Tuesday, March 12, 2019

వీర సైనికా వందనం

వీర సైనికా వందనం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

వీరసైనికా నీకు వందనం
దేశ రక్షకా పాదాభివందనం ll2ll

అమ్మానాన్నలనొదిలి -
భార్యాబిడ్డలనొదిలి... ll2ll
దేశరక్షణ కొరకు
దేహాన్నే అర్పించే... ll వీర ll

ఎండనకా... వాననకా...
చలియనకా... భయమనకా... ll2ll
శతృమూకలతోటి
చిత్తుగ పోరాడేటి ll వీర ll

తీవ్రవాద దాడులతో...
ముష్కరుల ముప్పేటుతో.. ll2ll
అవయవాలు కోల్పోయి...
అవస్థలు పడుతున్నా... ll వీర ll

ఏసీలో కూర్చుంటూ...
దేశాన్నే అమ్ముకుంటూ... ll2ll
రాజకీయ రాబందుల
రాక్షస క్రీడలు చూస్తూ... ll వీర ll

నెలజీతము కొరకు నీవు
నేలతల్లి ఋణము దీర్చ... ll2ll
ప్రాణాలనె ఫణము బెట్ట
పయనిస్తివ శతృవైపు... ll వీర ll

యువతకు స్పూర్తివి నీవే
భవితకు బాద్షా నీవే... ll2ll
మరువబోము నీ తెగువ
మరణించక తిరిగిరా... ll వీర ll

వీరసైనికులకు వందనాలతో...
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు.
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

Friday, March 1, 2019

పెళ్ళికూతురు సాగనంపు పాట

పెళ్ళికూతురికి సాగనంపు పాట
రచన్ గోగులపాటి కృష్ణమోహన్

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...

పచ్చని పందిట్లో పరిణయమాడగా
ముక్కోటి దేవతలు దీవెనలె ఇవ్వగా

అక్షింతలే మీకు అయుష్షుగానూ...
అతిధి దేవుళ్ళంత ఆశీర్వదించగా

దీర్ఘ సుమంగళై వర్ధిల్లవమ్మా...
అందుకో అందరి ఆశీస్సులమ్మా

అమ్మ మాటలు నీవు ఆచరించమ్మా
నాన్న చెప్పిన నీతి మరువబోకమ్మా

అత్తాడపడుచుల అవహేళనలను
పెద్దమనసుతోటి ఆదరించమ్మా

ఇరుగుపొరుగు మాట జోరీగలాగా
వినకుండ ఉంటేనే వేవేల మేలు

కనుదాటనీకమ్మ కన్నీరునెపుడూ
చిరునవ్వె వెలుగాలి నీమొహమునందు

మెట్టింటి గౌరవం కాపాడవమ్మా
పుట్టింటి పరువును పోగొట్టకమ్మా

మగని వద్ద నీవు మురిపెంగ ఉంటూ
మగని గుండె లోన గుడిగట్టుకోమ్మా

అనుమానమన్నది దరిజేరనీకూ...
నీ నమ్మకమే నీకు శ్రీరమరక్షా....

మురిపెంగ పెరిగినా ముత్యాల బొమ్మా
ముత్తైదువగ నీవు గడుపదాటమ్మా...


గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653