30, 2025

మత్తు వదలరా!! (మత్తుకు బానిసవుతున్న యువకుని కథ, అధ్యాయం – 1 రచన : గోగులపాటి కృష్ణమోహన్

 **మత్తు వదలరా!!**
*(మత్తుకు బానిసవుతున్న యువకుని కథ)*

అధ్యాయం – 1

రచన : గోగులపాటి కృష్ణమోహన్


 

**చిరంజీవి : ఒక మధ్యతరగతి తండ్రి**

చిరంజీవి జీవితం గడియారం లాంటిది.

సమయం తప్పదు… క్రమం తప్పదు.

ఉదయం ఐదు గంటలకి కళ్లుతెరుస్తాడు.

అలారం మోగకముందే లేచే అలవాటు.

చీకట్లోనే పూజగదిలోకి వెళ్లి దీపం వెలిగిస్తాడు.

దీపం మిణుగురులో అతని జీవితం కనిపిస్తుంది.

నిశ్శబ్దం… క్రమశిక్షణ… బాధ్యత.

ఆ తర్వాత పేపర్.

తర్వాత చాయ్.

చాయ్ కప్పు చేతిలోకి రాగానే

అతని చూపు సహజంగా ఒక దిశగా వెళ్తుంది —

**వేణు గది వైపు.**

రోజూ ఒక్కసారి కాదు…

రెండు సార్లు కాదు…

ఎన్నిసార్లైనా ఆగిపోతాడు అక్కడ.

> *“నా కొడుకు…”*

> *“నా కలలన్నీ వాడి భవిష్యత్తులోనే.”*

ఇల్లు చిన్నదే.

పెద్ద హాల్ లేదు…

ఖరీదైన ఫర్నిచర్ లేదు…

కానీ ఆ ఇంట్లో ఒక గౌరవం ఉంది.

తండ్రి శ్రమతో నిలబెట్టిన గౌరవం.

వేణు చదువు కోసం

చిరంజీవి ఎన్నో కోరికలు చంపుకున్నాడు.

కొత్త బట్టలు కాదు…

కొత్త చెప్పులు కాదు…

*“పిల్లాడికి ఫీజు ముందే కట్టాలి”*

అదే అతని జీవిత తత్వం.

ఎన్నో అవసరాలు

“తర్వాత చూద్దాం” అని వాయిదా వేసుకున్నాడు.

అలాంటి ఆ రోజు మాత్రం…

వేణు లేచే తీరులో

ఏదో తేడా కనిపించింది.

కళ్లలో నిద్ర కాదు…

మత్తు అలసట.

చిరంజీవి మనసు ఒక్కసారిగా కుదుటపడలేదు.

తండ్రి అనుభవం అలా ఉంటుంది.

చూస్తే సరిపోతుంది…

అర్థమైపోతుంది.

చిరంజీవి దగ్గరికి వెళ్లాడు.


> **“వేణూ…”**

> గొంతు మృదువుగా ఉంది.

> ఆజ్ఞ లేదు…

> ఆగ్రహం లేదు…

> కేవలం భయం మాత్రమే.

> **“మేము కష్టపడుతున్నది

> నీకు భారంగా అనిపిస్తే చెప్పు నాన్నా…”**

కొంచెం ఆగి,

గొంతు ఇంకా నెమ్మదించింది.

> **“కానీ తప్పు దారిలో మాత్రం పోకు.

> జీవితంలో మళ్లీ మళ్లీ లేవచ్చు…

> కానీ అలవాట్లు పడితే లేవడం కష్టం.”**

వేణు తండ్రిని చూసి నవ్వాడు.

ఆ నవ్వులో గౌరవం లేదు…

వినయం లేదు…

అది తప్పించుకునే నవ్వు.

అది నిర్లక్ష్యపు నవ్వు.

ఆ నవ్వే

చిరంజీవిని భయపెట్టింది.

*“నా కొడుకు దూరమవుతున్నాడా?”*

అనే ప్రశ్న

అతని హృదయంలో మౌనంగా మొలిచింది.


---  మిగితా కథ కోసం పార్ట్ 2 చదవండి


లోకా సమస్తా సుఖినోభవంతు


**మీ గోగులపాటి కృష్ణమోహన్**

సూరారం కాలనీ, హైదరాబాద్

📞 9700007653



---


Monday, April 13, 2020

విధి వంచిత (పద్య రూపము)

విధి వంచిత (పద్య రూపము)
రచన: గోగులపాటి కృష్ణమోహన్


విధి వంచిత
(పద్య రూపము)

తనపెనిమిటితోనె తాసుఖమొందగ
తలచుకొను మగువ తనివి తీర

తానొకటి తలిచె దైవమొకటి దల్చు
తల్లిదండ్రి కనక తల్లడిల్లు

తిండిలేక నొకరు, తిండరుగకొకరు
తోడులేక నొకరు తొండి కొకరు

అవసరమున కొక్క రానందమని యొక్క
రాసరాకని యొక్క  రాస్తికొకరు

పడుపు వృత్తి లోన పడదురు పడతులు
బాధలెన్నొ తాము పడుచు నెపుడు
సుఖముదేవుడెరుగు ముఖము మాయముకాగ
సఖుడు దెలియడాయె సంతసంబు

అద్దె నవ్వు తోడ నలరించు నొకచోట
మనసు లోన బాధ కనగ రాక
సుఖము లోన దుఃఖ సూత్రము దాచుచు
నఖము కాటునందు ముఖము దాచు

వనిత కాదు తాను వ్యభిచార కాంతగా
చెప్పులోకమందు చెడుగనెపుడు
ముప్పు జీవితాన నెప్పడో తెలిసినా
నిప్పు కొంగు దాచి గుట్టు విడదు.

సుఖము మాట కాదు సుందరమే లేక
అందమంత వైరి చందమగును
కందినట్టి బ్రతుకు గండమారోగ్యము
చెడిన జీవితాన చెదలువారె

దమ్ము కొట్టి ఒకడు.... దంచితాగియొకడు
కంపు కొట్టు నొకడు కాట్లుబెట్టు
బుద్దిలేక నొకడు బూట్లతో తన్నుచు
బండ బూతులాడి బాధ పెట్టు

చేరి జీవిత మంతయు చేటుగూర్చి
వనిత బతుకువేటు నెపుడు బడుచునుండు
సుఖము గాదది జెప్పగ నఖపు కాటు
శాప వశముచే బ్రతుకును సాగదీసె.

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 🌹
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653

Wednesday, November 6, 2019

అమ్మంటే...

అమ్మంటే...

(ఈ రోజు (కార్తీక శుద్ద దశమి) మా అమ్మ తిథి సందర్భంగా... )

రచన గోగులపాటి కృష్ణమోహన్

అమ్మంటే ఆత్మీయత
అమ్మంటే అనురాగం
అమ్మంటే మమకారం
అమ్మంటే అభిమానం
అమ్మంటే అపురూపం
అమ్మంటే అంబరం
అమ్మంటే ఆకర్షణ
అమ్మంటే ఆలంబన
అమ్మంటే మురిపెం
అమ్మంటే అమృతం
అమ్మంటే అక్షయం
అమ్మంటే సంతోషం
అమ్మంటే వాత్సల్యం
అమ్మంటే ఆదరణ
అమ్మంటే ఆలన
అమ్మంటే పాలన
అమ్మంటే లాలన
అమ్మంటే ఓరిమి
అమ్మంటే కూరిమి ,
అమ్మంటే ఓర్పు
అమ్మంటే నేర్పు
అమ్మంటే కూర్పు
అమ్మంటే ఓదార్పు
అమ్మంటే క్షమ
అమ్మంటే దయ
అమ్మంటే అంబుది
అమ్మంటే పెన్నిధి
అమ్మంటే కరుణ
అమ్మంటే నిత్య స్మరణ
అమ్మంటే పరిపూర్ణం
అమ్మంటే నిండుదనం
అమ్మంటే మెండుదనం
అమ్మంటే అద్భుతం...
అమ్మంటే ఆదిదైవం
అమ్మంటే అనిర్వచనం
అందుకే...
అమ్మంటే ప్రేమ...

