Wednesday, May 31, 2017

వృక్ష వేదన


వృక్ష వేదన

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు

లేచింది మొదలు... 
పడుకునేవరకు...

కాదు... కాదు...

పుట్టింది మొదలు.... 
చచ్చేంత వరకు...

ఇంకా చెప్పాలంటే... 
చచ్చాక కూడా...

నేను లేకుండా... నీవుండలేవు....
నా నీడ లేకుండా... నీవు నిముడలేవు....
అర్ధమయ్యిందనుకుంటా నేనెవరినో....
నేనే వృక్షజాతిని....

నీవుండే ఇంటికి ద్వారాన్ని నేను....
పైకప్పునేను.... షోకేసు నేను...
ఊతమిచ్చే చేతికర్రను నేను....
చచ్చాక చితికి కర్రను నేనే....

నీవుతినే పంటసరకు నేను....
వంటచెరుకు నేను....
పప్పు ధాన్యం నేను.... 
పశువకు దాణా నేను....

ఆకుకూర నేను... 
కాయగూర నేను...
కరివేపాకు నేను... 
కొత్తిమీరనేనే...

నెత్తిలో పూవునేనే.... 
పుష్ప గుఛ్ఛం నేనే....
పూలమాల నేనే.... 
ద్వజస్థంభం నేను...

ఆకుమందు నేను... 
ఆయుర్వేదం నేను...
అగ్గిపుల్లా నేను....
అగరు బత్తీనేనూ.... 

పొలందున్నే హలం నేను....
పారకున్న కర్ర నేను ....
కూలి చేతిల తట్టనేను.... 
గడ్డలి కున్న కామ నేను....

రైతు చేతిల కర్ర నేను...
మాస్టారు చేతిల బెత్తం నేను....
దేవాంగునికి ఆసర నెను....
పోలీసు చేతిలో లాఠీను నేనే....

కర్షకుడెక్కే బండిని నేను...
ప్రభువులెక్కే పల్లకి నేను...
రాజులు ఎక్కే రథమూ నేనూ...
మానవుడెక్కే వాహనం నేనే...

నీవు రాసే పెన్ను నేను... 
పెన్ను కింది పేపరు నేను....
పరీక్ష రాసే అట్టను నేనూ...
మరెన్నిటికో మూలాధారం నేనే....


నీశ్వాస నేను... 
నీ ఆశ నేను....
నీ నీడ నేను.... 
నీ తోడు నేను

నేను లేకుండా నీకు నీరు లేదు...
నేను లేకుండా నీకుగాలి లేదు....
నేను లేకుండా నీకు కూడు లేదు
నేను లేకుండా నీకు గూడు లేదు

అసలు నీకు బ్రతుకేలేదు....
నన్ను నాశనం చేస్తున్నావు.....
లేని సమస్యలను కొనితెచ్చుకుంటున్నావు....

వృక్షో రక్షతి..... రక్షతః...

మీ
గోగులపాటి కృష్ణమోహన్,
సూరారంకాలని, హైదరాబాద్.
9700007653

No comments:

Post a Comment