Tuesday, February 9, 2016

సీస పద్యాలు

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ కర్నలిస్టు,
సూరారం కాలని, హైదరాబాదు
9700007653.

శీర్షిక: అమ్మాయి పెళ్లి
సీసపద్యము:- 1)

అమ్మాయి పెళ్ళికి అడ్డంకు లొచ్చినా
అదరడు బెదరడు అయ్య యెపుడు

అప్పులే దెచ్చునో ఆరాట పడునో
కన్యదానముచేసి కాళ్ళు గడుగు

వియ్యాల వారిని కయ్యాలు తగదంటు
కట్నకానుకలిచ్చి కడుపు నింపు

కూతురు అల్లుడు కుశలమే కోరుతూ
పొలిమెర వరకొచ్చి పంపి మరులు

ఆవె:-
కట్న కానుకలని కాంతను హింసించి
గ్యాసునూనెబోసి కాలబెట్టి
తల్లి దండ్రు లార దయలేని పుత్రుడా
ఆడపిల్లపట్ల అలుసు తగదు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గోగులపాటి కృష్ణమోహన్
శీర్షిక :- పాడియావు
సిసము 2)

భారికష్టముచేసి పాడియావుదెచ్చి
పచ్చగడ్డివేసె పాలకొరకు

ఎంతపిండినగాని ఏమిజేసినగాని
పాలి యియ్యదాయె పాడి యావు

అధిక పాల కొరకు అడ్డదారేగతి
పాడుసూదులిచ్చె పాలు పితక

అప్పులు దీర్చింది అసువులు బాపింది
ప్రాణాలె ఫణిపెట్టి పాడియావు

ఆవె
మనిషి బతుకు కొరకు మారెను హీనంగ
గోవు కున్న దెంత గొప్పతనము
ఆవు చేసె మేలు అమ్మైన జేసునా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు

శీర్షిక :-
విశ్వ నగరం మన భాగ్యనగరం
సీస పద్యం 3)

గ్రేటర్లొ గెలిచారు గొప్పగా నిలిచారు
ఇచ్చిన హామీలు తీర్చ గలరు

నిత్యము నీరిచ్చు నిరతము విద్యుత్తు
స్కైవె రోడ్లనువేసి సొగసు తెచ్చు

కళ్యాణ లక్ష్మితో కన్నవారినిదోచె
వృద్దాప్య వికలాంగ ఫించనిచ్చె

రూపాయి బియ్యము రోజుకూలీలకు
బద్రతే ద్యేయంగ పలికినారు

ఆవె:-
స్వచ్చ హైద్రబాదు సొగసైన నగరంగ
తీర్చి దిద్ద గలదు తెగువ తోడ
అందమైనరోడ్లు అరుదైన టీహబ్బు
ఆసుపత్రులుండు అద్భుతంగ

భాగ్యనగర తీరు బహువిధముగనుండు
మారుచుండె నేడు మరవ కుండు
కేసియారుకారు కదిలేను జోరుగా
విశ్వ నగర కీర్తి వినుతి నెంచ

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

02/09/2016.
జి.కృష్ణమోహన్, జర్నలిస్టు:
శీర్షిక :- ప్రశాత్  శ్రావణి పరిణయము

సీసము 4

శ్రీనన్న మాయన్న శ్రీదేవి ఒదినమ్మ
ప్రేమాను రాగాలు పంచు జంట

సంద్యగుండేరావు సుకుమారి పుత్రిక
వియ్యమందుకొనగ వచ్చెముందు

వినయుడు విద్యుడు వరుడుప్రశాంతుడు
శ్రావణి పున్నాగ సాయి వధువు

కళ్యాణ గడియొచ్చె కాంతను చేపట్ట
దేవతలందించె దీవెనలను

ఆవె'-
ప్రశ్శు నాగ సాయి పరిణయ మాడంగ
బందు జనులు జేరె పందిరందు
పట్టు చీర కట్టి పడతులంతొకచోట
ముచ్చటించబట్టె ముదము తోడ


(మా పెద్దన్నయ్య చిన్న కొడుకు  చి. ప్రశాంత్, శ్రావణి వివాహ సందర్భంగా సీస పద్యం....)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


5)అనాధల బతుకు

అమ్మపిలుపులేక అలమటించెందరో
దిక్కుమొక్కులేక తిరుగు తుండె

అన్నదమ్ములులేక అక్కచెల్లెలులేక
బందుమితృలన్న తెలియ రాక

కడుపునొప్పొచ్చినా కాలునొప్పొచ్చినా
చేరదీసేవారు కానరారు

అయ్యొపాపమనిన ఆరాలుదీసినా
చిరునామ దొరకని జనులువారు

ఆవె
రాజుమారెనేమి రాతమారదుకద
కడుపు నిండదాయె కఠిన బతుకు
బక్క జిక్కి నాము బతకలేకున్నాము
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