అమ్మలందిరికీ
ప్రేమతో అంకితం

గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653

Tuesday, March 12, 2019

వీర సైనికా వందనం

వీర సైనికా వందనం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

వీరసైనికా నీకు వందనం
దేశ రక్షకా పాదాభివందనం ll2ll

అమ్మానాన్నలనొదిలి -
భార్యాబిడ్డలనొదిలి... ll2ll
దేశరక్షణ కొరకు
దేహాన్నే అర్పించే... ll వీర ll

ఎండనకా... వాననకా...
చలియనకా... భయమనకా... ll2ll
శతృమూకలతోటి
చిత్తుగ పోరాడేటి ll వీర ll

తీవ్రవాద దాడులతో...
ముష్కరుల ముప్పేటుతో.. ll2ll
అవయవాలు కోల్పోయి...
అవస్థలు పడుతున్నా... ll వీర ll

ఏసీలో కూర్చుంటూ...
దేశాన్నే అమ్ముకుంటూ... ll2ll
రాజకీయ రాబందుల
రాక్షస క్రీడలు చూస్తూ... ll వీర ll

నెలజీతము కొరకు నీవు
నేలతల్లి ఋణము దీర్చ... ll2ll
ప్రాణాలనె ఫణము బెట్ట
పయనిస్తివ శతృవైపు... ll వీర ll

యువతకు స్పూర్తివి నీవే
భవితకు బాద్షా నీవే... ll2ll
మరువబోము నీ తెగువ
మరణించక తిరిగిరా... ll వీర ll

వీరసైనికులకు వందనాలతో...
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు.
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Friday, March 1, 2019

పెళ్ళికూతురు సాగనంపు పాట

పెళ్ళికూతురికి సాగనంపు పాట
రచన్ గోగులపాటి కృష్ణమోహన్

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...

పచ్చని పందిట్లో పరిణయమాడగా
ముక్కోటి దేవతలు దీవెనలె ఇవ్వగా

అక్షింతలే మీకు అయుష్షుగానూ...
అతిధి దేవుళ్ళంత ఆశీర్వదించగా

దీర్ఘ సుమంగళై వర్ధిల్లవమ్మా...
అందుకో అందరి ఆశీస్సులమ్మా

అమ్మ మాటలు నీవు ఆచరించమ్మా
నాన్న చెప్పిన నీతి మరువబోకమ్మా

అత్తాడపడుచుల అవహేళనలను
పెద్దమనసుతోటి ఆదరించమ్మా

ఇరుగుపొరుగు మాట జోరీగలాగా
వినకుండ ఉంటేనే వేవేల మేలు

కనుదాటనీకమ్మ కన్నీరునెపుడూ
చిరునవ్వె వెలుగాలి నీమొహమునందు

మెట్టింటి గౌరవం కాపాడవమ్మా
పుట్టింటి పరువును పోగొట్టకమ్మా

మగని వద్ద నీవు మురిపెంగ ఉంటూ
మగని గుండె లోన గుడిగట్టుకోమ్మా

అనుమానమన్నది దరిజేరనీకూ...
నీ నమ్మకమే నీకు శ్రీరమరక్షా....

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...


గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Friday, May 25, 2018

కృష్ణ శతకము (కందపద్యాలు)

తేది : 24 జనవరి 2016
1)
తనుమనమున నీనామము
అనుదినమునునేను దలతు నయ్యా సాయీ!
కనికరమును జూపుమెపుడు
ఘననవ్యజ్యోతి కాంతి కందము కృష్ణా!

2.
సాయేకద రక్ష మనకు
సాయేకద సర్వజనుల సకలంబగునా
సాయే తలచిన బ్రోచును
సాయేమరి భక్తజనుల సర్వము కృష్ణా

3)
రమణుని శిష్యుండీతడు
కమనీయపదాలనల్లి కవితలు వ్రాసెన్
రమణన్ వీరారెడ్డియె
కమనీయముగా రచించె కవితలు వీరా

4.
వీరా గణితాన విదుడు
వీరా నేర్పున రచించి వీరా శతకం
బౌరా యనిపించెకదా!
వీరా ఘనగణితశాస్త్ర విజ్ఞుడు   కృష్ణా!

5
వ్రాయాలని యుంది కవిత
తీయాలని యుంది నాకు తీయని  గ్రంధాల్
చేయాలనుంది రచనలు
గాయాలను మాన్పి మరువ గతమును   కృష్ణా!

6)
వీరా బ్లాగుల కవితలు
సారమ్ముగ మనకుదక్కె సంపూర్ణముగా
వీరా రాసెను కవితగ
కోరిగణితమునుమధించి  కోరిక కృష్ణా

7)
తలచెద నే మణికంఠుని
తలచెదను శబరిగిరీశు తలచినయంతన్
తలచినవరముల నిచ్చును
కలియుగమున భువిని వెలసె కదరా కృష్ణా

8)
అంబటిభానుని కవితలు
అంబరమును తాకెను కద యబ్బుర పడనా
నందింపగ శతకవితలు
అందముగా నందజేసె నతడే కృష్ణా

9)
మాలాధారణచేసిన
మాలేకద మాకురక్ష మమురక్షింపన్
మాలతొ కదరా మనలకు
మాలామృత మహిమ తెలియు మహిలో కృష్ణా

10)
ధరియించి మాల రవియున్
దరలకమును మేలుకొంటి నలువదిదినముల్
కరపితి షోడశపూజల
నెఱిఁగితి షణ్ముఖుని మహిమలెన్నో కృష్ణా

11)
శివశివయని పలికినచో
శివుడేప్రత్యక్షమగుచు  చెంతననిలచున్
శివుడేయభయంబిచ్చును
శివనామస్మరణ సేయ శివమగు కృష్ణా.
(శివమ్ అంటే  శుభం అని)

12)
అదిగోవచ్చెనుఎన్నిక
లిదిగిదిగో జనులు చేరిరిరుకు గదుల్లో
నదె తొలిపతనము లోటరు
లదోగతికి మూలమోటులమ్ముటకృష్ణా

13)
ఒక్కటెకద  యోటు మనకు
చుక్కలొకడె గెలిచి నీకుచూపునొకండే
ఒక్క రెకద పొందపదవి
తక్కినయా లెక్కలెందు తరలేను కృష్ణా

14)
నీతిని తప్పెద వీవని
వ్రాతలునీనొసటిపైన  బ్రహ్మయు వ్రాసెన్
చేతములోనీతినిలిపి
నీతిపధములో జనులనునిలుపుము కృష్ణా

15)
అమ్మేకద మనదైవం
బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా
అమ్మేకద మనకఖిలము
అమ్మేప్రత్యక్ష దైవమగునిల  కృష్ణా


16)
శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...
చిరు కంద కానుక...

వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయమునొందున్
ఆరోగ్యము లందించుచు
రారా కాపాడ శుభములన్ మము కృష్ణా!

17)
తనయులు పుట్టిన చాలదు
వినయముతోపెరగవలెనువిజయము కొరకై
కనినతలితండ్రిమనముల
జనముల పొగడొందు రీతి జగతిని కృష్ణా

18)
చదువుకొనిన చాలుకదా
కొదవుండదు తెలివితేట కోరగ నీకున్
చదువుమురాశ్రద్దగనువు
చదువే నినుచక్కబెట్టు చదువుము కృష్ణా

19)
ఏమని తెలుపుదు  హితులకు
నీ మది తలపుల మెదలిన యిమ్మగు వలపుల్
ఆమని పాడు పదాలకు
నామది రంజింపలేదు నమ్ముము కృష్ణా

20)
చదివిన వేకువజామున
మదిలో నిక్షిప్తమగును మనమున నాటున్
అధికముగా ఫలితములిడు
(అధికముగా గెలుపులనిడు)
చదువుమయా తెల్లవారుజామున కృష్ణా

21)
అందపు గోదారి తటము
నందువెలసెషిరిడి ధామమదియే సాయీ
మందిరదివ్యక్షేత్రము
బృందావనమౌను సాయి హృదయము కృష్ణా

22)
జీవాధారము తానై
పావనదైవము వెలుంగు  .భగవాన్ సాయీ
బ్రోవగ భక్తులనెప్పుడు
నీవే యఖిలము సకలము నిక్కము కృష్ణా

23)
శరణాగత వత్సలునిగ
కరుణను మామీద చూపి కరుణించుమయా
పరమేశ్వర సురసాయీ
పరమదయాళ పరమాత్మ పావన కృష్ణా

24)
అసహాయసహాయుడవై
నసదృశ కరుణా పరాత్పరా శ్రీసాయీ!
అసమానదయాహృదయా!
మసకలు తొలగించి చూపు మహిమలు కృష్ణా!

25)
భక్తావనవందిత ఘన!
భక్తానుగ్రహ మహానుభావా!సాయీ!
భక్తవరద! శక్తిప్రద!
భక్తాభీష్టములు దీర్చుబాంధవకృష్ణా

26)
మునిహృదయవిరాజితుడవు
ఘనుడవనంత సుగుణుడవు కరుణాసాంద్రా!
కనుమయ్యా మణికంఠా!
కనికరమున వెతలు బాపి కా వుముకృష్ణా!

27)
భుజగాభరణాగ్రసుతా!
గజాననాగ్రజ! సదా సకలసురవంద్యా!
సుజనులసులోచనుండవు
నిజమగుజగదీశ్వరుడవు నీవే కృష్ణా!

28)
నిత్యాయ!నిగమపూజిత!
సత్యాయ ! సమస్తవేదసారా!శురా!
దైత్యాంతక ! దరిసించిన
నత్యద్భుతమగును లీలలన్నియు కృష్ణా!

29.
వీరాయ! వీరవర్యా!
దీరాయా!సద్గుణాయ!ధీరోదాత్తా!
తారాసురసంహారా!
ఘోరదనుజ భంజనాయ!కొనునుతి కృష్ణా!

30
పతితోద్ధారవినాయక
సతతము నిన్నే కొలిచెద సత్యముదేవా!
సతులగు సిద్ధికి బుద్ధికి
పతివై విఘ్నములు బాపు! వరదా!కృష్ణా!

31.
వసుధను ధరించువానికి
ముసిముసి నగవులను పంచు ముద్దులగుమ్మా!
వసుదేవుసుతుని ప్రియసతి రుసరుసలను మాని మమ్ము ప్రోచుము కృష్ణా!

32.
సూర్యగ్రహమును కొలువుము
సూర్యునిపూజించునీవు సుఖములు పొందన్
సూర్యధ్యానమున సకల
కార్యములన్నిటను సిద్ధికలుగును కృష్ణా!

33.
మనమున పీడలు కలిగిన
మనముకొలవవలెను  బుద్ధిమాన్యత  చంద్రున్
మనసే యతి ముఖ్యమగును
మనమందుస్మరింతు చంద మామను  కృష్ణా

34
రోగములు కల్గ మనలకు
నా గతులను మాన్చువాడునంగారకుడే
వేగమరిష్టము బాపెడి
యా గరిమగ్ర హమునకిదె యంజలి  కృష్ణా

35
బుద్ధికి పీడలు తొలగెడు
నొద్దీకగా బుధుని పూజలొనరింపంగా
శుద్ధిని బుద్ధికి గూర్చెడు
శ్రద్ధగ పూజింతుబుధుని శ్యామల కృష్ణా

 36)
పుత్రోత్సాహమె కావలె
పుత్రుల పీడోపశాంతి పోవలె నన్నన్
పుత్రులకిష్టుడు గురుడే
పుత్రులపీడ తొలగించు పూజలొ కృష్ణా

37.
పీడలవి యెన్నియున్నను
వీడక పూజలనుతనిసి విడిపించునుగా
పీడతొలగ పూజించెద
నేడుగడగ శుక్రుని కరుణింపగ కృష్ణా

38
శనిపూజలు చేసినచో
శని కలిగించుమనకు నుపశమనంబు సదా
క్షణమున తొలగును పీడలు
సానిపూజలు తిలలతోడ సలిపెద కృష్ణా

39.
శమియించును కనుపీడలు
యమనిష్ఠ్టగ రాహుగొలిచి యర్ధించగానే
మముకాచెడి దైవమునకు
నమామ్యహం రాహురూపునకు శ్రీకృష్ణా

40.
చేతములానందింపగ
కేతువును భజింతుమెపుడు క్షితి రక్షింపన్
ప్రీతితొ కేతునిపూజలు
సేతుము జ్ఞానమ్ము నీయ శీఘ్రము కృష్ణా

41.
తెలిపిరి ఛందోమర్మాల్
నిలిపిరి నను పద్యరచన నెయ్యము మీరన్
విలువగు పదములు గూర్చుచు
మలచిరి మధు విజయగార్లు మాన్యత కృష్ణా

42.
గో మాతను పూజించిన
గోమయ గోమూత్రములను గోక్షీరంబున్
గోమాతయొసగి కాచగ
నామెయెమా ప్రత్యక్షదైవమగునిల  కృష్ణా

43.
గోవుకు కొమ్మున విష్ణువు
గోవే భూదేవి ,తల్లి గోవు పితరుడౌ
గోవుఖురాగ్రము శేషుడు
గోవును పూజింప శ్రీలు కురియును కృష్ణా

44.
గురురాఘవేంద్ర!,దేవా
నిరవద్యశుభ ప్రదాయ నిర్గుణరూపా!
నరదోషహరా !నిరతము
శిరసొంచి నమస్కరింతు చేకొన కృష్ణా

45.
శూరుడుమహాబలుండగు
ధీరా! సుగుణాలవాల!ధిషణాభరణా!
వారింపుము మా దొసగులు
మారుతి!కరుణించి మమ్ము మార్చుము.  కృష్ణా

46.
తెలుగంటే నాకు భయము
తెలుగంటే వ్యాకరణము తెలుగే కష్టమ్
తెలుగంటే ప్రేమేమరి
తెలుగును నే నేర్చుకొందు తెలియగ కృష్ణా

47
ఆత్మయనిన నొకగమనము
ఆత్మకు నాధారమైనదాకసము కదా
ఆత్మయనినసత్యము జీ
వాత్మయు చేరును గద పరమాత్మను కృష్ణా

48
అమ్మేకద యాధారము
నమ్మేకద దైవమనిన నమ్మే దైవం
బమ్మేకదభూమాతయు
నమ్మే కదభరతమాత యంజలి కృష్ణా

49
తండ్రేకదపోషకుడిల
తండ్రేకద రక్షకుండు తండ్రేహితు డౌ
తండ్రేకద సన్మిత్రుడు
తండ్రేకద మార్గదర్శి తనుపగ కృష్ణా

50.
భార్యే మనలో సగమగు
భార్యే సహచరికుటుంబి భార్యే నీడౌ
భార్యేసంతానవతియు
భార్యే వంశమును బ్రోచు వరమగు కృష్ణా

51)
ప్రేమంటే వాత్సల్యము
ప్రేమే నమ్మిక యనురతి ప్రియగుణమదియే
ప్రేమే మక్కువ వలపగు
ప్రేమంటేనే మురిపెము ప్రేముడి కృష్ణా

52)
ప్రేమేకద యనురాగము
ప్రేమే పాశము నిరతము ప్రణయము నెమ్మిన్
ప్రేమే కూరిమి గారము
ప్రేమే యభిమానమగును ప్రేమే కృష్ణా

53)
ప్రేమే మరి యాప్యాయత
ప్రేమే మమకారము మన ప్రేమే యింపౌ
ప్రేమే కద గారాబము
ప్రేమే మారాము గోము ప్రేమతొ కృష్ణా

54)
ప్రేమేలే యభిమానము
ప్రేమే మరి మరులు మమత ప్రేమించంగన్
ప్రేమే లే వ్యామోహము
ప్రేమే లే పిచ్చికాంక్ష  ప్రేమే కృష్ణా

55)
అనుబంధము ప్రియతత్వము
ననుగునెనరు నాదటన్న నమరప్రేమౌ
ననురక్తి ప్రేమ నెయ్యము
ననురాగపు సౌరభముల నలదును కృష్ణా

56)
ధరణి యనిన భూమేకద
ధరణీ ఖగవతి జగత్తు ధరణము గౌరీ
గిరికర్ణిక ఇల అవనీ
ధరణీ పృధవీ ధరిత్రి ధాత్రీ కృష్ణా

57)
వృక్షము రక్షించుమనల
వృక్షము రక్షించబడిన, వృక్షమె సిరియౌ
వృక్షమున లేదు లేనిది
వృక్షములిలలేనియెడల విలయమె కృష్ణా

58)
తినడానికి తనకుండదు
తనపసులకు మేతలిడుట తనకుశ్రమయగున్
తనకిష్టములేకనెపశు
లను తక్కువకమ్మువారు రైతులు కృష్ణా

59)
రైతే మనరక్షకుడగు
రైతే మనపోషకుండు రైతే ఋషియౌ
రైతే మనకాధారము
రైతును కాపాడజేతు ప్రార్ధన కృష్ణా

60)
సంపద కలిగిన బ్యాంకులు
నింపుగతోడ్పడును ఋణము లెగవేయుటకున్
సంపాదన  లేకుండిన
చంపైనవసూలుచేయు చక్కగ కృష్ణా

61)
మహిళే కదమన మాతయు
మహిళే కద అక్క చెల్లి అన్నీ తానే
మహిళే కద యత్తయనిన
మహిళే మరి యమ్మ బామ్మ మహిలో కృష్ణా

62)
మహిరక్షణ రక్షించిన
మహళే మనుగడను గూర్చు మనరక్షణయౌ
మహిళలు లేకుండమనకు
మహిలో మన్నికయెలేదు మరవకు కృష్ణా

63)
పోలీసులెకద రక్షణ
పోలీసులెదిక్కుమొక్కుదీనులకెపుడున్
పోలీసులెలేకున్న జ
నాలకు లేదాయె రక్ష నమ్ముము కృష్ణా

64)
ఉష్ణాంశుడు ఆదిత్యుడు
ఉష్ణకరుడు యహిమకరుడు నుజ్వాలారవియే
ఊష్ణుడు దినకరుడు నినుడు
విష్ణుడు జిష్ణుడు నతండె వేలుపు కృష్ణా

65)
గ్రేటరున వచ్చె యెన్నిక
లోటరులకు విందుగూర్చు నట్లు చెవులకున్
ఓటను నాయుధములతో
దీటుగ స్పందించినపుడె తీరును కృష్ణా

66)
గ్రేటరు ఎన్నిక లోనా
చాటుగ డబ్బులు వరదగ చల్లిన గానీ
లేటుగ లేచిన ఓటరు
నీటుగ గెలిపించు నచ్చు నేతను కృష్ణా

67)
పోరేమో స్పీడు పెంచెను
కారును సైకిల్ కమలము కరము కదమునన్
హోరుగ పతంగులెగిరెడి
తీరును గమనించుచుండ్రి తిరమున కృష్ణా

68)
నగరమున నేడు మ్రోగెను
నగర భవిత తెలియజేయు నాందికి గంటల్
నగరము పై పట్టుకొరకు
నెగసిననధికారవాంఛ నెన్నిక కృష్ణా

69)
ఎవ్వరు నిలిచిరి బరిలో
ఎవ్వరు గెలిచెదరునేడు నెన్నికలందున్
ఎవ్వరు ఎవరో తెలియదు
ఎవ్వరు గెలచిన నగరములెదుగును కృష్ణా

70)
ఓటును వేయుము ధీటుగ
ఓటే మనహక్కుదిక్కు ఓటే సర్వం
బోటును డబ్బులకమ్మకు
ఓటే నీ భవిత పొందు మున్నతి కృష్ణా

గాంధీ జయంతి సందర్భంగా అక్షర నీరాజనం (పంచరత్నాలు)

71)
చేతిన కఱ్ఱను బట్టియు
తాతయు శాంతియెయసిగ స్వతంత్రతకొఱకై
జాతిపితగ గాంధీ మన
రాతను మార్చగనుబూనె త్రాతగ కృష్ణా

 72)
పరదేశీ పాలనయను
చెరనుండి విముక్తిచేసి చింతలుదీర్పన్
వరముగసత్యాగ్రహమను
కరమరుదుగనందజేసె ఖడ్గము కృష్ణా

73)
గాంధీనిచంపెను పిరికి
పందయసురుడౌను గాడ్సెభరతావనిలో
మందెంతమంది యుండిన
గాంధీనటకాపుకాయగలిగిరె కృష్ణా

74)
ఏతీరుగ నిన్నుఁ గొలుతు
మేతీరుగ దీర్పగలము ఋణమును బాపూ
చేతులుమోడ్తుము నీకై
నీతికి నిలతుము నిరతము నీవలె కృష్ణా

75)
గాంధీ మనజాతికిపిత
గాంధీజీ మార్గదర్శి ఘనముగ మనమున్
గాంధీజీ కలలుగనిన
గాంధీయిజ భారతమును కాంక్షింద్దామా

76
అవి నా బాల్యపుగుర్తులు
నివిమరపునకెపుడు రాక హృదిలో నిలచున్
జవమగు కాలముతోమా
ర్దవమమతల గురుతులను కదల్చును కృష్ణా

77.
ఆటలతోటే స్నేహము
ఆటలతోటే కలహము యవి నెట్లన్నన్
ఆటలలో గెలుపోటమి
కూటములతొ మేలుకీడు కూర్చును కృష్ణా