6) అప్పు ఇల్లు

ఆస్తులన్నియమ్మి హైదరాబాదొస్తి
పూట కొరకు పాట్లు యెన్నొపడితి

కీలుబొమ్మలాగ కూలినాలిజేస్తు
ఆలిపిల్లనెల్ల అరుసు కుంటు

కాయకష్టముజేసి కాసులెనుకవేసి
ప్లాటు కొరకు పడరాని పాట్లు పడితి

ఇల్లుగట్టినాను అప్పుల పాలైన
అప్పుదీర్చితినేను ఇల్లు యమ్మి

ఆవె
అప్పు జేయ నేల ఇల్లుకట్టగనేల
ఇల్లు యమ్మి అప్పు దీర్చ నేల
యేమి జేదు మన్న యదృష్ట ముండాలి
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

7)
ప్రేమజూపించును పెద్దల పట్లెంతొ
తల్లి, సోదరుడన్న దండ్రి యన్న

పెదనాన, పెద్దమ్మ, బాబాయి పిన్నమ్మ
అమ్మమ్మ తాతయ్య అక్క యన్న

అత్తలు, మామలు అన్నలు ఒదినలు
చెల్లెలు తమ్ముని చేర దీసు

ఇరుగుపొరుగుయన్న ఊరిజనముయనిన
ప్రణయముతోనుండు ప్రణ్యదీపు

ఆవె
ప్రణ్యదీపు పుట్టె ఫిబ్రవరిపదిన
వంద యేళ్ళు నీవు హాయి గుండు
తలచినదితడువు దేవుడివ్వాలిర
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

ప్రేమతో... బాబాయి

8)
కళలకే చంద్రుడు కళారాధ్యుడితడు
కళలన్ని కలబోసె కవిమితృండు

ఎన్నికష్టాలున్న ఎన్నిబాదలుపడ్డ
అనుకున్నలక్ష్యాలు అధికమించె

పుట్టినదినమున పులకించె కవిమిత్ర
పిల్లపాపలతోడ చల్లగుండ

ఆయురారోగ్యము అష్టైశ్వర్యము
కోరుకొనుచుంటిని కోట్ల కెదగ

ఆవె
చంద్రుడన్నతెలుసు కవిమితృలందర్కి
చంద్రుడన్నతెలుసు కవనదారి
చంద్రుడేకదమరి కళలకు చంద్రుడు
చంస్రుడేను మరి దేవి పతుడు


9)
కడదాక నాతోడు కలసియుంటానంటు
మాయమాటలుజెప్పి కానరావె

నువ్వునేనొకటంటు నావెంటె నీవంటు
తోడులేకబతుకు దీనమాయె

సాయమే లేకున్న సేవలెన్నోజేస్తి
మాయరోగమువచ్చి మానదాయె

పిల్లలు ఇచ్చోట పద్మేమొ అచ్చోట
నాకుదిక్కెక్కడో చెప్పరాదె

ఆవె
అగ్ని సాక్షి తోడ తాలికట్టితిగాని
చివరి వరకు తోడు చూడ నైతి
మద్యలోనెవచ్చి మద్యలోవెల్లితే
ఏమికానుబతుకు ఒంటరైతి

10)
వృక్ష సంరక్షణ ప్రయుడు, సహస్ర కవి మితృలు, పెద్దలు శ్రీ దగ్గుపాటి పార్ధసారధి నాయుడుగారి జన్మదినం పురస్కరించుకొని చిరు పద్యకానుక

సీసము:-
వృక్షమన్నప్రీతి వృక్షమే సర్వము
వృక్షవిలాపాన్ని వినుతనెంచె

వృక్షరాధప్రియ వినయవిజయశీల
పార్ధసారధిగారి జన్మదినము

సాహితీపథములో వృక్షసంరక్షణ
విజయతీరంబున నడిపె ఘనుడు

వృక్షొరక్షతిరక్షః వీదులన్నియుచాట
పుస్తకముద్రణ పూనుకొనెను

ఆవె

దగ్గుపాటి వంశ ఘనతపెంచెనితడు
పార్ధసారధియనుపామరుండు
చెట్లపుట్టలయందు చీడపురుగులందు
జనులనెల్ల మేల్కొలిపినాడు