78
పీరుల పండుగలందున
ఊరేగింపులు జరిపెద రుత్సాహముతో
తీరుగ జనులెల్లకలియు
భారతజాతీయతకునుప్రణతులు కృష్ణా

79.
పండుగ సెలవులయందున
దండిగ బంధువులు మిత్ర తతి వేడుకలన్
నిండుగమధురాన్నములన్
వండుకొని భుజింతురు తీరిబంతుల కృష్ణా

80.
కూనూరున పుట్టిపెరిగి
భోనగిరిని చదువుకొంటి పొందుగ నిట బా
లానగరు చేరి బ్రతుకగ
నేనూరిని మరువలేదు నిక్కము  కృష్ణా

81
తిట్టిన తిట్టును తిట్టక
తిట్టినవాడే ఘనుండు తిట్టుల సమ్రాట్
తిట్టుమనుచు ననగానే
తిట్టేను వీరానవేర తీవ్రత కృష్ణా


82
కవనములల్లెడి కవి మెల
కువతో యీలోక రీతి గుర్తింపవలెన్
కవిత లె ప్రభాతసూక్తుల
కువకువలై మనలమేలుకొల్పును కృష్ణా


83
అలుగుటయే తెలియనిదయి
యలుకను నరుణమ్మబూనె నాక్షణమందున్
పలుకని యలుకలు  కలచెను
వెలదికళ వ ళపడమిత్రబృందముకృష్ణా


84)
(అవేరా గారు ఇచ్చిన పదాలు " శివ, భవ" నవ లతో పద్యరచన)

శివ శివ యని తలచిననే
భవహరుడేతెంచునుకదభక్తుల బ్రోవన్
శివుడే కద భయహరుడగు
శివుడే నవనాయకుండు శివుడే కృష్ణా

85)
(అవేరా గారిచ్చిన వినండి, కనండి, మనండి, కొనండి పదాలతో పద్యరచనా ప్రయత్నము)

మంచిని వినండి తప్పక
కంచిని మరువక కనండి కనులారంగా
పంచుచు మనండి సిరులను
నంచిత పుణ్యము గొనండి యనెదను కృష్ణా

తేది: 01-02-2016
86)
గోడలు కూల్చుము కులముల
గోడలు కూల్చుము మతముల గొడవలవేలా
గోడలె మన ఎదుగుదలకు
మూడులకివి యాయుధములు పూనగ కృష్ణా

87.
ఆలును మగలనునిరువురు
పాలును నీళ్లుగ చరించి బాగుండ వలె న్
ఆలియెకద మూలమగును
తాళితొ వంశమునుబెంచు తరములు కృష్ణా

88.
లక్షలగును మధుసూదను
నక్షరములు, పూరణములు నాటలు నవి సద్
భక్షణలౌ సరసులకును
దక్షతతో పద్యమల్లు ధన్యుడు  కృష్ణా

89.
తళతళమెరసెను మెరుపులు
పెళపెళయురిమెనుయురుములు పెను రవములతో*
జలజల కురిసెను చినుకులు
కొలనున విరిసె కమలములు కొమరుగ కృష్ణా

90.
అరాశ గారిచ్చిన కాపాడు కోరాడు తాగాడు పోతాడు పదాలతో పద్యరచన ప్రయత్నం

కాపాడుముమమ్మందర
గోపాలా! యెల్లదశలగోరాడు మది న్
నీపదసుధతాగాడగ
ప్రాపుగపోతాడు ముక్తి పధముకు కృష్ణా

91.
కోమలి ఆడుము కృష్ణా
గోముగ అలరాడుమాతొ గోపిక లోలా
ప్రేమగచిరుగాడుపులతొ
ప్రేమగ తాగాడు నాడు పూతన పాలు




93)
(కవి మితృలు అంజయ్య గౌడ్ గారు శతకవితలు పూర్తి చేసిన సందర్భంగా పద్య కానుక)

అంజన్న వ్రాసె శతకము
మంజీరా నాదమువలె మధురము గాగన్
రంజుగ తీర్చెను కవితలు
నంజన్నా! స్వీకరింపుమంజలి కృష్ణా


02-02-2016
94)
ప్రేమంటెకాదు ప్రేయసి
ప్రేమే మాతాపితరులు ప్రేమయఖిలమౌ
ప్రేమే ప్రేయసి కాదుర
ప్రేమించే ముందు పంచు ప్రేమను కృష్ణా


95)
రంగందముండియేమీ
యింగితముతొయుండవలెను యెల్లర తోడన్
అంగముల రంగుకన్నను
సంగతియగు నంతరంగసౌరులు కృష్ణా

96
వలదీర్ష్యాద్వేషమ్ములు
వలదు తగదిల వ్యతిరేకభావములెపుడున్
అలతిగ జేయును మనలను
తొలచుమదిని సంతసమ్ముతొలగునుకృష్ణా
   

97.
సుఖమే గద సంతోషము
సుఖమే లేకుంటెమనిషి శుభములునిండున్
సుఖములిడును సర్వస్వము
సుఖపు కిటుకు తృప్తి ఔను సుందర కృష్ణా

98
తలచిన కీడులు మనలను తలచిన కలుగును  మనలకు తాకుమరలుచున్
కలవకు కీచక మిత్రుల
వలదిలసన్నుతకృష్ణా

99
చదువే యున్నత గతులిడు
చదువేకద మనకు రక్ష చదు వుహితుండౌ
చదువే కద భవితవ్యము
చదువు బ్రతుకు సారమెల్ల సన్నుతకృష్ణా

100
కందములు కవితలందున
వందాయెను గురులకెల్ల వందనశతముల్
ఎందరొననునడిపించిరి
ఛందోరీతులను నేర్పిచక్కగ కృష్ణా

101)

సొగసరి వనితను జూచిన
మగటిమితో మెరయునుగద మగవారి ముఖాల్
జఘనమ్మున కదలాడుచు
జగడములను పెట్టెదేల జంటలకు జడా

102)
సాహిత్యసభలు జరుపగ
సాహిత్యముపొంగిపొరలె సత్కవులెల్లన్
మా హితము కోరి పలుకగ
ఆహా!భువనగిరి కీర్తి యభ్రమునంటెన్.

Tuesday, May 8, 2018

జలకవితా మహోత్సవం - వనపర్తి

తేది 06-05-2018, ఆదివారం నాడు వనపర్తి జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ మైదానంలో  తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణా జలకవితోత్సవం ఘనంగా నిర్వహించారు.
 అద్భుతంగా జరిగిన "తెలంగాణ జల కవితోత్సవం" లో  తెలంగాణా లోని పలుప్రాంతాలనుండి అనేకమంది కవులు పాల్గొని తరలంగాణాలో నీటి వనరులు - చాటి ప్రాధాన్యత గురించి తమ తమ కవితల, పద్యాల ద్వారా వివరించారు. 

ఇందులో బాగంగా మేడ్చల్ జిల్లా, సూరారంకాలని కి చెందిన కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ పాల్గొని " తెలంగాణ జలకళ - అదేకదా మనకల" అనే కవిత ద్వారా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరిచ్చి ఇండ్లలో జలకల,  మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి చెరువుల్లో జలకల, ప్రాజెక్టు నిర్మాణాలు చేసి కాలువల్లో జలకళ తీసుకువచ్చిన ఘనతను తన కవిత ద్వారా వినిపించి తొఇటి కవుల, నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గోగులపాటి కృష్ణమోహన్ ను  ఘనంగా సత్కరించారు.










Saturday, May 5, 2018

తెలంగాణ జలకల - అదేకదా మన కల

తెలంగాణ జల కవితోత్సవం
తేది: 06-05-2018
స్థలం: వనపర్తి, తెలంగాణ

శీర్షిక: 
తెలంగాణ జలకల - అదేకదా మన కల

రచన : గోగులపాటి కృష్ణమోహన్
కాకతీయులు నాడు, తోడిన చెరువులు- పూడికలు తీయక, పూడి పోయెను కదా ...
చెరువు కింద ఉన్న, పంట పొలములు కాస్త - పర్రెలు పట్టేసి, పకపకా నవ్వెగా...
చెరువు కింద రైతు, పంట చేతికి రాక - పల్లె విడిచిపెట్టి, పట్నమే సాగెగా...
మిషను కాకతీయ, మళ్ళి పూనుకోని - పూడికలు తీసేసి, పుణ్యమే కట్టుకొనె
చెరువు కింద ఉన్న, పంట పొలములు కాస్త - జలముతో తడిసెగా, రైతన్న మురెసెగా...

తాగునీరు లేక, తల్లడిల్లె పల్లె.. నీటికొరకు నడిచె, నాలుగేసి మైళ్ళు
సంకలోన పిల్ల, నెత్తిపైన బింద - నడిచి నడిచి నడుము, విరుగుడాయె...
ఉత్తమ గతులకై, దివినుండి గంగను - తీసుకొచ్చెను నాడు, భగీరధ యత్నము
ఇంటింటికీనీరు, ఇచ్చుటే లక్ష్యంగా - నేడు వచ్చెను కదా, మిషిను భగీరధ...
నడవలేని తల్లి, నట్టింటిలో ఉండి - నల్ల తిప్పుకుంటు, నీళ్ళు పట్టనుండె...

సాగునీరు లేగ, సాగుబాటు లేక - సాగెనయ్య రైతు, కూలిబాట కొరకు
రైతు బాధలెరిగి, రారాజు పూనుకొని - ప్రారంభమే చేసె, ప్రాజెక్టు పనులను
మిషిను భగీరధతొ, ఇంటింట జలకల - మిషను కాకతీయతో, చెరువులో జలకల
ప్రాజెక్టు పనులతో, కాలువలు కలకల - తెలంగాణ జలకల, ఇదేకదా మనందరి కల...

రచన: గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, మేడ్చల్ జిల్లా, గ్రేటర్ హైదరాబాదు, తెలంగాణ.
చరవాణి సంఖ్య : 9700007653

Sunday, December 31, 2017

ఏది పాశ్చాత్యం?

ఏది పాశ్చాత్యం?

గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అదేంటో అందరూ ఆంగ్లసంవత్సరాదిని అదోలా చూస్తున్నారు.
అదేమంటే పాశ్చాత్య సాంప్రదాయమంట...

పుట్టినరోజేదంటే ఆంగ్ల తేదీలు చెప్పేవారే అందరూ..
తిధి, వార, నక్షత్రాలు చెప్పేది ఎందరు?
ఇది పాశ్చాత్యం కాదా?

ఉద్యోగంలో చేరాలంటే ఫస్టు తారీఖు ఎప్పుడా అనిచూస్తారే తప్ప..
పాడ్యమి కోసం చూసేవారెంతమంది?
ఇది పాశ్చాత్యం కాదా?

ఉదయం లేవగానే బ్రష్ పేస్టు వేస్తున్నారే తప్ప
ఎంతమంది, పండ్లపొడి, పండ్లపుల్ల వాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

బయటకు వెళ్ళాలంటే సూటూ బూటూ వేసుకుంటున్నారే తప్ప
ఎంతమంది సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

వినడానికి రేడియో, చూడటానికి టీవీలు కావాలి
చేతిలో ఆండ్రాయిడ్ ఫోను కావాలి
ఇది పాశ్చాత్యం కాదా?

బైకులు, కారులు... ఇంకా దూరమెళ్ళాలంటే ఎరోప్లేను,  స్టీమర్లు కావాలి..
ఎంతమంది ఎడ్లబండ్లు వాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

తెలుగు రాష్టం దాటి బయటకు వెళ్ళాలంటే ఆంగ్లం రావాలి, మాట్లాడాలి
ఎంతమంది మాతృభాష మాట్లాడుతున్నారు?
ఇది పాశ్చాత్యం కాదా?

విదేశీ భాష కావాలి, విదేశీ ఉద్యోగం కావాలి... విదేశంలో ఉన్న సంబంధం కావాలి.
ఇది పాశ్చాత్యం కాదా?

ఎంతమంది ఉదయం లేవగానే టైం కోసం గడియారం, తేదీ కోసం క్యాలెండరు చూడకుండా ఉంటున్నారు?
ఎంతమందికి పంచాంగం మీద అవగాహన ఉంది?
ఇది పాశ్చాత్యం కాదా?

ఇన్ని పాశ్చాత్య ధోరణినీలకు అలవాటుపడి, ఆదారపడి బతుకుతున్న మనం..
ఇన్నిటికీ మూలాధారమైన కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలకడానికి మాత్రం పాశ్చాత్యం అడ్డొస్తుందా ?

ఇంక్రిమెంట్ల కోసమో, పదోన్నతులకోసమో,
కొత్త వ్యాపారం కోసం,
ఉన్నత చదువులకోసం..
ఎన్నో ఆశలతో,
సరికొత్త ఆశయాలకోసం...
అందరూ క్యాలెండర్ ను అనుసరిస్తారే తప్ప పంచాంగాన్ని కాదు..

అలాంటి మరో ఆంగ్ల సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలకండి...
తప్పేం లేదు.
కాకపోతే
పబ్బులు, క్లబ్బులు వెళ్ళి
మద్యం కోసమో...
మగువ కోసమో..
వొళ్ళు హూనం, జేబులు శూన్యం చేసుకోకండి...

ఇంటిళ్ళిపాదితో హాయిగా నవ్వుతూ.. తుళ్ళుతూ మరో సంవత్సరానికి స్వాగతం పలుకుదాం...

పాశ్చాత్యం తప్పుకాదు
మన సంస్కృతి సాంప్రదాయాలు మరిస్తేనే తప్పు
అది మరవకండి

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
9700007653

Friday, December 22, 2017

Wednesday, December 20, 2017

ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం దృశ్యమాలికలు






వార్తా పత్రికలలో నా కవితా పఠన వార్త




తేట తెనుగు భాష నా తెలుగుభాష


ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా
వేదిక ' ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం
సమయం రాత్రి 7-0 గం‌. ల నుండి జరిగిన సమావేశంలో
నేను పఠించిన కవిత

శీర్షిక :తేటతెనుగు భాష నా తెలుగుభాష
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అచ్చమైన భాష.. స్వచ్ఛమైన భాష..
యాబదారు అక్షరాల .. తేనెలొలుకు  భాష ..
తేటతెనుగు భాష నా... తెలుగుభాష...

అచ్చులతో గుణింతాలు..హల్లులతో ఒత్తులు
అందమైన ఛందస్సు... సరసమైన సంధులు గల
వెన్నలాంటి భాష నా... తెలుగుభాష...

భక్తిభావమైన విభక్తులు... సాటిలేని సమాసాలు
అందమైన అలంకారాలు... ప్రకృతీవికృతుల
పరిమళించు భాష నా... తెలుగుభాష...