11)భానునికి గల నామాలతో సీస ప్రయోగము

భాస్కర దినకర భానుడు యంశుడు
అధ్వపతి యరుణ అంబరీష

అంబర రత్నము ఆంశుపత యినుడు
ఉషపుడు అధ్వగు ఉదరథి అద్రి

అశిరుడు కిరణుడు అశుగుడు అకుపార
ఆదిత్య అంబర ఆంశుమంత

అంబుజా హస్కర  అహిమాంశు ఉష్ణుడు
 అంబుతస్కర రవి ఆంశుమాలి

ఆవె
ఇరులుదాయిరులదాయిరులదొంగ ఇర్లుదొంగ ఇవముమేపరివము
యిన్నియన్నియనియెన్నొరవిపేర్లు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

12)
(స్త్రీకి గల నానార్దాలతో సీస పద్యము)

స్త్రీకిగలవుపేర్లు శతముకుపైగాను
యోషిత సుందరి వామ వనిత

సీమంతనీ వధూ సాధ్వీపతివ్రత ,
అధివిన్న ఇత్వరి అబల , యోష

పత్నిపాణి యువతి పెండ్లాము తలుని
కన్యకా జవ్వని కుమారి గౌరి

ధర్శణీ , చర్షణీ , బందకీ , ఆసతీ
రామణీ పాంసులా రంకులాడి

ఆవె
కాంత నారి లలన కామినీ యంగన
మత్త కాశిని సతి మహిశి యన్య
భార్య  జాయ వర్య భామినీ మానినీ
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

13)
కాకతీయులతోటి కదనరంగంబున
చిలకల గుట్టపై పోరుసల్పి

జంపన్న వాగులో ప్రాణాలు కోల్పోయి
అమరులైనిలిచారు అక్క చెల్లి

సమ్మక్క జంపన్న సారక్క నాగక్క
గిరిజన ప్రజల దిక్కు మొక్కు

మేడారమందున జాతరే జాతర
కోట్లాది భక్తుల కనుల పంట

ఆవె
63)
కోర్కె దీర యిచ్చు నిలువెత్తు బంగారు
భక్తి తోడ కొలుచి కోట్ల జనులు
సమ్మ సారలమ్మ జాతర యందున
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

14)
మేడారమేలేటి పగిడిద్ద రాజుకు
మేనమామౌతాడుమేడరాజు

తనపుత్రి సమ్మక్క గారాల పట్టిని
పగిడిద్దికియిచ్చి పెళ్ళి జేసే

వారకి కలిగిరి ముచ్చట్గ ముగ్గురు
సారక్క జంపన్న నాగులమ్మ

ప్రతాప రుద్రుని యెదిరించి వారంత
అసువులు బాసిరి జనము కొకరు

ఆత్మ గౌర వమ్ము అలనాటి నుండియే
మట్టి నున్న బలము మనకు నెపుడు
మన్య మంత మురిసె మనవార సత్వమే
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

15)
సెల్లుఫోనొచ్చింది సయ్యాట దెచ్చింది
ఇంట్లోన సవితిపోరోలెనిలిచె

బందుమిత్రులెవరు బయటనిలుచుండిన
మాటలన్నవిలేవు మొబైలు వలన

సెల్లుతోసెల్ఫీలు కెమరాల సరిజోడు
కంప్యూటరులతోటి పనులు లేవు

వీనుల విందుగా వీడియో కాలింగు
దూరభారాలను తీర్చిబెట్టె

ఆవె
పావురాలుబోయె ఉత్తరాలొచ్చెను
పోయె యుత్తరాలు పేజరొచ్చె
సెల్లె నేడు వాటి తలదన్నిపాయెరా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

16)
చెరువులో నీరున్న పంటచేలకుమేలు
         గలగల నీరున్న కాల్వ బారు

చెరువులో నీళ్ళుంటే జెగతిన నీరుండు
     నీళ్ళుంటే చెరువులో  నిండు బాయి

చెరువులో నీళ్ళుంటే చేపలొచ్చిజేరు
       చెరువులోనీరుంటె జీవముండు

చెరువులో నీరున్న చెంబుతో పనియేమి
            చెరువులో నీళ్ళున్న చింత లేదు

ఆవె
చెరువు వలన మేలు జంతుజీవాలకు
పక్షి కీటకాల బతుకు దెరువు
కాకతియులుతొవ్వె ఘనముగా చెరువులు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

1 comment:

  1. పొగడ నాతరము కాకున్నది
    నీ కవిత్వ సొగసు జూసి
    కందమున కళ కళ లాడుతావు
    సీసముతో సిత్రాలు చేస్తావు
    ఆట వెలదిన ఆటలాడుతావు
    అరె అరె క్రిష్ణా అందరి క్రిష్ణా
    మమతల క్రిష్ణా మోహన క్రిష్ణా
    క్రిష్ణా క్రిష్ణా "క్రిష్ణ మోహనా"
    🙏🙏👏👏👍👍

    నీ యమ్మార్బీ

    ReplyDelete