అసమాన ఉపమానాలు.. 
బాషాకీర్తి పెంచు భాషాభాగాలు
వ్యాకరణాలతో కూడిన నుడికారాలు గలభాష
మధురమైన భాష నా మాతృభాష

అష్టావధానం”, “శతావధానం” 
“సహస్రావధానం” “సమస్యాపూరణం
నా తెలుగు భాషకే మణిహారాలైన
అరుదైన భాష నా... తెలుగుభాష...

స్పష్టత, శ్రావ్యత మాధుర్యం, గాంభీర్యం
మాండలీకాలతో మధురిమలొలకించు
మధురమైనటువంటి మాతృభాష
అమ్మపలుకుల భాష నా తెలుగుభాష..

ప్రాచ్య ఇటలీ పేర ప్రభవించు నా భాష
పలుకు పలుకు లోన తేనెలొలుకు భాష
అన్ని స్వరాలకు అనువైన భాషిది
మధుర మైన భాష నా తెలుగుభాష

తెలుగుబాషలోని తేటతెల్లపదము
వ్యాకరణముతోటి వాసికెక్కి
పద్యసంపదున్న పదునైన బాషరా
తేనెపలకుల భాష నా.. తెలుగుభాష

మరువకండి మీరు మాతృభాషనెపుడు
భావివార్కితెలుపు భాద్యతెరిగి
మధురమైనభాష మన తల్లిభాష
తేటతెనుగుభాష నా... తెలుగుభాష


ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
చరవాణి సంఖ్య : 9700007653

Wednesday, December 6, 2017

సాక్షిలో నా కవిత

సాక్షి పత్రికలో తేది 06-12-2027 న వచ్చిన నా "నా తెలుగు భాష" కవిత


నా తెలుగు భాష

నా తెలుగు భాష
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

తేటతెనుగు భాష నాతెలుగు భాష
గొప్పకీర్తి గలది నా మాతృభాష
త్రిలింగ దేశములో వెలుగుచున్న భాష
ఎన్నొ ప్రక్రియల మిళితము నా తెలుగు భాష

అచ్చులు, హల్లులు, ఉభయాక్ష్షరాలు
అందమైనటువంటి ఛందస్సు గలది
వ్యాకరణాలతోకూడుకున్న భాష
తేటతెనుగు భాష నా తెలుగుభాష

పాటలు, పద్యాలు, నాటికలు, సినిమాలు,
కవితలు, గేయాలు జానపదులు..
బుర్రకథ, హరికథ, ఒగ్గుకథలు
తోలుబొమ్మలాట, యక్షగానాలు

సాగరాంధ్ర భాష, రాయలసీమ భాష,
కళింగాంధ్ర భాష, తెలంగాణ భాష
మాండలికాలెన్నో ఉన్న మాతృభాష నాది
మధురమైన భాష నా తెలుగుభాష

ఆవె.
మరువకండి మీరు మాతృభాషనెపుడు
భావివార్కితెలుపు భాధ్యతగొని
మధురమైనభాష మన తల్లిభాసరా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653

Sunday, November 5, 2017

మిడిల్ క్లాసు బతుకు

గోగులపాటి కృష్ణమోహన్
మిడిల్ క్లాస్ బతుకులు

మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
మనకు మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
ఉన్నోనితొ ఉరకలేము
లేనోనిగ బతకలేము.. ||మిడిల్||

కార్పోరేట్ బడులకు
కాసులను పెట్టలేము
ప్రభుత్వ బడులకు
పిల్లలను పంపలేము
చాలీచాలని చదువులు
మాబతుకుకు భాగ్యమాయె ||మిడిల్||

పెద్ద దవాఖానాలకు
పోలేనీ బతుకుమాది
ప్రభుత్వ దవాఖానాలకు
పోదామంటే భయము
రోగమునొప్పొచ్చినపుడు
ఆరెంపిలె గతిమాకు || మిడిల్||

పట్టుచీర కొనలేము
ఉట్టిచీర కట్టలేము
అద్దాలషోరూములు
అవతలినుండే జూస్తూ
క్లాసుగా ఉన్న చీర
మామూలు ధరలకడిగే ||మిడిల్||

డూప్లెక్సు ఆశాయె
పెద్ద కొంప లేదాయె
అపార్ట్మెంట్ వద్దాయె
అద్దె కొంప కరువాయె
స్వంత కొంప కలకోసం
అప్పులపాలవ్వాలె ||మిడిల్||

పెళ్ళీ పేరంటాలకు
ఇరుగుపొరుగు దావతులకు
బంగారునగలు కొనలేము
వెండినగలు పెట్టలేము
పెళ్ళిపేరంటాలకు
నగిషీ నగలే ముద్దు ||మిడిల్||

ఎరోప్లేను ఎక్కలేము
ఏసీలో పోలేము
ప్రైవేటు బస్సుల్లో
ప్రయాణం చేయలేము
ఎర్రవస్సు, కర్రె రైలు
టూవీలరె మాకు దిక్కు ||మిడుల్||

మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
మనకు మిడిల్ క్లాసు బతుకొద్దుర మామా
ఉన్నోనితొ ఉరకలేము
లేనోనిగ బతకలేము.. ||మిడిల్||

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Thursday, November 2, 2017

యాది మరవకు బిడ్డ..

రచన :
సహస్రకవిమిత్ర, కవిరత్న, కవిప్రవీణ.
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టుు

శీర్షిక: యాదిమరవకు బిడ్డా
యాది మరవకు బిడ్డ.. యాది మరవకు మమ్ము
ఏదేదొ జేసుకొని ..ఏడిపించకు మమ్ను..

పుట్టలకు మొక్కాము.. గుట్టలను ఎక్కాము
నువ్వుపుట్టాలని .. గుడులెన్నొ దిరిగాము..
ఏ పుణ్య ఫలమో....ఏదైవ బలమో..
మాకడుపులో నువ్వు ... పుట్టావు బిడ్డా...
||యాది మరవకు బిడ్డ||

కాయ కష్టము చేసి... కాని కొలువులు జేసి
కంటికి రెప్పలా .. కాపాడుకున్నాము
అప్పుసప్పులు చేసి. .ఆస్తులమ్నుకోని
ఆడిగినదె తడువుగా..... అన్నియిప్పించాము
||యాది మరవకు బిడ్డ||

పడిగాపులూ పడుతు.. పస్తులే ఉన్నాము
ఏ లోటురాకుండా.. పెంచుకున్నము కొడక
పై సదువులు సదవ.. పట్నమే పంపాము
పెద్దకొలువులతోటి.. పైకి రావాలని
||యాది మరవకు బిడ్డ||

మందులని చిందులని... పబ్బులకు వెళ్ళకు
పేకాట ఆడుటకు.. క్లబ్బులకు వెళ్ళకు
సిగరెట్లు సినిమాలు.. మత్తుపానీయాలు
ఆడపిళ్ళల జోలి.. అస్సలే వెళ్ళకు
||యాది మరవకు బిడ్డ||

రేసు బండ్లు వద్దు.. ర్యాసు డ్రైవింగొద్దు
ఫుట్టుబోర్డు వద్దు.. సీటులోనే ముద్దు
ఇరుగు పొరుగు తోటి... పోట్లాటలే వద్దు
సంఘాల స్ట్రైకుల... జోలికే పోవద్దు
||యాది మరవకు బిడ్డ||

రాజకీయాలొద్దు.. రౌడివేశాలొద్దు
రంకులాడిలతోటి.. రాసుకుతిరుగొద్దు
మాయ మాటల తోటి.. మోసాలు జేసేటి
మాయజాలము లోన.. నీవసలె పడవద్దు
||యాది మరవకు బిడ్డ||

వాట్సప్పు ఫేస్బుక్కు.. ట్విట్టరు, హైకంటు
అంతర్జాలంలో... ఆగమయ్యిపోకు
అండ్రాయిడైఫోన్.. ట్యాబ్ ల్యాప్ టాపంటు
భారి షోకులకెళ్ళి.. భాద్యతలు మరిచేవు
||యాది మరవకు బిడ్డ||

ఎంత చదివిన గాని.. ఏది నేర్చిన గాని
ఇంకిత జ్ఙానము .. కొంతైన నేర్వరా
పెద్దలను గౌరించు.. పిన్నలను ప్రేమించె
మర్యాద మన్ననలు.. నేర్చుకోవాలని
||యాది మరవకు బిడ్డ||

అడ్డంగ తిరగకు... అప్పులే జేయకు
ఆలినీ, తాళినీ... తాకట్టు పెట్టకు
గుర్రపుస్వారీ లు... క్రికెటుబెట్టింగులని
అప్పులా పాలయ్యి ఆగమవ్వకు నువ్వు
||యాది మరవకు బిడ్డ||

చదువుకోలేదని... ర్యాంకురాలేదని
ఇరుగు పొరుగు ముందు.‌ చులకనౌతావని
కన్నోల కలలను... కాలితో తొక్కేసి
కాటికెళ్ళె పనులు... జేయమాకుబిడ్డ
||యాది మరవకు బిడ్డ||

ఉంటేనె తిందాము... లేదంటె పందాము
బతికున్నన్నాళ్ళు... కలిసిమెలిసుందాము
బాగుపడకున్ననూ.. బాధలేదూ బిడ్డ
దైర్యంగ మన బతుకు.. బతుకుదాము బిడ్డ
||యాది మరవకు బిడ్డ||


మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు
9700007653






Monday, October 30, 2017

అమ్మలార.. అయ్యలార .. ఆలోచించండి జర



అమ్మలార అయ్యలార
ఆలోచించండి.. జర

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అమ్మలార... అయ్యలార
ఆలోచించండి జర
మీ బిడ్డల భవిష్యత్తు
మీ చేతుల్లోనే ఉంది.
అనవసరపు ఆశలతో
ఆసక్తులు లేపకండి..
ఇరుగు పొరుగు పిల్లలతో
పోటీలు పెట్టకండి
ఇంజనీర్లు డాక్టర్లే
అవ్వాలని అనకండి
ర్యాంకులు రాలేదంటూ
రాద్దాంతం చేయకండి
లక్షల్లో పిల్లలుంటె
వేలల్లవకాశాలు
ఎంతచదివితేముంది
అందని ద్రాక్షనిపండ్లు
వారిలోని ఆసక్తిని
గ్రహించాలి మీరంతా
ఎందులొ నైపుణ్యముంటె
అందులోనే రాణించ
వారిలో ఉత్సాహాన్ని
నింపాలి మీరంతా
చదవలేక... చెప్పలేక
చచ్చిపోయె దానికన్న
బతికి సాదించండని
బాగుగా బతుకండని
మీ పిల్లలకు మీరె
భరోసా ఇవ్వండి
మీ పిల్లల్లోన మీరె
ధైర్యాన్ని నింపండి..‌
భావితరాలను మనం
బతికించుకోవాలి
బంగారు భవితను
వారికందించాలి


మీ
సహస్రకవిరత్న
కవి ప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

విద్యార్థుల ఆత్మహత్యలు ఆపండి



ఆత్మహత్యలు ఆపండి
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు

విద్యార్థుల ఆత్మహత్యలపై..
మానసిక వేదనతో 

తల్లడిల్లే పిల్లలారా
చదువుకొరకు చిదపకండి
మీ లేత జీవితం‌..
చదువన్నది ఒక్కటే
జీవితం కాదండీ.
చదువు లేని వారెందరో
బాగుపడ్డ వారున్నరు..
చదువన్నది ఒక్కటే
శాశ్వతం కాదండీ
చదువులేకున్న కూడ
శాశ్వతంగా బతకవచ్చు
చదువు కొరకు ప్రాణాలను
అర్పించే ముందు మీరు
మీ తల్లి తండ్రులను
గుర్తెరిగి మలుచుకోండి
చదువుకున్న వారికంటే
చదువు లేనివారెందరొ
తెలివిని ఉపయోగించి
ప్రయోజకులు అవుతున్నరు
ఇంజనీర్లు డాక్టర్లే
ఇంటింటికీ కావాలా?
ఇతరులు ఎవ్వరు మనకు
అవసరమే లేరా?.
చదువన్నది సంస్కారం
చదువన్నది మేదస్సు
చదువన్నది విజ్ఙానం
కా కూడదది అజ్ఙానం
చావకండి చావకండి
విద్యార్ధిని విద్యార్థులారా
సాధించే దేమిలేదు
సచ్చినాక మీరింకా
బతుకండి బతుకండి
నీవారికోసం... నీ ఊరికోసం
బతకండి బతకండి
బతికి సాదించండి

మీ
సహస్రకవిరత్న
ప్రతిలిపి-కవిప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

Monday, October 9, 2017

ప్రతిలిపి కవి ప్రవీణ


                                         ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్






ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్
------------------------------------------------------
కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు ప్రతిలిపి సంస్థ ప్రతిలిపి కవి ప్రవీణ, ప్రతిలిపి కథాభారతి బిరుదులను అందజేశారు
దేశంలోని వివిధ బాషలలో సాహిత్య సేవలందిస్తూ ఎంతో మందికవులకు సోషల్ మీడియా ద్వారా వేదికగా నిలిచిన ప్రతిలిపి సంస్థ తమ సంస్థతో అనుసంధానం అయిన కవులు/రచయుతల పట్టాభిషేకంలో బాగంగా విశేష ప్రతిభ కనబరిచి మరియు తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్నందుకు గాను విజయవాడలోని ఐ ఎమ్ ఏ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కవులకు పురస్కారాలను అందజేసింది.
ఇందులో బాగంగా 200 లకు పైగా పద్యాలు, కవితలు, కార్డు కతలు అందించిన గోగులపాటి కృష్ణమోహన్ సాహితీ సేవలను గుర్తించి ప్రతిలిపి కవిప్రవీణ, ప్రతిలిపి కథా భారతి అనే బిరులను ప్రధానంచేసింది.
ఇప్పటికే సహస్ర కవిరత్న, సహస్ర కవిమిత్ర బిరుదులు పొందడంతో పాటు రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు గోగులపాటి కృష్ణమోహన్.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా, తెలుగు రక్షణ వేదక అద్యక్షులు పొట్లూరి హరికృష్ణ, దూరదర్శన్ వాఖ్యాత విజయదుర్గ, ఆం. ప్ర. మహిళా కమీషన్ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి, ప్రముఖ కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, కళ్యాణ్ కృష్ణ కరణం, ప్రతిలిపి తెలుగువిభాగం ఇంచార్జ్ జానీ తక్కెడశిల, భువనవిజయం వ్యవస్థాపకులు వంకాయలపాటి చంద్రశేఖర్, చిత్రకారుడు కుంచె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.